Share News

ఈసీ మాటలు నీటిపై రాతలేనా?

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:07 AM

‘మేము ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అనుమతించం..’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గత వారం విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ అన్నారు. కండబలం, ధన బలం, తప్పుడు సమాచారం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన..

ఈసీ మాటలు నీటిపై రాతలేనా?

‘మేము ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అనుమతించం..’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గత వారం విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ అన్నారు. కండబలం, ధన బలం, తప్పుడు సమాచారం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఈ నాలుగింటినీ సహించే ప్రసక్తి లేదు అని ఆయన చెప్పారు. ఈ ప్రకటన విన్నవారికి సీఈసీ ఎంతో నిజాయితీగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాని గత ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లు ఇదే విధమైన ప్రకటనలు చేశారు. ఈ దేశంలో అధికారులు కూడా బూటకపు ప్రకటనలు చేసే విషయంలో రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోరని గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. దాదాపు ఏడు దశలుగా షెడ్యూలు ప్రకటించిన నాటి నుంచి దాదాపు 75 రోజుల్లో ఏఏ చీకటి గుహల్లోంచి డబ్బులు బయటకు వస్తాయో ఎవరు కనిపెట్టగలరు? ఇక షెడ్యూలు ప్రకటించకముందు నిర్వహించిన భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు ఎక్కడి నుంచి డబ్బు ప్రవహిస్తోందో ఎవరైనా లెక్కవేసేవారున్నారా?

తెలంగాణలో గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంది అభ్యర్థులకు చివరి దశలో నిధులు పంపించలేదని, అందుకే వారు ఓడిపోయారని భారత రాష్ట్ర సమితి నేతలే పలువురు చెప్పారు. బహుశా అప్పటికే తాము ఎంత ఖర్చు పెట్టినా ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకుని ఉంటారని కేసీఆర్‌కు సమాచారం అందడంతో ఆయన ఎందుకైనా మంచిదని డబ్బులు పంపించకూడదని నిర్ణయించుకుని ఉంటారని వారు చెబుతున్నారు. ఇదే కేసీఆర్ అంతకుముందు మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారని, తమ పార్టీ నేతలే అన్నమాట ప్రకారం డబ్బు ఖర్చు పెట్టలేదని బీజేపీ నేతలు వాపోయారు. ఈ డబ్బుల ఖర్చు విషయంపై ఇద్దరు మాజీ ఎంపీల మధ్య వచ్చిన తగాదా చివరకు ఎలా చల్లారిందో కాని వారిద్దరూ ఇప్పుడు మరో అధికార పార్టీలో చేరారు. నిజానికి 2022 ఎన్నికల్లో ఢిల్లీ మద్యం కుంభకోణం డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా మార్గం ద్వారా గోవాకు మళ్లించినట్లు ఆధారాలు దొరికినందువల్లే తీగలాగితే డొంకకదిలినట్లు మొత్తం వ్యవహారం బయటపడిందని ఈడీ తన ఛార్జిషీటులో పేర్కొంది.

ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఒకదానికొకటి సహాయపడేందుకు ఎన్నికల నిధులు మళ్లిస్తే గతంలో ఎవరూ పట్టించుకునేవారు కాదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిధుల మళ్లింపుపై నిఘా పెట్టింది. సమాజ్‌వాది పార్టీ, జనతాదళ్ (యు), జనతాదళ్ (ఎస్), తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలకు ఎవరెవరు నిధులు పంపారో బీజేపీకి తెలిసినందువల్లనే పంపినవారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం బీజేపీకి సాధ్యపడిందని చెప్పక తప్పదు. దీని వల్ల భవిష్యత్ రాజకీయ సమీకరణల్ని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావితం చేయగలిగారు. తమ పార్టీకోసమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల కోసం కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని నేతలు భావిస్తున్నారంటే ఈ దేశంలో రాజకీయాల్లో ఎంత డబ్బు సమకూరుతుందో అర్థమవుతుంది. కేసీఆర్ తన పార్టీ పేరునే మార్చుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నించడం, భారీ ఎత్తున దేశంలో వందలాది పత్రికలకు సైతం ప్రకటనలు గుప్పించడం, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు సైతం నిధులు ఇవ్వచూపినట్లు ప్రచారం జరగడం, ఉప ఎన్నికల్లో సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంతో ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ధన బలం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది. 2014 ఎన్నికలకు ముందు అవినీతికి వ్యతిరేకంగా వేదికను ఏర్పాటు చేసి, అన్నాహజారేతో కలిసి యూపీఏకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి ప్రాచుర్యంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల కోసం భారీ ఎత్తున నిధులు సేకరించకపోతే ఇవాళ ఆత్మరక్షణలో పడి ఉండేది కాదు. ఈ పార్టీలే కాదు, దేశంలో ఉన్న మెజారిటీ ప్రాంతీయ పార్టీల అధినేతలు అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్ని ఎదుర్కొన్నవారే. భారతీయ జనతా పార్టీ ఈ బలహీనతల ఆధారంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. పోనీ అలా అని ఆ పార్టీ ఎన్నికల వ్యవస్థను ఏమైనా ప్రక్షాళనం చేయగలిగిందా అంటే అదీ లేదు. అన్ని సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగించుకుని రాజకీయ నిధుల సమీకరణలో బీజేపీ అన్ని పార్టీలను తలదన్నిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఎన్నికల బాండ్ల వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తంలో ధన ప్రవాహం జరుగుతోందని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ‘When Crime Pays: Money and Muscle in Indian Politics’ అని వాషింగ్టన్‌లో కార్నెగీ ఎండోవ్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న మిలన్ వైష్ణవ్ రాసిన పుస్తకంలో రాజకీయాల్లోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయో వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం రూ. 9లక్షల మేరకే ఆస్తులు ఉన్న జగన్ నికర ఆస్తుల విలువ 2014 నాటికి రూ. 400 కోట్లకు పైగా దాటిందని ఆయన తెలిపారు. భారీ ఎత్తున సంపాదించి ఉండకపోతే కాంగ్రెస్ పార్టీనే ఎదిరించి ఒక రాజకీయ పార్టీ పెట్టగల ధైర్యం ఆయనకుండేది కాదేమో. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత గత అయిదు సంవత్సరాల్లో జగన్ ఎంత మేరకు సమీకరించారో, ఈ ఎన్నికల్లో ఎంత ధనం ప్రవహిస్తుందో ఊహించాల్సిందే.

జగన్‌కు, కానీ, కేసీఆర్‌కు కానీ, బీజేపీ, కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల నేతలకు కానీ నిధులు సమకూర్చేందుకు కార్పొరేట్ సంస్థలు ఎన్నికల బాండ్ల రూపంలోనే కాకుండా దొడ్డిదారిన కూడా ముట్టజెబుతున్నాయి మైనింగ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, మద్యం, ఇసుక, గేమింగ్, ఫార్మా, టెలికమ్యూనికేషన్, కాంట్రాక్ట్, ప్రైవేట్ విద్యాసంస్థలు, మాదక ద్రవ్యాలు మొదలైన అనేక రంగాలనుంచి రాజకీయ పార్టీలకు డబ్బులు చేరుతున్నాయి.

