Share News

నిజంగా ప్రజాస్వామ్యానికి అంతిమ ఘడియలా?

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:50 AM

అభ్యర్థుల ఎంపికలు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి. అసంతృప్తుల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ‘నేను కొన్ని దశాబ్దాలుగా నా నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. కాని ఉన్నట్లుండి బయటనుంచి ఒక వ్యక్తిని తీసుకువచ్చి...

నిజంగా ప్రజాస్వామ్యానికి అంతిమ ఘడియలా?

అభ్యర్థుల ఎంపికలు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి. అసంతృప్తుల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ‘నేను కొన్ని దశాబ్దాలుగా నా నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. కాని ఉన్నట్లుండి బయటనుంచి ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఆయనను ఎంపిక చేశారు. రాజకీయాల్లో డబ్బు, కులం ఆధిపత్యం పెరిగిపోయింది’ అని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వాపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పలు ప్రయత్నాలు చేసుకున్న వివిధ సామాజిక వర్గాలు నిరాశ చెందినట్లు కనిపిస్తున్నాయి. తమను ఉపయోగించుకోవడమే కాని, తమకు నిజమైన సామాజికాధికారం కల్పించే ఉద్దేశం ఎవరికీ లేదని పలువురు బడుగు, బలహీన వర్గాల నేతలు ఢిల్లీ దాకా వచ్చి మీడియాకు చెప్పుకుంటున్నారు. ఈ రణగొణ ధ్వనులు అన్ని పార్టీల్లో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలు చూడని వారు ఆయా పార్టీల నాయకులుగా రాత్రికి రాత్రి అవతరిస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో అతి సామాన్యులు లేరనే చెప్పాలి. అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకారం గత లోక్‍సభ ఎన్నికల్లో 25శాతం మంది ఎంపీలు వంద కోట్లకు పైగా ఆర్జించిన సంపన్నులైతే బీజేపీలో ప్రతి పదిమందిలో 9 మంది కోటీశ్వరులే. ఈడీ నిజాయితీగా పనిచేస్తే ఇవాళ దేశంలో సగానికిపైగా రాజకీయ నాయకులు కటకటాలు లెక్కపెట్టవలిసి వస్తుందని ఒక పార్టీ నేత చెప్పారు.

రాజకీయ పార్టీల్లో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ లోక్‍సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఉండనే ఉంటుంది. ‘ఇందులో ఉత్కంఠ ఏముంది? నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని ఢీకొనగల శక్తి దేశంలో ఎక్కడుంది? ఆయన మూడోసారి గెలిచే విషయంలో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యానించేవారు ఎక్కువగా ఉన్నారు. వీరు అసలు మోదీ మరోసారి విజయం సాధిస్తారా లేదా అన్న చర్చకే తావులేదని కొట్టి పారేస్తున్నారు. మోదీ కూడా ఇప్పటికే గెలిచానన్నట్లుగా మాట్లాడుతున్నారు. జూన్‌లో మరోసారి అధికారం చేపట్టిన తర్వాత వందరోజుల్లో తాను చేపట్టే కార్యక్రమాల గురించి ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారు. ‘గత పదేళ్లలో జరిగింది ట్రెయిలర్ మాత్రమే. ఇంకా చాలా చేయాల్సి ఉన్నది’ అని మోదీ మంగళవారం రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు.

మోదీ ఈ మాటలే ప్రతిపక్షాల్లోనూ, అనేకమంది ఇతర వర్గాల్లోను వణుకు పుట్టిస్తోంది. బహుశా బీజేపీలో కూడా ఈ విషయంపై అంతర్గత చర్చ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘రెండు సార్లు గెలిస్తేనే మోదీ ఇంత బీభత్సం సృష్టించారు. ఇక మూడోసారి ఆయన గెలిస్తే గాలి కూడా స్తంభించిపోతుందేమో’ అన్న భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల్ని జైలుకు పంపి, ఈడీ, ఐటీ సమన్లు, దర్యాప్తులతో, ఖాతాల స్తంభనతో వేధిస్తూ ఎన్నికల్లో విజయం సాధించడం ఒకరకంగా మాచ్ ఫిక్సింగ్‌తో సమానమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ‘ఇవి సాధారణ ఎన్నికలు కావు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగమే మారిపోతుంది. దేశాన్ని కాపాడి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి’ అని రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం రామ్ లీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో అన్నారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరిచిపోవాల్సిందేనని ఇదే సభలో మాట్లాడిన దాదాపు 27 మంది ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.

