Share News

బీజేపీది బలమా, బలహీనతా?

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:17 AM

‘నీ రాజకీయ సిద్ధాంతం స్వప్రయోజనాలకు అనుగుణంగా, ఆచరణీయ దృక్పథంతో ఉండాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు...

బీజేపీది బలమా, బలహీనతా?

‘నీ రాజకీయ సిద్ధాంతం స్వప్రయోజనాలకు అనుగుణంగా, ఆచరణీయ దృక్పథంతో ఉండాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అన్న వైఖరితోనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. రాజకీయ అధికారం లేకపోతే నీకే శక్తీ లేనట్లే’ అని ప్రముఖ అమెరికన్ రాజనీతిజ్ఞుడు విలియం క్లే తన దేశంలో రాజకీయ పార్టీలకు, నాయకులకు ఇచ్చిన సలహా ప్రపంచంలో ఏ దేశంలో నాయకుడికైనా వర్తిస్తుంది. భారత రాజకీయాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంత బలమైన పార్టీ అయినప్పటికీ 370 సీట్లు గెలవాలంటూ ఒక లక్ష్యం అంటూ విధించుకున్న తర్వాత ఆ లక్ష్యం కోసం ఇవాళ దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. అన్ని చోట్లా అత్యధిక లోక్‌సభ సీట్లు కావాలని ఆశిస్తోంది. గుర్రం కంటే ముందు నాడా కొనుక్కుంటున్నట్లు కనపడుతోంది బీజేపీ వారి పరిస్థితి. ఇది బలమా, బలహీనతా?

గత వారమంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. శివసేన చీలిక వర్గం నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపినా వారి మధ్య సీట్ల ఒప్పందం ఒక కొలిక్కి రాలేకపోయింది. ఒడిషా బీజేపీ నేతలు ధర్మేంద్రప్రధాన్, మన్మోహన్‌సింగ్ సహాయ్, జ్యుయల్ ఓరంలతో చర్చలు జరుపుతూనే బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు అనేక సందేశాలు పంపారు. కాని అక్కడ కూడా సీట్ల సర్దుబాటు అంత సులభంగా జరిగేలా కనపడడం లేదు. నిజానికి ఒడిషాలో బిజూ జనతాదళ్ 11 సంవత్సరాల పాటు ఎన్డీఏతో స్నేహం చేసిన తర్వాత 2009లో తెగతెంపులు చేసుకుంది. అప్పుడు కూడా అందుకు ప్రధాన కారణం సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం లేకపోవడమే. మళ్లీ ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత బీజేడీకి స్నేహ హస్తం చాస్తున్న బీజేపీ మళ్లీ అత్యధిక సీట్లను కోరుకుంటోంది. ‘బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వడాన్ని మా కేడర్ వ్యతిరేకిస్తున్నారు’ అని బీజేడీ నేత ఒకరు చెప్పారు.

మహారాష్ట్రలో రాజకీయ నేతల చంక్రమణాలు, చీలికలు అక్కడి ప్రజలకు కొత్తవి కావు. దేశంలో అత్యంత సీనియర్ నాయకుడైన శరద్ పవార్ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వసంతదాదా పాటిల్‌పై తిరుగుబాటు చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్టు) అనే పార్టీ స్థాపించారు. జనతా పార్టీ, పీజంట్స్ వర్కర్స్ పార్టీతో కలిసి పీడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందే కాంగ్రెస్ అక్కడ రెండు ముక్కలైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన బలీయమైన శక్తిగా మారుతుండడంతో ఆ పార్టీని అడ్డుకోవడానికి మళ్లీ 1987లో కాంగ్రెస్ శరద్ పవార్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది. 1999లో సోనియాగాంధీపై విదేశీ ముద్ర వేసి తిరుగుబాటు చేసి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన పవార్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదే సోనియా నాయకత్వంలోని యూపీఏలో తన పార్టీని మిత్రపక్షంగా మార్చారు. ఏ శివసేననైతే కాంగ్రెస్ నేతలు, పవార్ వ్యతిరేకించారో ఆ శివసేనతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. తర్వాత శివసేన, ఎన్‌సీపీని కూడా బీజేపీ చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడా చీలిన పార్టీల నుంచే బీజేపీ అత్యధిక సీట్లను ఆశిస్తోంది.

