Share News

మోదీ మ్యాజిక్ ఏమయింది?

ABN , Publish Date - Jun 06 , 2024 | 02:54 AM

‘రాసిన అక్షరం కన్నా ఉపన్యాసాలే జనాన్ని ప్రభావితం చేస్తాయని నాకు తెలుసు. మహా మహా రచయితలు సాధించలేని మార్పు ఈ భూమిపై గొప్ప వక్తలే సాధించారు’ అని జర్మనీ నియంత...

మోదీ మ్యాజిక్ ఏమయింది?

‘రాసిన అక్షరం కన్నా ఉపన్యాసాలే జనాన్ని ప్రభావితం చేస్తాయని నాకు తెలుసు. మహా మహా రచయితలు సాధించలేని మార్పు ఈ భూమిపై గొప్ప వక్తలే సాధించారు’ అని జర్మనీ నియంత హిట్లర్ తన ఆత్మకథ ‘మెయిన్ కాంఫ్’ (ఆంగ్లంలో ‘మై స్ట్రగుల్’) ముందుమాటలో రాశారు. కాని నేతలు ఎంత గొప్ప వక్తలైనా వారి మాటల్లో నిజాయితీ లేకపోతే, రోజుకో రకంగా మాట్లాడితే, మాట్లాడిన మాటల్లో అబద్ధాలున్నాయని తేలితే ప్రజలు ఆ మాటల్ని విశ్వసించరని ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసని మంగళవారం నాడు వెల్లడైన 18వ సార్వత్రక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫలితాలను సువర్ణ ఘట్టంగా భావించవచ్చు.

ఒక దశాబ్ద కాలం (2014–24)లో దేశంలో అన్ని వ్యవస్థలపై పట్టు సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తానేమి చేసినా ప్రజలు హర్షిస్తారని, కేవలం తన ప్రచారంతోనే వారు మైమరిచిపోయి బీజేపీకి పట్టం కడతారని ఆశించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆయన దాదాపు 200 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. వివిధ భాషల్లో కనీసం 50 టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్నికలు లేనప్పుడు కూడా ఆయన నెలకు కనీసం 20 ప్రసంగాలు చేశారు. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా యుగం కనుక తన హావభావాలతోనూ, ధ్యానముద్రలతోనూ కూడా జనాన్ని ఆయన ప్రభావితం చేయాలనుకున్నారు. తన పేరును తానే వందలసార్లు ఉచ్చరించారు. బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ మోదీయే అసలైన స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం నుంచి రాముడి ప్రాణప్రతిష్ఠ వరకు తానొక్కడే అన్నట్లుగా వ్యవహరించారు. పదే పదే ఒకే మాట చెబితే జనం నమ్ముతారేమోనని భావించి చార్ సౌ పార్ (400కు పైగా) సీట్లు సాధిస్తామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ ఈ సారి 50 సీట్లు కూడా దాటదని చెప్పారు. తానేది చెబితే జనం అది నమ్ముతారని పరిపూర్ణంగా విశ్వసించిన మోదీ ప్రతిపక్షాలు ప్రజల వనరులను ముస్లింలకు పంచిపెడతారని చెప్పేందుకు కూడా వెనుకాడలేదు. మహాత్ముడిపై రిచర్డ్ అటెన్ బరో సినిమా తీయకముందు గాంధీ ఎవరో లోకానికి తెలియదని చెప్పేందుకు కూడా ఆయన తెగించారు!