2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశంలో నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత ఎన్నికల రాజకీయాల్లో నల్లధనం పాత్ర పెరిగిందే కాని తగ్గిన దాఖలాలు లేవు. అసలు ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల ఖర్చవుతున్నదో చెప్పేందుకు కొలమానాలు లేవు. ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 ఎన్నికల్లో తమిళనాడులో రూ. 900 కోట్లు పట్టుబడగా, ఆ తర్వాత గుజరాత్‌లో రూ. 552 కోట్లకు పైగా స్వాధీనపరుచుకున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు రూ. 3500 కోట్ల మేరకు దొరికాయి. ఈ లెక్కల్ని చూపి తాము ధన బలాన్ని అరికట్టామని ఎన్నికల కమిషన్ చెప్పుకోవడం హాస్యాస్పదమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు రూ. 60వేల కోట్లు ఖర్చు చేశారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఇందులో 45 శాతం బీజేపీయే ఖర్చు పెట్టిందని ఈ సంస్థ తెలిపింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని, ప్రతి ఓటరుకు ఓటుకు కనీసం రూ. 700 చెల్లించారని ఈ సంస్థ అంచనా వేసింది. కాని నిజానికి ఈ అంచనా కూడా తక్కువే. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్‌కు కనీసం రూ.5వేలు చెల్లించిన సందర్భాలు కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి లోక్‌సభా నియోజకవర్గానికీ అభ్యర్థికి రూ. 95 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలన్న పరిమితి విధించామని సీఈసీ రాజీవ్ కుమార్ చెబుతుంటే ఎవరికైనా నవ్వు రాకమానదు. కార్పొరేటర్ ఎన్నికకు కూడా ఇంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని చాలా మందికి తెలుసు.

ధనబలం సంగతి పక్కనపెడితే కండబలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై కూడా ఎన్నికల కమిషన్ తాను ప్రకటించినట్లుగా చర్యలు తీసుకుంటుందని కూడా నమ్మడానికి వీలు లేదు. ఈ దేశంలో నేతలపై ఉన్న కేసులను చూస్తుంటే నేరచరితులకూ, రాజకీయ నాయకులకూ మధ్య విభజన రేఖ చెరిగిపోతోందని మిలన్ వైష్ణవ్ అన్నారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, 2014 ఎన్నికల్లో 5వేల కిలోల మాదక ద్రవ్యాలను ఎన్నికల కమిషన్ అధికారులే స్వాధీనపరుచుకున్నారు. కనీసం ఏడు భారీ స్విమ్మింగ్ పూల్స్‌లో నింపగల మద్యం పట్టుబడిందని అధికారులు తెలిపారు. దాదాపు 40శాతం మంది నేరచరితులు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు.

ఇక ఎన్నికల ప్రచారంలో నేతలు అత్యధికంగా తప్పుడు ప్రచారం చేయడంతోనే కాలక్షేపం చేస్తారని, ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెడతారని ఎవరి ప్రసంగాలు విన్నా అర్థమవుతోంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి చెప్పనక్కర్లేదు. వాటన్నింటినీ పరిశీలించి వెనువెంటనే చర్య తీసుకోగల సామర్థ్యం కమిషన్‌కు లేదు. విద్వేష ప్రసంగాల విషయంలో కూడా ఎన్నికల కమిషన్ చేయగలిగింది ఏమీ లేదు. పార్లమెంట్‌లో విద్వేష ప్రసంగాలు చేసిన వారికే తిరిగి టిక్కెట్లు ఇస్తున్నారు. మత, కుల ప్రాతిపదికగా ప్రచారాన్ని పూర్తిగా అరికట్టడం, ముఖ్యంగా అధికార పార్టీ నేతల నోళ్లకు తాళం వేయడం కూడా ఎన్నికల కమిషన్‌కు సాధ్యం కాదని ఎన్నో ఉదంతాలను ఉదహరించవచ్చు.

నిజానికి ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా, జరగాలంటే ప్రభుత్వానికి ఎన్నికల సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేయగల నిజాయితీ ఉండాలి. లా కమిషన్‌తో పాటు ఎన్నో కమిటీలు సూచించిన సంస్కరణలను బుట్టదాఖలు చేశారు. జమిలి ఎన్నికలు అమలు చేసే ముందు ఎన్నికల సంస్కరణలను అమలు చేసినప్పుడే ఈ దేశంలో నిజమైన మార్పును ప్రభుత్వం కోరుతున్నట్లు భావించగలం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Mar 20 , 2024 | 03:07 AM