Share News

వ్యవస్థల ప్రతిష్ఠ ఎందుకు దిగజారుతోంది?

ABN , Publish Date - May 29 , 2024 | 05:48 AM

ఆరు దశాబ్దాల క్రితం (1964లో) గోరఖ్ పూర్‌లో కేశవ్‌సింగ్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే నరసింగ్ నారాయణ్ పాండే అవినీతి కార్యకలాపాలపై ఒక కరపత్రం వెలువరించారు. కేశవ్‌సింగ్‌ను...

వ్యవస్థల ప్రతిష్ఠ ఎందుకు దిగజారుతోంది?

ఆరు దశాబ్దాల క్రితం (1964లో) గోరఖ్ పూర్‌లో కేశవ్‌సింగ్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే నరసింగ్ నారాయణ్ పాండే అవినీతి కార్యకలాపాలపై ఒక కరపత్రం వెలువరించారు. కేశవ్‌సింగ్‌ను సదరు ఎమ్మెల్యే పల్లెత్తు మాట కూడా అనలేదు. ఒక ఎమ్మెల్యేగా తన హక్కులకు ఉల్లంఘన జరిగిందని ఆయన శాసన సభకు ఫిర్యాదు చేశారు. శాసనసభ కేశవ్‌సింగ్‌ను పిలిచి నిలదీసింది. ఆ కరపత్రంలో తాను పేర్కొన్న ఆరోపణలన్నీ సత్యాలేనని, వాటిపై దర్యాప్తు జరిపించకుండా తనను నిందించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని కేశవ్‌సింగ్‌ అన్నారు. దీనితో ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ ఆయనను ఏడు రోజుల పాటు జైలుకు పంపాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఒక న్యాయవాది అలహాబాద్ హై కోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు అసెంబ్లీ తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నసిరుల్లా బేగ్, జస్టిస్ జిడి షెహగల్ కేశవ్‌సింగ్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని తీర్పు ఇచ్చారు.


ఒక చట్టసభ చేసిన తీర్మానాన్ని కోర్టు వ్యతిరేకించడమా? అని యూపీ శాసనసభ ఆగ్రహించింది. కేశవ్‌సింగ్‌, ఆయన తరఫు న్యాయవాది సోలోమన్‌లతో పాటు తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తులను అసెంబ్లీ ముందు హాజరుపరచాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసింది. అసెంబ్లీ నిర్ణయంపై ఇద్దరు న్యాయమూర్తులు కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని అధికరణ 211 ప్రకారం న్యాయమూర్తుల వ్యవహార శైలిపై చర్చించకూడదనే నిబంధనను అసెంబ్లీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కావడంతో హైకోర్టుకు చెందిన మొత్తం 28 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్ విచారణ జరిపింది. తమ న్యాయమూర్తులను అరెస్టు చేయవద్దని వారు ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసెంబ్లీ చివరకు న్యాయమూర్తులపై వారంట్లను ఉపసంహరించుకుంది కాని విషయం అప్పటికి ఢిల్లీ దాకా పొక్కింది. న్యాయవ్యవస్థకూ, చట్టసభకూ ఏర్పడిన ఈ ఘర్షణతో ఆందోళన చెందిన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న గజేంద్ర గడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించి కేశవ్‌సింగ్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరైనదేనని పేర్కొంది. అధికరణ 21 ప్రకారం కేశవ్‌సింగ్‌కు జీవించే హక్కు ఉన్నదని తెలిపింది. అంతేకాక అధికరణ 211 క్రింద హైకోర్టు నిర్ణయాధికారాన్ని ప్రశ్నించే అధికారం అసెంబ్లీకి లేదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులకు వారంట్ జారీ చేయడం కానీ, వివరణ కోరడం కానీ అసెంబ్లీ పరిధిలో లేదని స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న ఒక న్యాయమూర్తి మాత్రం ఈ తీర్పుకు అంగీకరించకుండా అసమ్మతి తీర్పును ఇచ్చారు. ఒక వ్యక్తి ధిక్కారానికి పాల్పడ్డారా లేదా అని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నదని అన్నారు. ఏమైనా చట్టసభల హక్కుల కన్నా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమని సుప్రీంకోర్టు నాడు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై చాలా విమర్శలు తలెత్తాయి. శానస సభాధిపతుల సమావేశంలోనూ చర్చించారు.

ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు, రాజ్యాంగ నిపుణుడైన చింతన్ చంద్రచూడ్ ‘భారతదేశం మరిచిపోయిన కేసులు’ అన్న పేరుతో రాసిన పుస్తకంలో ఇలాంటి కథనాలు ఎన్నో ఉన్నాయి. కేశవ్‌సింగ్ కథనం అప్పటికీ ఇప్పటికీ మారుతున్న వ్యవస్థల తీరును, క్షీణిస్తున్న విలువలను, పరిస్థితులను మనకు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై కరపత్రం ప్రచురించినందుకు ఆ విషయం చట్టసభలు, న్యాయవ్యవస్థ ఘర్షణ వరకూ వెళ్లింది. ప్రధానమంత్రితో పాటు ఉన్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. అదే కనుక ఇప్పుడు జరిగి ఉంటే?


స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ క్రమక్రమంగా వ్యవస్థల తీరుతెన్నులు ఎలా మారుతున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసేందుకు టాడాను పార్లమెంట్ ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేశారు. దాని సద్వినియోగం కన్నా దుర్వినియోగం జరిగిన సందర్భాలే ఎక్కువ. బొమ్మతుపాకితో కనిపించినందుకు ఒక వ్యక్తిని నాలుగేళ్లు టాడా క్రింద జైలులో వేశారు. దీపావళి సమయంలో పేల్చే సుత్లీబాంబు ఉన్నందుకు మరో వ్యక్తిని నాలుగేళ్లు జైలుపాలు చేశారు. పన్ను ఎగవేతదారులు, జర్నలిస్టులపై కూడా టాడాను ప్రయోగించారు. టాడా స్థానంలో అమలులోకి వచ్చిన చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ)ను కూడా అనేక సందర్భాల్లో నిర్విచక్షణగా ఉపయోగించారు. రానురానూ ప్రభుత్వ నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు కొత్త అధికారాల్ని సంతరించుకున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం లాంటి వాటికి కొత్త కోరలు వచ్చాయి. ఇవన్నీ సామాన్యులకు ప్రతికూలంగా మారాయే కాని అనుకూలంగా లేవు. దేశంలో జైళ్లలో విచారణ లేకుండా మగ్గుతున్న ఖైదీల్లో సగం మంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలేనని ఒక నివేదిక పేర్కొంది. క్రిమినల్ లా చట్టాలు హిందీలో పేరు మార్చుకున్నాయే కాని వ్యవస్థలు సంపన్నులకు అనుకూలంగా అమలు అవుతుంటే అవి చేయగలిగింది ఏమీ లేదు. గత వారం పుణేలో ఒక రియల్ ఎస్టేట్ ధనవంతుడి మైనారిటీ తీరని తనయుడు తాగి ఇద్దరు యువతీ యువకులపై కారు నడిపి ప్రాణాలు తీస్తే, అతడికి పోలీసులు రాచమర్యాదలు చేయడం, పోలీస్ స్టేషన్‌లో పిజ్జా తినిపించడం, 12 గంటలైనా కేసు నమోదు చేయకపోవడం, డాక్టర్లు రక్తపు నమూనాలు మార్చడం, మరో డ్రైవర్‌ను కేసులో ఇరికించాలని చూడడం, స్థానిక ఎమ్మెల్యే, అతడి అనుయాయులు తలదూర్చడం ప్రజల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియా కనుక క్రియాశీలకంగా లేకపోతే, సీసీటీవీ ఫుటేజీలు వెలికి తీసి మీడియాకు ఎక్కించకపోతే ఈ దుర్మార్గం బయటపడేదేకాదు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నోరు విప్పేవారు కాదు. ఈ దేశంలో సంపన్నులు డబ్బుతో ఎవరి నోరైనా మూయించగలరని అర్థమయ్యేది కాదు. ఇదేనా మన వికసిత భారతం?


