Share News

నైతిక నిష్ఠ లేని నరేంద్రుడు

ABN , Publish Date - Feb 21 , 2024 | 02:58 AM

ఏ నాయకుడైనా పార్టీని గెలిపించినంత కాలం ఆ పార్టీ కార్యకర్తలందరూ ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసల వర్షం కురిపించడం సహజం. ఆ నాయకుడి పొరపాట్లను ప్రస్తావించడం, చేసిన పనులను...

నైతిక నిష్ఠ లేని నరేంద్రుడు

ఏ నాయకుడైనా పార్టీని గెలిపించినంత కాలం ఆ పార్టీ కార్యకర్తలందరూ ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసల వర్షం కురిపించడం సహజం. ఆ నాయకుడి పొరపాట్లను ప్రస్తావించడం, చేసిన పనులను విమర్శనాత్మకంగా సమీక్షించే సాహసం ఎవరికీ ఉండదు. వందిమాగధ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలను మించిపోయింది. ‘మీరు ప్రతిపక్షాలు చేసే విమర్శల జోలికి పోకండి.. మనమేమి చేశామో ప్రజలకు చెప్పండి చాలు.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17, 18 తేదీల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ సదస్సులో నేతలకు ఉద్బోధించారు. బీజేపీ జాతీయ సదస్సులో వక్తలందరూ మోదీని ఆకాశానికెత్తుతూ ప్రసంగాలు చేయడంలో పోటీ పడ్డారు. పేరుకు ప్రవేశపెట్టింది రాజకీయ, ఆర్థిక తీర్మానాలైనప్పటికీ అవి మోదీ అభినందన తీర్మానాలనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి పేరాలో కనీసం రెండుసార్లు మోదీ అన్న పేరు లేకుండా తీర్మానాలను లిఖించలేదు. ‘ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు పోటీ చేశారన్న దానితో ప్రమేయం లేదు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి కమలమే.’ అని మోదీ అన్నారు. కాని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి మోదీయే అన్న విషయం పోటీ చేసే వారందరికీ తెలుసు. పార్టీ పేరుతో కాకుండా ‘మోదీ గ్యారంటీ’ పేరుతో ప్రధానమంత్రే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నప్పుడు పార్టీ కన్నా నేతకే ఎక్కువ ప్రాధాన్యముంటుందన్న విషయం స్పష్టమే కదా!

రెండు రోజుల జాతీయ సదస్సులో బీజేపీ నేతలకు స్పష్టమైంది ఒక్కటే. ఒక వైపు రామభజన చేస్తూనే మరో వైపు మోదీ భజన చేస్తే సరిపోతుందని వారికి అర్థమైంది. ఈ రెండే ఎన్నికల్లో గెలిచేందుకు తారక మంత్రమని నేతలంతా వారికి దిశా నిర్దేశం చేశారు. బీజేపీ ఒక్కటే ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని కూడా ప్రధానితో సహా నేతలంతా భారీ లక్ష్యాన్ని విధించారు. కాని 370 సీట్లు సాధించడం అంత కష్టమని వారికి కూడా తెలియనిది కాదు. పుల్వామా, బాలాకోట్ ఘటనల తర్వాత కూడా బీజేపీకి 303 సీట్లు దాటలేదు. మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా, హిమాచల్, మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏకు గతంలో అత్యధిక సీట్లు లభించాయి. ఈ సారి మళ్లీ అన్ని సీట్లు రావడంతో పాటు గతంలో ఓడిపోయిన స్థానాల్లోనూ బీజేపీ గెలవాలంటే దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీయాలి.