రోజురోజుకూ ఒక వ్యక్తి కేంద్రీకృత వ్యవస్థగా మారిన భారతీయ జనతా పార్టీకి మోదీ తిరుగులేని నాయకుడే కావచ్చు. ఆయన నాయకత్వానికి ఆయనే ముగ్ధుడై తనది కారణ జన్మ అని, దేవుడే తనను పంపించాడని చెప్పుకున్నారు. పూరీ జగన్నాథుడే మోదీ భక్తుడని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు వాక్రుచ్చారు. మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణపరంగా ఎంతో ఎదిగిపోయిందని, దానికి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ అవసరం ఇక ఏ మాత్రం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాయే ప్రకటించారు. గంటకు పైగా ఇంటర్వ్యూలు చేయడం తప్ప ప్రజల మనసుల్లో ఉన్న ప్రశ్నలను లేవనెత్తాలని జర్నలిస్టుల రూపంలో వచ్చిన టీవీ ప్రతినిధులు కూడా అనుకోలేదు. ఏమైతేనేం దాదాపు 80 రోజులుగా జరిగిన ఎన్నికల ఘట్టంలో ఎన్నో నాటకీయ దృశ్యాలు, భావోద్వేగ ప్రసంగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చూసే అవకాశం కలిగింది. అంతిమంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన దాదాపు డజన్ సంస్థలు ఎన్డీఏకు 350కి పైగా స్థానాలు లభిస్తాయని, మోదీ అన్నట్లుగా 400 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రకటించడంతో ఈ దేశంలో మీడియా సంస్థల ధైర్యం ఎంత దిగజారిపోయిందో, ఎందుకు వారు భయోత్పాతానికి గురయ్యారో అర్థం అవుతుంది. కేవలం షేర్ మార్కెట్ పతనం కాకుండా ఉండేందుకే వారు అలా చేశారా అన్న అనుమానాలూ లేకపోలేదు.

నిజానికి మోదీని ఢీకొనడం అంత సులభం కాదని, ఆయన ఏ విధంగానైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్లలో మార్పులు చేయడం, సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రతిపాదించినవారు రిటర్నింగ్ అధికారి వద్దకు రాలేకపోవడం, ఇండోర్‌లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్టు కావడం వంటి ఘట్టాల తర్వాత ఇక మోదీ ఘన విజయాన్ని ఎవరు ఆపగలరులే అని చాలా మంది భావించారు. ఈడీ, సిబిఐ వంటి సంస్థలు సృష్టించిన భయోత్పాతం అంతా ఇంతా కాదు. పార్లమెంట్‌లో చర్చలు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా బిల్లులు ఆమోదించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందనిపించింది. ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పుతో బీజేపీ అక్రమ నిధుల వసూళ్ల గురించి జనానికి తెలిసినా పెద్దగా పట్టించుకోరేమో అనిపించింది. కాని ఆశ్చర్యకరంగా ఎన్నికల ఫలితాలను చూస్తే మోదీ మాయాజాలం చాలా మటుకు మాయమైపోయినట్లు అర్థమవుతోంది.


నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవసరమైనంత సంఘటితంగా పనిచేయలేదు. ఇండియా కూటమి ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీలో సీనియర్ నాయకుడు నితీశ్ కుమార్ ప్లేటు ఫిరాయించి మరోసారి బీజేపీతో చేతులు కలిపారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి సభ్యులకు తగినన్ని సీట్లు ఇచ్చేది లేదని చెప్పేశారు. పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపచేయడంతో ఆ సంస్థ ఆర్థికంగా బలహీనపడింది. మధ్యప్రదేశ్, హర్యానాలాంటి చోట్ల బలమైన కాంగ్రెస్ నేతల్ని బీజేపీ తన వైపునకు తిప్పుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీలను నిలువునా చీల్చారు. ఎన్నో బలహీనతలు, సమస్యలు, వనరుల లోపాల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రతిపక్షాలు ప్రచారాన్ని నిర్వహించాయి. మోదీ, ఆయన దళం చేసిన భారీ ప్రచారం ముందు ప్రతిపక్షాల ప్రచారం వెలవెలబోయినట్లు కనిపించింది. అయినప్పటికీ ఇవాళ బీజేపీ గత రెండు ఎన్నికల్లో మాదిరి మెజారిటీ సీట్లు సాధించలేకపోవడం, ఇండియా కూటమికీ, ఎన్డీఏకు మధ్య సీట్ల వ్యత్యాసం బాగా తగ్గిపోవడం మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని జనం కోరుకోవడం లేదని అనుకోవడానికి ఆస్కారం కలిగిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ కంచుకోటలో సగానికి సగం సీట్లు కోల్పోవడం, అయోధ్య భాగంగా ఉన్న పైజాబాద్‌లోనే బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం దేనికి సంకేతం? గతంలో కూడా బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అయోధ్యలో నాడు కూడా బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రామమందిర నిర్మాణం తర్వాత కూడా యూపీలో బీజేపీ ప్రాభవం తగ్గిపోవడం ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? రామమందిర నిర్మాణం కల్పించిన భావోద్వేగాలు పొంగే కాని, వాపు కాదని, ఈ దేశంలో మతాన్ని రాజకీయాలతో సమ్మిళితం చేయడాన్ని రాజ్యాన్ని ప్రజలు విశ్వసించడం లేదని అనుకోవాలా? లేక ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతాన్ని తన స్వంత రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని జనం హర్షించడం లేదని భావించాలా? నిజానికి మోదీ వన్ మాన్ షోను కొందరు ఆర్ఎస్ఎస్ నేతలే హర్షించలేదు. ఈ ఎన్నికల్లో మోదీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతేనే మంచిదని, వస్తే తమను కూడా లెక్కచేయరని అనుకున్న ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఉన్నారు. ఎందుకో నాగపూర్ కూడా ఈ సారి అన్యమనస్కంగానే వ్యవహరించింది. ఆర్ఎస్ఎస్ పూర్తిగా బీజేపీని వదిలేస్తే ఈ 240 సీట్లు కూడా వచ్చేవి కావని అనుకునేవారు ఉన్నారు.


