Share News

చంద్రబాబు ముద్ర అద్వితీయం!

ABN , Publish Date - May 08 , 2024 | 12:29 AM

‘మీకు కొద్ది సేపటిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నుంచి ఫోన్ వస్తుంది. ఆయన ప్రతిపాదనను మీరు అంగీకరించండి. వద్దు అనకండి.’ అని 2002 జూన్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబ్దుల్ కలామ్‌కు ఫోన్ చేశారు...

చంద్రబాబు ముద్ర అద్వితీయం!

‘మీకు కొద్ది సేపటిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నుంచి ఫోన్ వస్తుంది. ఆయన ప్రతిపాదనను మీరు అంగీకరించండి. వద్దు అనకండి.’ అని 2002 జూన్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబ్దుల్ కలామ్‌కు ఫోన్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగానే వాజపేయి నుంచి ఫోన్ రానే వచ్చింది. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో కలామ్‌ను రాష్ట్రపతిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు వాజపేయి ఆయనకు చెప్పారు. అన్ని పార్టీలు తన పేరును అంగీకరిస్తే బాధ్యతలు స్వీకరించడానికి తనకు అభ్యంతరం లేదని కలామ్ ఆయనకు తెలిపారు. వాజపేయి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా మాట్లాడి అందుకు అంగీకరించేలా చేశారు. ఈ విషయాన్ని అబ్దుల్ కలామ్ స్వయంగా ‘టర్నింగ్ పాయింట్స్– : ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’ పేరిట తాను రాసిన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. కలామ్‌ను రాష్ట్రపతిగా ప్రకటిస్తూ ఎన్డీఏ ఏర్పాటు చేసిన సంయుక్త విలేఖరుల సమావేశంలో ఎన్డీఏ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్, చంద్రబాబునాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఉన్నారు. ఆ విలేఖరుల సమావేశం నాకింకా గుర్తుంది.


దేశ రాజకీయాల్లో చంద్రబాబు నిర్వహించిన పాత్ర గురించి అవహేళనగా మాట్లాడేవారికి ఈ ఒక్క ఉదాహరణను జవాబుగా పరిగణించవచ్చు. అదే విధంగా యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానమంత్రులుగా నియమించడంలోను, అప్పటి విధాన నిర్ణయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఏపీ భవన్‌లోనే చంద్రబాబు ఛాంబర్‌లో ఆ రోజుల్లో సమావేశాలు జరిగేవి. ఐకె గుజ్రాల్ పేరును సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ సూచించడంతో ఆయన పేరుపై కూడా చర్చలు జరిగాయి. తన పేరు కూడా ప్రతిపాదనల్లో రావడంతో గుజ్రాల్ చర్చల నుంచి వైదొలిగారు. చంద్రబాబు ఏపీ భవన్ స్వర్ణముఖి విభాగంలో ఒక సూట్ తెరిపించి అందులో పడుకోవల్సిందిగా గుజ్రాల్‌ను పంపారు. తెల్లవారు జామున 3 గంటలకు యుఎఫ్ నేతలు గుజ్రాల్‌ను లేపి ‘మిమ్మల్నే ప్రధానమంత్రిగా ఎంచుకున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబుతో ఆయన మంత్రివర్గ ఏర్పాటు, ఇతర విషయాల గురించి చర్చించి ఆరింటికి ఇంటికి వెళ్లారు. ‘ఏమి ఇంత ఆలస్యంగా వచ్చారు?’ అని గుజ్రాల్ భార్య ఆయనను నిలదీసింది. ‘అలా నిలదీస్తావేం. నీవు ఈ దేశ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నావు తెలుసా?’ అని గుజ్రాల్ చమత్కరించారు అని ప్రముఖ జర్నలిస్టు వీర్ సంఘ్వీ తన పుస్తకం ‘మాండేట్– విల్ ఆఫ్ ది పీపుల్’ అన్న పుస్తకంలో వివరించారు. గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాజపేయి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చంద్రబాబు ఇచ్చిన కీలక మద్దతే కారణమని వీర్ సంఘ్వీ ఇదే పుస్తకంలో తెలిపారు.