‘కృష్ణుడు కంసుడిని వధించకపోతే, కంసుడే కృష్ణుడిని వధించేవాడు’ అని ఒక ప్రవచన కర్త అన్నట్లుగా, రాజకీయాల్లో నేతలు ఎదురు దెబ్బలను తట్టుకుని నిలదొక్కుకోకపోతే ఇతరులు వారి భౌతిక కాయాలపై నడుచుకుంటూ వెళతారు. ఈ రీత్యా రాంలీలామైదాన్‌లో జరిగిన బహిరంగ సభను చూస్తే ప్రతిపక్షాలు కాడిని పడేయలేదని స్పష్టమవుతోంది. గత మూడునెలల్లో ప్రతిపక్షాలను కకావికలం చేసే అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇండియా కూటమి నుంచి జనతాదళ్ (యు) నేత నితీష్ కుమార్ తప్పుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపుకు తిప్పుకుంది. ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనఊపిరితో ఉన్నది. ఒక దిగ్బంధన వాతావరణంలో ప్రతిపక్షాలు అరివీర భయంకరుడైన మోదీని ఎదుర్కొనగలవా అన్న అనుమానాలు అంతటా నెలకొనడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలు చివరి పోరాటానికి సిద్ధపడినట్టే కనపడుతోంది. మార్చి 3న బిహార్‌లోని పట్నాలోని చరిత్రాత్మక గాంధీ మైదానంలో భారీ ఎత్తున జరిగిన జన విశ్వాస్ ర్యాలీ హిందీ బెల్ట్‌లో ప్రతిపక్షాల ఐక్యతను ప్రతిఫలించింది. ఆ తర్వాత మార్చి 17న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన ర్యాలీ, తాజాగా కేజ్రీవాల్, హిమంత్ సోరెన్ అరెస్టుని నిరసిస్తూ ఢిల్లీలో జరిగిన ర్యాలీ కూడా ప్రతిపక్షాల సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. ఇది మంచి పరిణామమే.