రాజకీయ పార్టీలు శిబిరాలు మార్చడం దేశంలో కొత్త కాదు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన చరణ్ సింగ్ తర్వాత అదే ఇందిర మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. యూపీలో బీఎస్పీ, ఎస్‌పీ పలుసార్లు కలిసి, విడిపోయాయి. డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు రెండింటికీ కాంగ్రెస్, బీజేపీలతో కలిసి పనిచేసిన చరిత్ర ఉన్నది. కర్ణాటకలో జనతాదళ్(ఎస్) కూడా అదే దారిలో నడిచింది. మోదీని రాష్ట్రంలోనే అడుగుపెట్టనీయబోనని ఒకప్పుడు ప్రకటించిన నితీశ్ కుమార్ బీజేపీతోనే చేతులు కలిపి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రాంతీయ పార్టీలు దేశంలో బలమైన జాతీయ పార్టీతో సంబంధాలు ఏర్పర్చుకోవాలనుకోవడం, తమ రాజకీయ, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకోవడం కొత్త కాదు. కాని ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీ అవసరం ఎంత మేరకు ఉన్నదో, జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల అవసరం అంతే ఉన్నదన్న విషయం విస్పష్టం. ఇవాళ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఏర్పర్చుకుని అత్యధిక లోక్‌సభ సీట్లు సాధించాలని అనుకుంటున్నాయి. కాని ఈ రెండు పార్టీల్లో ప్రాంతీయ పార్టీలపై కొంత ఎక్కువ ఒత్తిడి చేసే శక్తి బీజేపీకే ఉన్నదనడం వాస్తవం. బీజేపీ కేంద్రంలో పదేళ్లలో అపారమైన అధికారాన్ని, సంపదను సమకూర్చుకోవడమే కాక వ్యవస్థలపై పట్టు సంపాదించుకోవడం కూడా అందుకు ప్రధాన కారణం. అందుకే కొన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీ రాక్షస వివాహం చేసుకోగలుగుతోంది.

కాంగ్రెస్ కేంద్రంలో దాదాపు పది సంవత్సరాలుగా అధికారంలో లేనందువల్ల, అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినందువల్ల మిత్రపక్షాలు చెప్పినట్లు ఆ పార్టీ వినవలసి వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరు ప్రదర్శించినందువల్ల ఎక్కడా పొత్తులపై స్వంతంగా షరతులు విధించలేని పరిస్థితుల్లో ఉన్నది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినన్ని సీట్లు తీసుకోవల్సి రావడమే కాదు, గుజరాత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పోటీ చేసిన బరూచ్ స్థానంతో పాటు రెండు లోక్‌సభ సీట్లను ఆప్‌కు కేటాయించవలసిన అగత్యం కాంగ్రెస్‌కు ఏర్పడింది. మహారాష్ట్రలో రెండో స్థానంలో పోటీ చేసే పరిస్థితి ఉండగా, బెంగాల్‌లో తృణమూల్‌కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ సీట్ల ఒప్పందం పేరుతో జార్ఖండ్‌లో కాంగ్రెస్ నుంచి జేఎంఎం రాజ్యసభ సీటును సాధించుకోగలిగింది.

