Share News

ఆ లక్ష్యాన్ని బీజేపీ సాధించగలదా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:01 AM

‘జూన్ 4, 400 సీట్లు’ – లక్ష్యం పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తన ప్రచార వెల్లువలో తానే కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ప్రచారం ప్రారంభించిన...

ఆ లక్ష్యాన్ని బీజేపీ సాధించగలదా?

‘జూన్ 4, 400 సీట్లు’ – లక్ష్యం పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తన ప్రచార వెల్లువలో తానే కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ప్రచారం ప్రారంభించిన తర్వాత దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ (ఈసారి 400 దాటుతాం) అన్న నినాద హోరులో బీజేపీ కార్యకర్తలు మోదీ సునామీ దేశాన్ని ముంచేస్తోందా అన్న స్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో జరిగిన సభల్లో మోదీ స్వయంగా ఎన్డీఏ 400 సీట్లకు పైగా సాధిస్తుందని ప్రకటించారు. ఇక, బీజేపీ ఒక్కటే 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పోటీ చేస్తున్న 450 సీట్లలో 370 సీట్లు అంటే 82 శాతం సీట్లు గెలుచుకోవాలన్న మాట. ఇప్పటివరకూ బీజేపీ పోటీ చేసిన సీట్లలో అత్యధికంగా 70 శాతం సీట్లు 2019లోనే సాధించింది. అప్పుడు 436 సీట్లకు పోటీ చేసి 303 గెలుచుకుంది. ఎన్డీఏ 400 సీట్లు దాటడం మాట అటుంచితే, ఇప్పుడు బీజేపీ 82 శాతం సీట్లు ఎలా సాధించగలుగుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఈ ప్రశ్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా వేసుకుని ఉంటారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు నాడు లభించాయి. ఈసారి అంతకంటే ఎక్కువ లభిస్తే కాని బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకోలేదు.

సాధారణంగా రాజకీయ నాయకులు అరచేతిలో స్వర్గం చూపించేందుకు అందమైన అబద్ధాలు చెబుతూ ఉంటారు. మోదీ ప్రకటన కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ ఒక ఊపు తెచ్చేందుకో, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి మీడియాను కూడా భ్రమల్లో ముంచేందుకో చేసిందని చెప్పడానికి వీల్లేదు. అన్ని వ్యవస్థల్నీ అదుపులో పెట్టుకుని, ప్రతి చర్యా పకడ్బందీగా తీసుకుంటూ, ప్రతిపక్షాల్ని అణిచివేయడం ద్వారా తాననుకున్నది సాధించగలననే ధీమా ఆయనలో కనిపిస్తున్నది.

మోదీ ప్రతి ఒక్క లెక్కా ప్రణాళికాబద్ధంగా వేసుకున్నదే. ఫిబ్రవరి 18న ఆయన బీజేపీ జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ వచ్చే 100 రోజులు పార్టీకి కీలకమని, క్షణం కూడా వృధా చేయకుండా మళ్లీ అధికారంలోకి బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంటే వంద రోజులలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాదని ఫిబ్రవరి 18నే మోదీకి తెలుసని అర్థం. నిజానికి గత మూడు సార్వత్రక ఎన్నికల ఫలితాలు మే రెండో వారంలోనో, మూడో వారంలోనో వచ్చాయి. కాని ఈ సారి ఉద్దేశపూర్వకంగా జూన్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. మోదీ అధికారిక పర్యటనలన్నీ ముగించుకున్న తర్వాత ఆయన వ్యూహరచనకు అనుగుణంగా, ఇక పొడిగించడం అసాధ్యమని అనుకున్నప్పుడే ఎన్నికల ప్రక్రియను ప్రకటించారనుకోవచ్చు.

ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. తెలంగాణలో మోదీ పర్యటించిన రోజే కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేశారు. సరిగ్గా వారం రోజులకు ప్రధాని భూటాన్‌లో ఉన్నప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. బహుశా కవిత అరెస్టు మూలంగా పెద్దగా సానుభూతి వచ్చే అవకాశాలు లేవని, కేసీఆర్ ఆత్మరక్షణలో పడినందువల్ల బీజేపీ బలోపేతం అవుతుందని ఆయనకు సమాచారం వచ్చే ఉంటుంది. ఇక కేజ్రీవాల్ అరెస్టు వల్ల వచ్చే రాజకీయ పర్యవసానాలను ఎదుర్కోవడానికి కూడా ముందే సిద్ధమై ఉంటారు. 2014లో ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 10న జరిగితే, 2019లో మే 12న జరిగాయి. ఈసారి ఢిల్లీ ఎన్నికలను ఆశ్చర్యకరంగా ఆరవ దశలో మే 25న నిర్ణయించారు. అంటే కేజ్రీవాల్ అరెస్టు జరిగిన రెండు నెలలకు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట. ఢిల్లీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ మాత్రం సమయం చాలునని నరేంద్రమోదీ అనుకుని ఉంటారు. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఏడుకు ఏడుసీట్లు గెలిచిన బీజేపీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేతులు కలపడంతో కలవరానికి గురయినట్టుంది. కేజ్రీవాల్‌ను అరెస్టుచేయడం ద్వారా ఆప్‌ను చితక్కొట్టడానికి, కనీసం ఇతర రాష్ట్రాల్లో ఆప్ ప్రభావాన్ని అడ్డుకోవడానికి వ్యూహరచన జరిగి ఉంటుంది. ఢిల్లీ ఎన్నికల షెడ్యూలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు కూడా బీజేపీ వ్యూహరచనకు అనుగుణంగా ఉన్నాయి. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేని తమిళనాడు, కేరళ ఎన్నికలు మొదటి రెండు దశల్లోనే పూర్తి కాగా బీజేపీ పోరాడగలిగే రాష్ట్రాల్లో ఎన్నికలను వివిధ దశల్లో చివరి వరకూ నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో భౌగోళిక సామీప్యతను అంతగా పట్టించుకోలేదు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించినన్ని ఫలితాలు వస్తాయా అన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ మధ్య ముఖాముఖి పోటీ జరిగితే బీజేపీదే పై చేయి అవుతుందని మోదీ భావన. ఇది ఇతర రాష్ట్రాలలో వర్తిస్తుందేమో కాని తెలంగాణలో మాత్రం సాధ్యం కాదు. తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దూకుడును తట్టుకొని బీజేపీ ప్రభంజనం వీచేలా చూడడం అంత సులువు కాదు. మోదీ ఎంత బలవంతుడైనా స్థానిక నేతలు బలంగా లేకపోతే విజయం సాధించడం కష్టం. అందుకే చివరి నిమిషంలో ఇతర పార్టీ నేతల్ని, వ్యాపారస్తుల్ని లాగి వారికి అప్పటికప్పుడే సీట్లు ఇస్తున్నారు. ఆ నేతల విశ్వసనీయత, బీజేపీ సిద్ధాంతాల పట్ల వారి చిత్తశుద్ధి దేవుడెరుగు. కాని వారు బీజేపీని ఆదుకుంటారన్న ఆశ మోదీలో బాగా ఉన్నట్లు కనపడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆరు సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీ తెలుగుదేశం గెలిపిస్తే కాని స్వంతంగా ఒక్కసీటు కూడా గెలిచే అవకాశాలు లేవు. కేరళలో కేంద్ర మంత్రులతో పోటీ చేయించినా ఖాతా తెరుస్తుందా అన్నది అనుమానమే. కర్ణాటకలో కూడా బీజేపీ గత ఎన్నికల్లో 28కి 26 సీట్లు గెలిచినా ఈసారి అన్నిసీట్లు గెలవడం సాధ్యపడదని బీజేపీకి సమాచారం వచ్చినట్లుంది. అందువల్లే అక్కడ యడ్యూరప్పకు మళ్లీ ప్రాధాన్యత పెంచారు. అక్కడ బీజేపీలో అంతర్గత తగాదాలు, జేడీ(ఎస్) సీట్ల పంపిణీ వల్ల ఏర్పడిన అసంతృప్తి గురించి ఢిల్లీకి సమాచారం అందుతూనే ఉన్నది. ఈ క్రమంలో మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసుకోవాల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీ వల్ల బీజేపీకి వచ్చిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను బీజేపీలో చేర్చుకోవల్సివచ్చిందని అంటున్నారు. గాలి అప్పుడు గంగావతి నుంచి విజయం సాధించారు. ‘నీ రాజకీయ భవిష్యత్ బీజేపీలోనే ప్రారంభమైంది. నీవు వెంటనే పార్టీలో చేరిపో’ అని హోంమంత్రి అమిత్ షా చెప్పడంతో తాను తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ గురించి, చేసిన దారుణాల గురించి 2011లో అప్పటి లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ఇచ్చిన నివేదికతో గాలి పతనం ప్రారంభమైంది. బళ్లారి గనుల నుంచి చైనాకు టన్నుకు రూ. 6500 నుంచి రూ. 7000 చొప్పున ధరకు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, రాష్ట్రానికి రూ. 27 మాత్రమే రాయల్టీగా చెల్లించారని హెగ్డే వెల్లడించారు. గాలి జరిపిన 35 వేల కోట్ల అక్రమ మైనింగ్ గురించి, ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణల గురించి, సాక్షులకు బెదిరింపులు, న్యాయమూర్తులకు ప్రలోభాల గురించి పత్రికల్లో నాడు వందలాది పేజీల కథనాలు వస్తే మాత్రం ఏమి జరిగింది? ఆయనపై విచారణ ముగించమని సుప్రీంకోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘ఇది న్యాయవ్యవస్థకే అవమానం’ అని కూడా సుప్రీం ఒక సందర్భంలో పేర్కొంది. ఎవర్ని ఎప్పుడు చేర్చుకోవాలో, వారి వల్ల ఎలా ప్రయోజనం పొందాలో బీజేపీకి తెలుసు కనుకే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల సమయంలో గాలిని అక్కున చేర్చుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత తన నియోజకవర్గంలో హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి పర్వతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని గాలి జనార్దన రెడ్డి ప్రకటించారు. ఆయనపై కేసులు కూడా ఇక గాలిలో కలిసిపోతాయనడంలో అతిశయోక్తి లేదు. కాని గాలి లాంటి శక్తుల తోడ్పాటు మూలంగా బీజేపీ మళ్లీ కర్ణాటకలో 26 సీట్లు గెలుచుకుంటుందా అన్నది చర్చనీయాంశం.

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం, గాలి జనార్దన్ రెడ్డి, నవీన్ జిందాల్ వంటి నేతలను ఆగమేఘాలపై చేర్చుకోవడం ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ‘మాకు రైలు టిక్కెట్లు కొనడానికి కూడా డబ్బులు లేవు..’ అని రాహుల్ గాంధీ అంటున్నప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో నిస్పృహ కొట్టొచ్చినట్లు కనపడుతోంది. విజయం సాధించడమే తమ ఏకైక లక్ష్యమని రాజకీయ పార్టీలు భావిస్తున్నప్పుడు విలువల గురించి చర్చించి పెద్దగా ప్రయోజనం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Mar 27 , 2024 | 01:01 AM