Share News

నేతల భావ దారిద్ర్యం.. ఓటర్ల ఉదాసీనత

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:50 AM

అడుగు బయటికి పెడితే చాలు, వేడి గాలులు వేగంగా ముఖానికి తగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప...

నేతల భావ దారిద్ర్యం.. ఓటర్ల ఉదాసీనత

అడుగు బయటికి పెడితే చాలు, వేడి గాలులు వేగంగా ముఖానికి తగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ (ఎన్డీఎంఏ) ప్రజలను హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో నేతలు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు ప్రజల మధ్య చెమటోడ్చి తిరుగుతున్నారు. చాలా చోట్ల ఎండిపోతున్న పంటలు, బోరు బావులు, కరువు పరిస్థితులు, మంచినీటి సమస్య, విద్యుత్ కోతల మధ్య ప్రజలు నేతల ప్రసంగాలను ఉదాసీనంగా వింటున్నారు. ఒకరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే మరొకరు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. రైతులు, రైతుకూలీలే కాక, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. ప్రయాణీకులకోసం ఆశగా ఎదురు చూసే ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, సెవెన్ సీటర్లు నడుపుకునేవారు, జోమాటో, స్విగ్గీ వంటి సంస్థల్లో పనిచేసే ప్లాట్ ఫారమ్ వర్కర్లు మండుటెండల్లో జీవనోపాధి చేసుకోవాల్సిందే. నీతీ ఆయోగ్ నివేదిక ప్రకారమే వీరు మొత్తం శ్రమజీవుల్లో 80 శాతం పైగా ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి జీవన పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు తక్కువే.

ఈ పరిస్థితుల్లో తొలి దశలో 102 స్థానాలకు జరిగిన ఎన్నికలు చాలా పేలవంగా, అనాసక్తికరంగా జరగడంలో ఆశ్చర్యం లేదు. గతంలో కంటే ఈసారి నాలుగు శాతం తక్కువే ఓటింగ్ జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇవే చివరి ఎన్నికలు అని ఇండియా కూటమి ప్రచారం చేస్తే, ఒక అధునాతన భారత నిర్మాణం కోసం తాను కృషి చేస్తున్నానని, 2047 కల్లా అగ్రరాజ్యంగా మార్చడమే తన లక్ష్యమని మోదీ ప్రచారం చేస్తున్నారు. కాని ఈ ప్రచారాలేవీ ఓటర్లపై ప్రభావం చూపడం లేదు. దేశ భక్తి, జాతీయ వాదం, వికసిత్ భారత్, సామాజికన్యాయం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఫాసిజం, లౌకిక వాదం వంటి పదాలు నేతల పెదాల నుంచి బయటపడి గాలిలో కలిసిపోతున్నాయి. కాని ఓటర్లు నిర్లిప్తంగా, నిర్వికారంగా, నిశ్చల దృక్కులతో అన్ని ప్రసంగాలను వినడం తప్ప చేయదగింది ఏమీ లేదు. మండుటెండలు, తమ ఈతిబాధల కన్నా నాయకుల భావ దారిద్ర్యాన్ని చూసే ఎన్నికల పట్ల వారు ఏవగింపు ప్రదర్శిస్తున్నారేమో అనిపిస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లు గెలుచుకున్న మధ్యప్రదేశ్‌లో 20 ఏళ్లలో తొలిసారి తక్కువ ఓటింగ్ జరిగింది. రాజస్థాన్‌లో ఓటింగ్ 64 నుంచి 57 శాతానికి పడిపోయింది. బిహార్ లాంటి చోట్ల కేవలం 53 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. మోదీ అనేకసార్లు పర్యటించినా తమిళనాడులో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. కేవలం వేడి గాలులు, మండుటెండల వల్ల ఓటింగ్ శాతం తగ్గిందేమో అనుకుంటే ఉత్తరాఖండ్ వంటి పర్వత ప్రాంతాల్లో కూడా గతంలో కంటే ఆరు శాతం తక్కువగా నమోదైంది. ఓటు హక్కు విలువ గురించి సినిమా తారలనుంచి ఎందరో సెలబ్రిటీలతో ఉధృతంగా ప్రచారం చేయించినా ప్రయోజనం కనపడడం లేదు.

తన అద్భుత ప్రసంగాలకు ప్రజలు పరవశులై భారత దేశాన్ని శక్తిమంతమైన దేశంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని భావించి పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావించిన మోదీ మొదటి దశలో ఓటింగ్ జరిగిన తీరును చూసి నిరాశకు గురయ్యే ఉంటారు. యువ ఓటర్లను, ప్రధానంగా తొలిసారి ఓటర్లైన వారిని ఆకర్షించేందుకు ఆయన పదే పదే చేసిన ప్రసంగాలు వృథా అయినట్లు కనిపిస్తోంది. నిజానికి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతలో కేవలం 38 శాతం మంది మాత్రమే ఓటు హక్కుకు నమోదు చేసుకోవడమే ఈ దేశంలో యువతలో ఎన్నికల రాజకీయాల పట్ల ఏర్పడుతున్న అనాసక్తికి నిదర్శనం. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన ఎక్కడకు వెళ్లినా ‘మోదీ, మోదీ’ అని నినాదాలిచ్చిన యువత ఎక్కడకు వెళ్లింది? మోదీ పట్ల యువతకు ఆసక్తి తగ్గిపోతోందా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరు, మోదీ ఏకఛత్రాధిపత్యం, ఎన్నికల్లో అక్రమాలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఇవన్నీ ప్రజలకు ముఖ్యంగా యువతకు వ్యవస్థల తీరు పట్ల ఏహ్యభావం పుట్టిస్తున్నాయా?

ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారడం కూడా ఓటర్ల ఉదాసీనతకు కారణమేమో. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ గెలిచినట్లు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవంగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంభాని తనను ప్రతిపాదించిన ముగ్గురిలో ఒక్కరిని రిటర్నింగ్ అధికారి ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. దీనితో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఆ వెంటనే పోటీలో ఉన్న బిఎస్‌పి అభ్యర్థి సహా మిగతా 8 మంది నాటకీయంగా తమ నామినేషన్లనూ ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామం తర్వాత నీలేష్ కుంభానీ అదృశ్యమయ్యారు. ఎవరికీ ఫోన్‌లో కూడా దొరకకుండా తప్పించుకున్నారు. ఆయన ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఏదో ఒకరోజు సుముహూర్తంలో బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం ఈ రకంగా లభించింది. నెలన్నర క్రితం చండీగఢ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం దక్కేందుకు రిటర్నింగ్ అధికారి స్వయంగా బ్యాలట్ పత్రాలను చెరిపేసిన ఉదంతం జనం మరిచిపోకముందే సూరత్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న తీరు ప్రజాస్వామ్య ప్రహసనానికి మరో నిదర్శనంగా నిలిచింది. మునిసిపల్ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు బీజేపీకి ఆ లక్ష్యం ఎలాగైనా సాధించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు అవలంబించే మార్గాలపై ఎన్ని తీవ్ర విమర్శలు ఎదురైనా అది విననట్లు నటిస్తుంది.

మొదటి దశ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి, ప్రతిపక్షాల కూటమి లోపాల గురించి ఎక్కువగా మాట్లాడిన మోదీ రెండవ దశలో తన శైలిని మార్చి ప్రజలను మత ప్రాతిపదికన తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇదే ఆయన సహజ శైలి. గుజరాత్‌లో ఈ శైలి వల్లనే ఆయన హిందువుల ఓట్లను పూర్తిగా తన వైపునకు తిప్పుకుని విజయవంతం కాగలిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని, హిందువుల స్త్రీల మంగళ సూత్రాలపై కూడా కాంగ్రెస్ నేతల కళ్లు పడతాయని ప్రధానమంత్రి అంతటి స్థాయి వ్యక్తి ఉత్తరాదిన ఎన్నికల ప్రసంగాల్లో విమర్శించడం మత ప్రాతిపదికన ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగమేనని ఎవరికైనా అర్థమవుతుంది. ప్రజల కష్టార్జితాన్ని, విలువైన వస్తువులను చొరబాటుదారులకు, ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి దోచి పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వివిధ సామాజిక వర్గాలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడుతూ, వనరుల పంపిణీలో ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని మన్మోహన్ సింగ్ 18 సంవత్సరాల క్రితం క్రింద అన్న వ్యాఖ్యల్నీ మోదీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

జీ–20 లాంటి సమావేశాల్లో, సెమినార్లలో, మన్ కీ బాత్‌లో ఎంతో హుందాగా మాట్లాడుతున్నట్లు కనిపించే నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులను ఎదుర్కోవడం వరకు వచ్చేసరికి ఆయనలో అపరిచితుడు కనిపిస్తారు. శ్రావణ మాసంలో ప్రతిపక్షనేతలు మాంసం తింటారనే వ్యాఖ్యల్నీ చేసేందుకు ఆయన వెనుకాడడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అనేక అంశాలను విస్మరించి, దాన్ని ముస్లింలీగ్ మేనిఫెస్టోగా అభివర్ణించారు. గుజరాత్ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రచారం చేసిన రోజుల నుంచి ఆయన ఈ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. మత ప్రాతిపదికన చేసే ప్రసంగాలకు ఒక స్థాయి అంటూ ఉండాలని ఆశించడం అమాయకత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఈ ప్రసంగాలకు అడ్డుకట్ట వేస్తుందని అనుకోవడం మరీ అమాయకత్వం. మోదీ వ్యాఖ్యల విషయమై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై మీడియా అడిగిన ప్రశ్నలకు కనీసం వ్యాఖ్యానించడానికి కూడా ఎన్నికల కమిషన్ నిరాకరించింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఓటింగ్ శాతం చూసిన తర్వాత హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే సరైన మార్గమని మోదీ భావించి ఉంటారా అన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు 28 సీట్లు, రాజస్థాన్‌లో 25కు 24 సీట్లు, ఉత్తరాఖండ్‌లో 5కు 5 సీట్లు గెలుచుకుంది. ఈ సారి బీజేపీ ఇవే ఫలితాలు తిరిగి సాధిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఓటింగ్ శాతం తగ్గడంతో పాటు ఎగ్జిట్ పోల్స్ గురించి బీజేపీకి అనధికారికంగా కూడా సమాచారం లభించే ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆశిస్తున్న 400 సీట్ల లక్ష్యాన్ని ఎంతమేరకు సాధించగలదా అన్న చర్చ కూడా సాగుతోంది. మతపరమైన భావోద్వేగాలు కల్పించడం తప్ప తమకు వేరే మార్గం లేదని బీజేపీ భావిస్తోందా? ఈ మార్గంలోనైనా బీజేపీ సఫలీకృతం కాగలదా?

ఏమైనా ఒక్కో దశ సమీపిస్తున్న కొద్దీ దేశంలో బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు లక్ష్మణ రేఖల్ని దాటి అన్ని రకాల మార్గాల్నీ అవలంబించడంలో ఆశ్చర్యం లేదు. అది వాటి జీవన్మరణ సమస్య. కాని ఈ క్రమంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం మరణించకుండా చూసుకోవడం అందరికీ అవసరం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 24 , 2024 | 05:50 AM