36 ఏళ్ల క్రితం 1988 జూలైలో ఒక రోజు అప్పటి పంజాబ్ డీజీపీ కెపిఎస్ గిల్ తప్పతాగి ఒక విందులో సీనియర్ మహిళా అధికారిణి రూపేన్ బజాజ్ వద్దకు వచ్చి ఆమె పృష్టభాగాన్ని గట్టిగా కొట్టిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఆమె ఉన్నతాధికారిణి కనుక దాదాపు 17 ఏళ్లు సుప్రీంకోర్టుతో సహా వివిధ కోర్టుల్లో పోరాడారు. 8 తీర్పులు వచ్చాయి. చివరకు గిల్ జైలుకు వెళ్లకుండా కేవలం మందలింపుతో బయటపడ్డారు. రూపేన్‌కు ఇచ్చిన రూ. 2లక్షల నష్టపరిహారాన్ని ఆమె తిరస్కరించారు. ‘నేను రోడ్డుపక్కన ఉండే మహిళనో, నాలుగో తరగతి ఉద్యోగినినో కాదు. మౌనంగా ఉండడానికి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె అన్నది నిజమే. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారమే దేశంలో మహిళలపై ఏటా 4.45 లక్షల నేరాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మహిళా కమిషన్ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై భౌతిక దాడి జరిగినందుకు బీజేపీ గగ్గోలు పెట్టడం సరైనదే కావచ్చు. కాని ఇదే బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ, భారత కుస్తీ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహిళా క్రీడాకారిణులు ఏడాదికి పైగా నిరసన తెలిపినా నోరు విప్పలేదు. కర్ణాటకలో తాము పొత్తు పెట్టుకున్న జనతాదళ్(ఎస్‌) అభ్యర్థి ప్రజ్వల్ కొన్నేళ్లుగా మహిళలపై అత్యాచారాలు జరిపినట్లు వీడియోలు బయటపడినా బీజేపీ సమర్థించుకోలేని దుస్థితిలో పడింది. దేశంలో ఎంత మంది మూడు దశాబ్దాల క్రితం రూపేన్ బజాజ్ పోరాడినట్లు పోరాడగలుగుతున్నారు?


అధికరణ 324 ప్రకారం ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్‌కే ఉంటాయి. కాని తన అధికారాల గురించి ప్రస్తుత ఎన్నికల కమిషన్ మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శేషన్ ఉన్నప్పుడు ఎన్నికలకు ఎన్ని వాహనాలు ఉపయోగించారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి వచ్చేది. రిటర్నింగ్ అధికారులు ఈ వాహనాల మీటర్లను చెక్ చేసి ఎన్నికల ఖర్చులపై రోజువారీ లెక్కలతో సరిపోల్చేవారు. ఎన్నికల ముందు 3లక్షల మందిని పైగా ముందస్తు అరెస్టులు చేయించిన శేషన్ ఒక దశలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు ఇద్దరు కేంద్రమంత్రులను తొలగించాల్సిందిగా ప్రధానమంత్రికే తాఖీదు పంపారు. ఇప్పుడా ధైర్యం ఎవరికైనా ఉన్నదా? శేషన్ ఎన్నికల ప్రవర్తనా నియామావళికి కోరల్ని సృష్టించి రాజకీయ పార్టీలపై కొరడా ఝుళిపించి ఎన్నికల ప్రక్రియకు ఒక గౌరవాన్ని కల్పించారు. కాని ఇప్పటి ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రితో సహా అధికారంలో ఉన్న పెద్దలు, ప్రతిపక్ష నేతలు ప్రవర్తనా నియమావళిని బాహటంగా ఉల్లంఘించినా నోరు మెదపకుండా మౌనంగా ఉంటోంది. మత ప్రాతిపదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, రాజ్యాంగానికి ఏర్పడే ప్రమాదం గురించి మాట్లాడవద్దని ఎన్నికల కమిషన్ బీజేపీ, కాంగ్రెస్‌లకు నోటీసులు పంపినా ఎవరూ లెక్కచేయడం లేదు. ప్రధానమంత్రిపై మాట్లాడే ధైర్యం ఎన్నికల కమిషన్‌కు లేదని కాంగ్రెస్ నేతలకు తెలియడంతో వారు కూడా అదే స్థాయిలో ప్రచారానికి దిగుతున్నారు. తత్ఫలితంగా ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్ఠలు కోల్పోతోంది. ఒకప్పుడు వ్యవస్థలు తమ స్వయం ప్రతిపత్తి కాపాడుకునేందుకు ప్రయత్నించేవి. కాని అవి ఇప్పుడు గుడ్డి, మూగ, చెవిటి వంటి అవలక్షణాలకు లోనయ్యాయి. సుప్రీంకోర్టు మాత్రమే ఇటీవలి కాలంలో తన అస్తిత్వాన్ని ఎంతో కొంత నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కాని ఈ అస్తిత్వం కూడా భవిష్యత్తులో ఎంతమేరకు కొనసాగుతుందో చెప్పలేము.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - May 29 , 2024 | 05:48 AM