Share News

కాంగ్రెస్ మేనిఫెస్టో మేజిక్ చేయగలదా?

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:40 AM

‘‘పదేళ్ల బీజేపీ పాలనలో ఊకదంపుడు ప్రచారమే తప్ప జరిగిందేమీ లేదు. అంతటా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోతున్న వినియోగం వల్ల అభివృద్ధి కుంటుపడింది. పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి....

కాంగ్రెస్ మేనిఫెస్టో మేజిక్ చేయగలదా?

‘‘పదేళ్ల బీజేపీ పాలనలో ఊకదంపుడు ప్రచారమే తప్ప జరిగిందేమీ లేదు. అంతటా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోతున్న వినియోగం వల్ల అభివృద్ధి కుంటుపడింది. పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతటా విద్వేషపూరిత విచ్ఛిన్న వాతావరణం కొనసాగుతోంది. రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి మెజారిటీవాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. అసమానతలు పెరిగిపోయాయి. సమాజంలో ప్రతి వర్గం భయంతో జీవిస్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం సాధించగల సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. 1965, 1971 యుద్ధాల్లో విజయం సాధించి దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నది. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకువచ్చింది. ‘‘కాంగ్రెస్‌పై మరోసారి విశ్వాసం చూపండి’’ అంటూ గత వారం కాంగ్రెస్ పార్టీ ‘న్యాయపత్రం’ పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పిలుపునిచ్చింది.

ఒకరకంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. రెండుసార్లు పార్టీకి సారథ్యం వహించి విఫలమైన రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కానప్పటికీ ఆయనే రథసారథి. అందువల్ల ఈ ఎన్నికల తర్వాత ఆయన పాత్ర ఎలా ఉంటుంది, కాంగ్రెస్ నాయకత్వం తీరుతెన్నులు, సంస్థ స్వరూపం ఎలా మారుతాయి అన్న వాటిపై అంతర్గత చర్చ జరుగుతోంది. ఈ విషయాలు తెలిసినప్పటికీ ఇదే ఆఖరి పోరాటం లాగా కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారు. వందలాది సభలు, సమావేశాలు, వార్ రూమ్ సమాలోచనలు, రాష్ట్ర నేతలతో చర్చలు, యాత్రలు నిర్వహిస్తున్నారు. అక్బర్ రోడ్‌‍లో ఏఐసీసీ కార్యాలయం ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూ కనిపిస్తోంది.

‘‘మా పార్టీ ఒక థర్డ్ క్లాస్ కంపార్ట్‌మెంట్ లాంటిది. పోయేవారు పోతున్నా, వచ్చేవారు వస్తూనే ఉంటారు. జాగా లేదని చెప్పినా తోసుకుని వచ్చేవారు ఉండనే ఉంటారు’’ అని ఒకప్పటి ఏఐసీసీ అధికార ప్రతినిధి వి.ఎన్. గాడ్గిల్ చాలా కాలం క్రితమే వ్యాఖ్యానించారు. స్పష్టంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ వాతావరణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తప్ప మరెక్కడా కనపడదు. ముఖ్యమంత్రులైనా, బడా నేతలైనా ఢిల్లీ వచ్చేసరికి పార్టీ ప్రధాన కార్యదర్శులను కలుసుకునేందుకు వేచి చూడాల్సిందే. పార్టీ కార్యాలయంలో పనిచేసే పీఏలను, ప్యూన్‍లను ప్రసన్నం చేసుకునే నేతలు కూడా కనపడతారు. ఒక రకంగా అక్బర్ రోడ్ కార్యాలయం మినీ ఇండియాను తలపిస్తుంది. పార్టీకి మూల కేంద్రాలైన సోనియా, రాహుల్ ఒక కుటుంబానికి చెందిన వారైనా ఒక పార్టీగా కాంగ్రెస్ సంస్కృతి భిన్నమైంది. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమైనదనే భావన ఆ పార్టీ కార్యాలయంలోకి వచ్చాక కలుగుతుంది.