అయితే ‘నియంతృత్వాన్ని రూపుమాపండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ప్రతిపక్షాలు చేస్తున్న నినాదం ఎంతవరకు ప్రజల్లో చొచ్చుకుపోతోంది? నిజంగా ప్రజాస్వామ్యానికి అంతిమ ఘడియలు దాపురించినట్లు దేశ ప్రజలంతా నమ్ముతున్నారా? నమ్మినా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వారంతా ముందుకు వస్తారా? నేతల అరెస్టులు ప్రజల్లో ఎంత మేరకు సానుభూతిని కల్పిస్తాయి? అన్న ప్రశ్నలు వేసుకోవాల్సి ఉన్నది. 1977లో వివిధ పార్టీలు జనతా పార్టీ పేరిట ఏకమై 43.2 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించిన నాటి పరిస్థితులు దేశంలో ఏర్పడేలా చేయగలిగిన శక్తి నేటి ప్రతిపక్షాలకు ఉన్నదా అన్నది చర్చనీయాంశం. నిజానికి ప్రతిపక్షాలకు సంఘటితం కాగలిన, ప్రజలను చైతన్యం చేయగలిగిన నైతిక శక్తి ఉంటే విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 37.36శాతం ఓట్లు మాత్రమే లభించాయి. మిగతా 63 శాతం ఓట్లు ప్రతిపక్షాల ఓట్లుగా, సీట్లుగా ఎందుకు మారలేకపోయాయి? ఇది ఓటర్ల వైఫల్యం కానే కాదు. దేశంలో ప్రతిపక్షాల, ప్రత్యామ్నాయ శక్తుల వైఫల్యం. సిద్ధాంత రాహిత్యాల, భావ దారిద్ర్యాల ఫలితం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోదీ అనుసరిస్తున్న విధానాలను దేశంలో ప్రతిపక్షాలు, ఇతర చెదురుమదురు వర్గాలు మాత్రమే కాక ప్రపంచంలో పలు దేశాలు విమర్శిస్తున్నాయి. మోదీకి నీరాజనాలు పట్టిన అమెరికా కూడా రాజకీయ ప్రత్యర్థులపై వచ్చిన ఆరోపణలను పారదర్శకంగా, నిజాయితీగా, న్యాయపూరితంగా విచారించాలని ఆశించింది. జర్మనీ కూడా స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఉండాల్సిన ప్రమాణాలు, కనీస ప్రజాస్వామిక సూత్రాలు పాటించాలని ఆశించింది. ఇదే అమెరికా, జర్మనీ గత ఏడాది జీ–20 సమావేశాల్లో మోదీని ఆకాశానికి ఎత్తిన విషయం మరిచిపోరాదు. దేశ రాజధానిలో ఉండే రాయబార కార్యాలయ ప్రతినిధులే కాదు, ప్రతి విదేశీ మీడియా ప్రతినిధి జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. మోదీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ ఉన్నదని చెబుతూనే కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యంపై మచ్చలాంటిదని ‘ద ఎకనామిస్ట్’ వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడం అప్రజాస్వామికమని అనేక విదేశీ పత్రికలు విమర్శించాయి. ‘ప్రతి ఒక్కరి రాజకీయ, పౌర హక్కులను పరిరక్షించాలి. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే వాతావరణంలో ప్రజలు ఓటు వేయగలగాలి’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ నజరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మోదీని విదేశాల్లో ప్రశంసించినప్పుడు ఆర్భాటంగా చెప్పుకునే ఆయన భక్తులు ఈ విమర్శలను సీరియస్‌గా ఎందుకు పట్టించుకోవడం లేదు? తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదని అమెరికా, జర్మనీ రాయబారులను పిలిచి నిరసన తెలిపినంత మాత్రాన ప్రపంచం కళ్లు మూసుకుంటుందా? ఇదే మోదీ 2019లో అమెరికా వెళ్లి ‘అబ్ కీ బార్ ట్రంప్ కీ సర్కార్’ అని ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేయలేదా? ఇది ఆ దేశ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాదా?

బీజేపీ మూడోసారి గెలుస్తుందా, లేదా అన్న చర్చను ప్రక్కన పెడితే ఆ పార్టీ ఆత్మరక్షణలో ఉన్నందువల్లే తమపై విరుచుకుపడుతోందన్న సందేశం ప్రజలకు చేర్చడంలో ప్రతిపక్షాలు ఎంతో కొంత విజయం సాధించాయి. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని మోదీ ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటున్నప్పటికీ, ప్రతిపక్షాలన్నిటినీ అవినీతిపరులుగా ఒకే గాటన కడుతున్నప్పటికీ అందరూ దాన్ని విశ్వసిస్తున్నట్లు కనపడడం లేదు. ఈ విషయంలో మోదీ చేస్తున్న ప్రకటనల్లో నిజాయితీ లేదని, డొల్లతనం మాత్రమే ఉన్నదన్న ప్రచారం కూడా జనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు విస్మరించదగినవి కావు. డబ్బు తీసుకున్నట్లు రుజువుల్లేకపోయినా ఆరునెలలుగా ఆప్ నేత సంజయ్ సింగ్‌ను ఎందుకు జైల్లో పెట్టారని కూడా మంగళవారం సుప్రీం ప్రశ్నించడం ఈడీ పనితీరును సవాలు చేసింది. మోదీ కేవలం తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసమే ప్రత్యర్థులకు ఊపిరి సలపకుండా దాడులు చేయిస్తున్నారని, ఈ ఎన్నికలు పూర్తి ప్రజాస్వామికంగా జరగడం లేదని ప్రచారం కూడా జరగడం దేశంలో నెలకొని ఉన్న అనారోగ్యకర రాజకీయ వాతావరణానికి సంకేతం. పరిస్థితులు ఆరోగ్యకరంగా మార్చి దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయన్న సంకేతాలు పంపేందుకు మోదీకి ఇంకా సమయం దాటిపోలేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 03 , 2024 | 02:50 AM