నిజానికి బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఒరిజినల్ బీజేపీ నేతలకన్నా బయటి పార్టీ నుంచి వచ్చిన వారు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఉదాహరణకు తెలంగాణలో బీజేపీనుంచి గెలిచిన వారిలో సగానికి పైగా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. కేరళలో సినీనటుడు సురేష్ గోపి బీజేపీ బలంతో కన్నా తన వ్యక్తిగత ఆకర్షణ ఆధారంతో గెలిచారనవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మద్దతు లేకపోతే బీజేపీకి అసెంబ్లీలో కాని, పార్లమెంట్‌లో కాని ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అందువల్ల మోదీ మూలంగానే బీజేపీకి ప్రాభవం ఏర్పడిందని చెప్పడానికి వీల్లేదు. 2014లో కొన్ని సామాజిక, చారిత్రక, ఆర్థిక కారణాల వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. పుల్వామా, బాలాకోట్ సంఘటనలు జరగకపోతే 2019లో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చేది కాదని చెప్పేవారు కూడా లేకపోలేదు. 2024లో కేవలం మోదీ పేరును మార్మోగిస్తే సరిపోదని తేలిపోయింది.

ఏమైతేనేం పది సంవత్సరాల తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రెండుసార్లు అఖండమైన మెజారిటీతో బీజేపీని గెలిపించినప్పటికీ మోదీ మళ్లీ దేశం సంకీర్ణ యుగంలోకి వెళ్లకుండా చేయలేకపోయారు. ఇది కూడా మంచి పరిణామమే. రాష్ట్రాల ఆకాంక్షలను విస్మరించకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. నిజానికి ఈ పదేళ్లు ప్రజాస్వామికంగా, ఏకాభిప్రాయ సాధనతో పరిపాలన సాగించి ఉంటే, ప్రతిపక్షాలనూ విశ్వాసంలోకి తీసుకుని ఉంటే, అన్ని వ్యవస్థల్నీ నియంత్రణలోకి తీసుకోకుండా వాటిని పారదర్శకంగా స్వేచ్ఛగా పని చేయించి ఉంటే, ఏడాదికి కనీసం ఒక్క విలేఖరుల సమావేశమైనా నిర్వహించి అరమరికలు లేకుండా మాట్లాడి ఉంటే, ప్రతిపక్షాలను అణచివేయాలన్న ఆలోచనను వదిలిపెట్టి ఉంటే మోదీ మళ్లీ భారీ మెజారిటీతో తిరిగి వచ్చేవారేమో. ఒక బలమైన వ్యవస్థ, బలమైన భావజాలం ఉన్నప్పటికీ అవి ఒక వ్యక్తి చుట్టూ తిరిగితే విజయవంతం కాలేవని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jun 06 , 2024 | 02:54 AM