రామమందిరం, మోదీ ఆకర్షణ, వికసిత్ భారత్ వంటి పదాలతోనే ఈ ప్రభంజనం వీస్తుందన్న నమ్మకం బీజేపీ నేతలకే ఉంటే అందుకు సంబంధించిన ప్రచారంతోనే ఊదరగొట్టి మౌనంగా ఉండేవారు. ఒక వేళ మోదీ గాలి అంతగా వీసే అవకాశాలుంటే ఇండియా కూటమి పేరుతో దేశంలో ఇతర పార్టీలన్నీ ఏకం అయినా ఆయనను ఏమీ చేయలేకపోయేవారు. ‘మీరంతా ఒకవైపు, నేనొక్కడినీ మరో వైపు’ అని మోదీ గతంలో పార్లమెంట్‌లో ఛాతీ కూడా చరుచుకున్నారు. అటువంటప్పుడు ప్రతిపక్షాలను కూడా ఛిన్నాభిన్నం చేసేందుకు, దేశంలో ఉన్న ప్రతి బీజేపీయేతర పార్టీని బలహీనపరిచి సామదానభేద దండోపాయాలతో వారిని వశపరుచుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కేవలం తమ కంటే బాగా దేశాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరని, కాంగ్రెస్ పాలనలో దేశం భ్రష్టుపట్టిందనే ప్రచారాలతోనే ప్రజలను వశపరుచుకోలేమన్న అపనమ్మకం ఉండడమే అందుకు కారణమా?

‘ప్రతిపక్ష నేతలను భయపెట్టడం ద్వారా మీరు వారిని మీ పార్టీలోకి ఎందుకు లాగుతున్నారు. ఇది మంచిదేనా? అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని పార్లమెంట్‌లో ప్రశ్నించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ‘మేము ఎవర్నీ మా వైపు లాగడం లేదు, వారే వస్తానంటే మేమేం చేయగలం? మా ప్రభుత్వ పాలన చూసి ఆకర్షితులై మా పార్టీలోకి వస్తున్నారు’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జవాబు చెప్పారు. ఇందులో ఎంత నిజం ఉన్నదో చేరిన వారికి, చేర్చుకున్న వారికే తెలియాలి.

గత ఏడాది జూలైలోనే ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఓబీసీ నేతల్ని బీజేపీలో చేర్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన శాలినీ యాదవ్ కూడా వీరిలో ఉన్నారు. సమాజ్‌వాది, బహుజన సమాజ్, ఆర్ఎల్‌డి పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం బీజేపీ నిరంతరం చేస్తూనే ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లను సాధించి సమాజ్‌వాది పార్టీ భవిష్యత్తును చెరిపేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నది. అంతేకాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను వశపరుచుకోవడమో, దెబ్బతీయడమో లక్ష్యంగా బీజేపీ ఎన్నో చర్యలు తీసుకుంది. బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు), కర్ణాటకలో జెడి(ఎస్), మహారాష్ట్రలో శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్) బీజేపీ ఛత్రఛాయలోకి క్రమంగా వచ్చాయి. అకాలీదళ్, ఆర్ఎల్‌డి ఆ మార్గంలో ఉన్నాయి. మరికొన్ని పార్టీలకు కూడా ఈ మార్గాన్ని అవలంబించక తప్పని పరిస్థితి బీజేపీ కల్పించింది. ఇక ఇండియా కూటమిలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ, జెఎంఎం, తృణమూల్ కాంగ్రెస్‌లను భయ భ్రాంతులకు గురిచేసేందుకు రక రకాల శక్తులను ప్రయోగిస్తున్నారు.

ఏ విధంగానైనా 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు వీలుగా సాధ్యమైనంత మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతిపక్షాల్లోంచి ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు బీజేపీ ఏకంగా ఉపాధి మేళాలే ప్రారంభించింది. ఈ ఉపాధి మేళాల్లో పోస్టుల సంఖ్య అపరిమితం. ఇక అప్లై చేసుకున్న వారి విషయంలో పెండింగ్‌లో ఉన్న ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులు కూడా బుట్టదాఖలయే అవకాశాలున్నాయి. కేంద్ర సంస్థల దర్యాప్తులు నత్తనడకన సాగుతాయి. ఢిల్లీ పెద్దలు తలుచుకుంటే ఏ కేసులోనైనా ఉపశమనం లభిస్తుంది లేదా కొత్త కేసులు పుట్టుకొస్తాయి. కొందరికి చేరిన వెంటనే పదవులు లభిస్తాయి. జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి లభిస్తే, ఒకప్పుడు రాహుల్ గాంధీ కుడిభుజమైన యుపి నేత ఆర్‌పిఎన్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కాంగ్రెస్‌ను వదిలి షిండే శివసేనలో చేరిన మిలింద్ దేవరకు రాజ్యసభ పదవులు వరించాయి. బీజేపీలో ఉన్న వారికంటే కాంగ్రెస్ నుంచో మరో ప్రధాన పార్టీ నుంచో వచ్చిన వారికి మోదీ హయాంలో విలువ ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆపరేషన్ కమల్ ఆకర్షణకు ఎంతమంది లోనవుతారో చెప్పలేం.