యునైటెడ్ ఫ్రంట్ హయాంలో కనీస ఉమ్మడి కార్యక్రమం పై చంద్రబాబు సమక్షంలో గంటల తరబడి చర్చలు జరిగేవి. జైపాల్ రెడ్డి, సూర్జిత్, బర్దన్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలతో ఆయన తరుచూ చర్చలు జరిపేవారు పెట్రోలు, డీజిల్ ధరలను ఒక్క రూపాయి పెంచాలన్నా యునైటెడ్ ఫ్రంట్ అగ్రనేతలు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించేవారు. వాజపేయి కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు సలహా లేకుండా నిర్ణయాలు తీసుకునేవారు కాదు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, పథకాలు రాబట్టేందుకు చంద్రబాబు తరుచూ ఢిల్లీ వచ్చేవారు. అయోధ్య అంశంపై కూడా వాజపేయి చంద్రబాబును 2003 ఫిబ్రవరి 16న పిలిచి చర్చలు జరిపారు. ‘మీరు సుప్రీంకోర్టు తీర్పుకే వదిలివేయడం మంచిద’ని చంద్రబాబు వాజపేయికి సలహా ఇచ్చారు. చివరకు అయోధ్య అంశం సుప్రీంకోర్టు వల్లే పరిష్కృతమయింది.

చంద్రబాబు రెండు కారణాల వల్ల జాతీయ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. మొదటిది సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కాగా రెండవది ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేసి, టెక్నాలజీని పరిపాలనలో సమర్థంగా ఉపయోగించడం. దీనివల్ల లభించే ఫలితాలను ఆయన చెప్పుకుంటే అతిశయోక్తులు మాట్లాడుతున్నారని విమర్శించేవారున్నారు కాని గురుచరణ్ సింగ్, చిదంబరం, శ్యామ్ పిట్రోడా, నందన్ నీలేకని, మార్క్‌టుల్లీ లాంటి ఆర్థిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, యుకె, అమెరికా యూనివర్సిటీల్లో పలువురు పరిశోధకులు తాము రాసిన పుస్తకాల్లో చంద్రబాబును ప్రశంసించారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగం డీన్ అయిన దబ్బాల రాజగోపాల్‌రాజ్ రెడ్డి ద్వారా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్‌ను నెలకొల్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు అన్ని విధాలా సహాయసహకారాలు అందించింది. అబ్దుల్ కలామ్ మిత్రుడైన ప్రొ. రాజీవ్ సంఘాల్‌కు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ‘హైదరాబాద్: ద ఫ్యూచర్ నాలెడ్జి హబ్ ఆఫ్ ద వరల్డ్’ అన్న పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బోర్డు సభ్యులను ఆకట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కూడా ‘మై లైఫ్’ అన్న తన పుస్తకంలో చంద్రబాబు తనను హైటెక్ సిటీకి ఆహ్వానించి అబ్బురపరిచిన విషయాన్ని రికార్డు చేశారు. బిల్‌గేట్స్‌ను కూడా ఆయన మెప్పించారు. చంద్రబాబు ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో ఒకప్పటి దక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ ‘సింప్లీ ఫ్లై’ అన్న పుస్తకంలో రాశారు. చంద్రబాబు హయాంలో ప్రోత్సాహం పొందిన పది, పదిహేను మంది పారిశ్రామికవేత్తలు ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తరించారు.


చంద్రబాబు ఆర్థిక విధానాలను, శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకున్న చర్యలను అనేక మంది విమర్శిస్తారు కాని ఆర్థిక సంస్కరణలు అమలైన తర్వాత ఈ చర్యలు పరస్పరం దోహదం కల్పించేవిగా మారాయి. చంద్రబాబు ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన వామపక్షాలు కూడా సంస్కరణలను అడ్డుకోవడం కష్టమని గ్రహించి తెలుగుదేశంతో రాజకీయంగా చేతులు కలిపాయి.

చంద్రబాబు మాదిరి ఏడు పదుల వయస్సు దాటిన, ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన అనేకమంది సీనియర్లు పలువురు ఇంకా క్రియాశీలకంగా ఉన్నారు కాని వారిలో చంద్రబాబు లాగా జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నవారు తక్కువే. చంద్రబాబుతో పాటు శరద్ పవార్, కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్, నవీన్ పట్నాయక్, నరేంద్రమోదీ, కె.చంద్రశేఖర్‌రావు తదితరుల పాత్ర ఈ ఎన్నికల తర్వాత ఎంతమేరకు ఉంటుందో మరో నాలుగు వారాల్లో తేలనుంది.