అయితే కేంద్రంలో పదేళ్లుగా అపరిమిత అధికారం చలాయిస్తూ, తన ఆకర్షణకు తిరుగులేదని మోదీ భావిస్తున్నప్పటికీ, గతంలో ఏ పార్టీ హయాంలో జరగనంత అభివృద్ధి తానే చేశానని చెప్పుకుంటున్నప్పటికీ, రామమందిర నిర్మాణం, జాతీయ వాదం మొదలైన వాటి వల్ల ప్రజలు తమవైపే ఉన్నారని అనుకుంటున్నప్పటికీ బీజేపీకి ఇవాళ దేశంలో స్వంతంగా మొత్తం 543 లోక్‌సభ సీట్లలో పోటీ చేయదగ్గ శక్తి లేదనే చెప్పాలి. గడచిన రెండు ఎన్నికల్లోనూ దాదాపు వందకు పైగా సీట్లలో ఆ పార్టీ పోటీయే చేయలేదు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచిన సీట్లు 95 మాత్రమే. వీటితో పాటు దాదాపు 262 సీట్లు తమకు సురక్షితంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల ఈ సారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి 50 శాతం పైగా ఓట్లను సాధించడం, సాధ్యమైనన్ని మిత్రపక్షాలను ఏర్పర్చుకోవడం, ముఖ్యంగా తెలుగుదేశం, బీజేడీ వంటి పాత ఎన్డీఏ మిత్రపక్షాలను మళ్లీ కలుపుకోవడం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే బీజేపీకి ఇవాళ ప్రాంతీయ పార్టీల అవసరం ప్రబలంగా కనపడుతోంది. లేకపోతే బీహార్‌లో నితీశ్ కుమార్‌ను ఇండియా కూటమి నుంచి చీల్చాల్సిన అవసరం మోదీకి ఏర్పడేది కాదు. నితీశ్ కుమార్ తమను తిట్టిన తిట్లన్నీ బీజేపీ మరిచిపోవాల్సి వస్తోంది. అంతేకాదు, తమ ఎజెండాకు భిన్నంగా కులజనగణనను జరిపిన జేడీ(యు)ను సమర్థించాల్సి వస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు)తో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జీపీ, పశుపతి పరాస్‌కు చెందిన ఎల్‌జీపీ (రాష్ట్రీయ), ఉపేంద్ర కుషవాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవామీ మోర్చా కూడా ఆ పార్టీకి అవసరం. ఉత్తరప్రదేశ్‌లో కూడా అప్నాదళ్ (సోనేలాల్), రాష్ట్రీయ లోక్‌దళ్, నిషాద్ పార్టీ, రాజ్‌భర్ నేతృత్వంలోని సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలను విస్మరించదగిన స్థితిలో ఆ పార్టీ లేదు. అసోంలో అసోం గణపరిషద్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, జార్ఖండ్‌లో ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో బీజేపీకి చేతులు కలపక తప్పడం లేదు. ఏదో రకంగా తమతో 38–40 పార్టీలు ఉన్నాయని చెప్పుకునేందుకు బీజేపీ తంటాలు పడుతోంది. ఇవాళ దేశంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ విస్మరిస్తున్న పార్టీలు రెండే ఉన్నాయి. అవి వైసీపీ, బీఆర్ఎస్ మాత్రమే.

ప్రాంతీయ పార్టీలన్నిటిలో తెలుగుదేశం పార్టీయే ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక శాతం ఓట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఆ పార్టీకి ఆరు లోక్‌సభ సీట్లు కేటాయించడం చాలా ఎక్కువ అని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతూనే ఉన్నారు. ఈ విషయం చంద్రబాబునాయుడుకు కూడా తెలియనిది కాదు. కాని ఎన్నికల నిర్వహణ విషయంలోనూ, ఎన్నికల తర్వాత సహకారం విషయంలోనూ, అభివృద్ధి విషయంలో తనకున్న పేరును విభజిత ఏపీలో కూడా సార్థకం చేసుకోవడం కోసం ఆయన బీజేపీకి స్నేహహస్తం చాచారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలందరూ తీవ్ర అంతర్మథనంతో ఉన్నారంటే మోదీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Mar 13 , 2024 | 05:17 AM