బీజేపీ రెండు రోజుల జాతీయ సదస్సులో రామమందిరంపై చేసిన తీర్మానం అత్యంత ముఖ్యమైనది. రామమందిర నిర్మాణానికి పూర్తి ఘనత మోదీకే దక్కిందని ప్రశంసల వర్షం కురిపించిన పార్టీ నేతలు ఆయనను గజమాలలతో సత్కరించారు. ఇక మోదీ హయాంలో రామరాజ్యం ఏర్పడుతుందని, అది వేయేళ్లు కొనసాగుతోందని ప్రత్యేకంగా తీర్మానించారు. అందరికీ భాగస్వామ్యం కల్పించే రామరాజ్యం కావాలని వారు అభిలషించారు. అంటే ఇతర పార్టీలనేతలందర్నీ నయానో భయానో చేర్చుకుని భాగస్వామ్యం కల్పించడమని ఈ తీర్మానం ఉద్దేశమా?

రామరాజ్యం అనేది ప్రధానంగా నైతిక విలువలకు సంబంధించిన దృక్కోణం. కాని బీజేపీని రాజకీయంగా బలోపేతం చేసే అత్యధిక సీట్లు సాధించడమే పరమావధిగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. బెంగాల్‌లో సువేందు అధికారి నుంచి మహారాష్ట్రలో అశోక్ చవాన్ వరకు వందలాది నేతలు ఆర్థిక నేరాలకు పాల్పడినవారే. ముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కోసం నిర్మించిన ఆదర్శ్ హౌజింగ్ పథకంలోనే భారీ అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు అశోక్ చవాన్‌పై ఉన్నాయి. సైనికులు, వారి కుటుంబాలకే కాకుండా అనేక మంది ఇతరులకు, చివరకు తన కుటుంబ సభ్యులకు కూడా ఫ్లాట్లు కేటాయించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్‌పై కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. తాము అధికారంలోకి వస్తే అశోక్ చవాన్‌ను జైలుకు పంపిస్తామని నరేంద్రమోదీ పదేళ్ల క్రితమే ప్రకటించారు. కాని పదేళ్ల తర్వాత అదే అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. అశోక్ చవాన్ మాత్రమే కాదు, ఎన్‌సిపిని చీల్చిన అజిత్ పవార్‌పై కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. బీజేపీలో చేరితే ఎన్ని కేసులున్నా నిర్భయంగా ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45(ఏ)ను రద్దు చేస్తే సగం మంది బీజేపీ నేతలు ఆ పార్టీలో ఉండరని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘నన్ను కూడా అవినీతి కేసులో ఇరికించారు కనుక బీజేపీలో చేరతానంటే చేర్చుకుంటారేమో?’ అని తృణమూల్ నేత మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు.

కార్పొరేట్లకు ప్రయోజనాలు కట్టబెట్టి, వారి నుంచి అక్రమ నిధులను పొందేందుకే ఎన్నికల బాండ్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే బీజేపీ నైతికతను ప్రశ్నించింది. ఆ తర్వాత చంఢీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన అక్రమాలను సుప్రీంకోర్టే బయటపెట్టడం బీజేపీకి మరో విఘాతం. వ్యవస్థల్ని అవినీతి నుంచి ప్రక్షాళన చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మోదీకి గెలవడం ప్రధానం. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదేమో!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Feb 21 , 2024 | 02:58 AM