వీరిలో శరద్ పవార్ వయస్సు ఎనిమిది పదులు దాటినప్పటికీ ఆయనకూ, చంద్రబాబునాయుడుకూ సమీప పోలికలున్నాయి. ఇద్దరికీ 1978వ సంవత్సరం వారి రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి అతి కీలకమైన కాలం. 1978లో శరద్ పవార్ తన రాజకీయ గురువు వసంత్ దాదా పాటిల్‌పై తిరుగుబాటుచేసి ఒక కూటమి నేర్పాటు చేసి, అతి పిన్న వయస్సులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శరద్ పవార్‌కూ, ఇదే 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబునాయుడుకూ గాడ్ ఫాదర్స్ లేరు. రాజకీయాల్లో వారు తమ భవిష్యత్‌ను తాము నిర్మించుకున్నారు.


చంద్రబాబు కంటే నవీన్ పట్నాయక్ నాలుగేళ్లు పెద్ద అయినప్పటికీ 1997లో తండ్రి బిజూ పట్నాయక్ చనిపోయేంత వరకూ ఆయనకు రాజకీయాలతోను, ఒడిషా రాష్ట్రంతోనూ సంబంధాలు లేవు. ఈ రకంగా ఆయన చంద్రబాబుతో పోలిస్తే రాజకీయాల్లో దాదాపు రెండు దశాబ్దాల జూనియర్. దిగ్విజయ్ సింగ్ వారసత్వ రాజకీయాల్లోంచి వచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కమల్‌నాథ్ సంజయ్ గాంధీ డూన్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్ కావడంతో 1970లోనే యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నా, కేంద్రమంత్రిగా ఉన్నా, యూపీఏలో భాగస్వామిగా ఉన్నా ఒక్క తెలంగాణ తప్ప మరేదీ పట్టనట్లు వ్యవహరించారు. ఇక చంద్రబాబు కంటే నాలుగేళ్లు చిన్న అయిన నరేంద్రమోదీ 1971లో ఆర్ఎస్ఎస్‌లో చేరినప్పటికీ 1985 నుంచే భారతీయ జనతా పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. 1970లో యువజన కాంగ్రెస్‌లో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీయే ఆవిర్భవించలేదు. చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యేనాటికి మోదీ ఆర్ఎస్ఎస్‌లో విభాగ్ ప్రచారక్ మాత్రమే. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఆరేళ్లకు గాని 2001లో మోదీని ముఖ్యమంత్రి పదవి వరించలేదు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పోలిస్తే శరద్ పవార్ తర్వాత చంద్రబాబే సీనియర్. ఏడుపదులు దాటిన నేతల్లో నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు మాత్రమే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరందరిలో ఒక ప్రాంతీయ పార్టీని నాలుగు దశాబ్దాలనుంచి బలోపేతం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, ఇప్పుడు విభజిత ఏపీలోనూ ఆ పార్టీని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అంతేకాదు, అనేకమంది నేతలతో పోలిస్తే అత్యంత ప్రజాస్వామికవాదిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రులను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడకుండా ఏనాడూ తిరిగి వెళ్లలేదు. జగన్ మాదిరి ఒక పాత ప్రెస్ రిలీజ్‌ను వాట్సాప్‌లో పంపించే వికృత సంస్కృతిని వారు పాటించేవారు కాదు. చంద్రబాబు ఢిల్లీ వస్తే ఇప్పటికీ జాతీయ జర్నలిస్టులు ఆయనతో గంటలతరబడి చర్చిస్తారు. చంద్రబాబు మోదీని కలిసేందుకు వచ్చాడని తెలిసినప్పటికీ ఆయనను కలుసుకునేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు రావడాన్ని నేను గమనించాను.

‘మీరు మళ్లీ జాతీయ రాజకీయాల్లో ఏమైనా పాత్ర పోషించే అవకాశాలున్నాయా’ అని నేను ఇటీవల ప్రశ్నిస్తే ఆయన నవ్వి, ‘ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాల గురించి పట్టించుకునే సమయం ఎక్కడుంటుంది? జగన్ పాలన నుంచి ఏపీని విముక్తి చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా పునర్నిర్మించి అభివృద్ధి చేయడంపైనే ఇక నా పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాను’ అని జవాబు చెప్పారు!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - May 08 , 2024 | 12:29 AM