‘‘కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం ఆధిపత్యం కొనసాగడం లేదా?’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు దిలీప్ పడగోంకర్ 1991 జూన్ 9న అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావును చేసిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇందుకు పి.వి. సమాధానమిస్తూ ‘‘కుటుంబం అనే ఈ అంశంపై నాకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. నేను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాకు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలతో వ్యక్తిగత పరిచయం లేదు. కాని కాంగ్రెస్ పార్టీయే ఒక సైద్ధాంతిక కుటుంబంగా నాకు అనిపించింది. మీరంటున్న ఒకరిద్దరు కుటుంబ సభ్యులు కూడా ఒక పెద్ద కుటుంబంలో భాగం. వారూ ఈ దేశ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు తగినట్లుండాల్సిన వారే. అందువల్ల కాంగ్రెస్‌ను ఒకరిద్దరి వారసత్వానికి పరిమితం చేయవద్దు’’ అని చెప్పారు. అందువల్ల వారసత్వానికి చెందిన కుటుంబ నేతలే కాంగ్రెస్ పార్టీ అనుకోవడానికి వీల్లేదు. పార్టీ గతిశీలతకు వారు ఇరుసులా పనిచేస్తున్నప్పటికీ ఆ గతిశీలతకు వారే కారణాలు కానేకాదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి 33 లోక్‌సభ సీట్లు సాధించినా; కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ విజయాలు సాధించినా అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో తలెత్తిన నేతలు ప్రజల్లో పార్టీ బలంగా ఉన్నదనే విశ్వాసం కలిగించారు. స్థానికంగా బలోపేతమైన నాయకులే కాంగ్రెస్ పార్టీకి బలం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక మేధో వలయం స్పష్టంగా కనిపిస్తుంది. పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, శంకర్ రావు చవాన్, జగజీవన్ రామ్, కమలాపతి త్రిపాఠీ, శివశంకర్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, గాడ్గిల్, జైపాల్ రెడ్డి, హెచ్.ఆర్. భరద్వాజ నుంచి మన్మోహన్ సింగ్, వీరప్ప మొయిలీ, చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, కె.రాజు, శశిథరూర్, అభిషేక్ సింఘ్వీ తదితరుల వరకు కాంగ్రెస్‌‍లో మేధో సంపద కనిపిస్తూనే ఉంటుంది. వీరు కాక మాజీ అధ్యాపకులు, వైస్ చాన్స్‌లర్లు, జర్నలిస్టులు, న్యాయవేత్తలు, శాస్త్రవేత్తలు కాంగ్రెస్‍కు భావజాలపరంగా మద్దతునిస్తూనే కనపడతారు. వీరంతా ఒక టీమ్‌‍గా పనిచేస్తూ కాంగ్రెస్‌కు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకత్వం అందించేందుకు ప్రయత్నిస్తారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఉన్నది. ఇది ఒక్కరు రూపొందించిన పత్రం కానే కాదని, ఎంతో మథనం తర్వాత రూపొందించిన పత్రమని చదివిన వారికి అర్థమవుతుంది. ఈ మేనిఫెస్టో ఓబీసీ, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, రైతులకు సామాజిక న్యాయం అందించే దిశగా తమ ఆలోచనలను, కార్యాచరణను ప్రకటించింది. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్ద ఎత్తున నిధులను ప్రకటించింది. తమ హయాంలోనే గ్రామీణ ఉపాధి పథకం, ఆహార భద్రత వంటివి ప్రవేశపెట్టిన విషయాలను గుర్తు చేసింది. రైతుల గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం, నిరుద్యోగ యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపకార వేతనం, ప్రతి పేద కుటుంబానికి రూ. లక్ష నగదు, లక్షలాది ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వోద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయడం, పేదలకు అదనపు భూమిని బదిలీ చేయడం, అగ్నిపథ్‌ను రద్దు చేయడం వంటి అనేక హామీలను కాంగ్రెస్ గుప్పించింది. ఒక రకంగా ఇది పేదలకు అనుకూలంగా, వివిధ అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించే దిశగా రూపొందించిన పత్రం. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా సామాజిక న్యాయం విషయంలో బీజేపీకి భిన్నంగా తాను ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పేందుకే తన మేనిఫెస్టో డాక్యుమెంట్‌ను రూపొందించింది.

కాని ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతుందా? దేశ ప్రజలు ఈ మేనిఫెస్టోను సీరియస్‌గా తీసుకుంటారా? కాంగ్రెస్ మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధిని, సమానత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని సాధించగలదని ప్రజలు విశ్వసిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీజేపీకి భిన్నమైన ఆలోచనా విధానం గల పార్టీగా కాంగ్రెస్ తనను తాను ఎంత రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ జనాన్ని ఆ దిశన ఎంత మేరకు ఆలోచింప చేయగలదనేది చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ గతంలో చేసిన తప్పులు వెంటాడుతుంటాయి. బీజేపీపై ఇప్పుడు చేసే ప్రతి విమర్శా ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నదే. ఒకప్పుడు కాంగ్రెస్‌ను తిరస్కరించినట్లే బీజేపీని కూడా తిరస్కరించే క్రమం రాకపోదు కాని కాంగ్రెస్‌లో మార్పు వచ్చిందని, అది తమ కోసం నిలబడుతుందని ప్రజలు గ్రహించే వరకూ మళ్లీ ఆ పార్టీ జనాదరణ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

విచిత్రమేమంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి చర్చించి అవి ఎలా ఆచరణసాధ్యం కావో వివరించేందుకు బీజేపీ నేతలు పూనుకోవడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లింలీగ్ మేనిఫెస్టో గానో, పాకిస్థాన్ మేనిఫెస్టో గానో చిత్రించి కొట్టి పారేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎండగట్టి తాము ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నామో, అభివృద్ధిపై తమ దృక్కోణం ఏమిటో ప్రజలకు వివరించే అవకాశం బీజేపీకి ఉంది. కాని బీజేపీ నేతల దారి వేరు. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రిస్తే మిగతా అంశాలను ప్రజలు విస్మరిస్తారనేదే ఆ పార్టీ నేతల అభిప్రాయం.

మరో పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకునే నిర్ణయం అత్యంత కీలకమైనది. ఈ రెండు పార్టీల భావజాలాలకు, వ్యవహార శైలికి, మేనిఫెస్టోలకూ వారెంత ప్రాధాన్యతనిస్తారో చెప్పలేము. బీజేపీయే మళ్లీ గెలుస్తుంది అన్న అభిప్రాయాన్ని మధ్యతరగతి వర్గాల్లో మానసికంగా కల్పించడంలో ఆ పార్టీ ఇప్పటికే విజయం సాధించింది. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్, హిమాచల్, హర్యానా, అస్సాం తదితర రాష్ట్రాల్లోని దాదాపు 180 సీట్లలో బీజేపీని కాంగ్రెస్ ముఖాముఖి ఎంతమేరకు ఢీకొనగలదన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సీట్లలో కనీసం సగం సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నా ఆ పార్టీ వంద సీట్లను సులభంగా సాధించే అవకాశం ఉన్నది. అప్పుడు రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉంటాయి. కాని ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేము.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 10 , 2024 | 02:40 AM