Share News

సూర్యాపేట కాంగ్రెస్‌ నేత ఏపీలో కిడ్నాప్‌?

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:53 AM

సూర్యాపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే కాంగ్రెస్‌ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు. రెండ్రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడం, ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సూర్యాపేట కాంగ్రెస్‌ నేత ఏపీలో కిడ్నాప్‌?

- రూ.20 లక్షల అప్పునకు సంబంధించి పంచాయితీ తేల్చేందుకు జగ్గయ్యపేటకు కారులో ఎల్లయ్య

- వెంట బాధితురాలు, ఆయన స్నేహితుడు కూడా

- తిరిగి రాని వైనం.. కాసేపటికి బాధితురాలూ గాయబ్‌

సూర్యాపేట క్రైం, ఏప్రిల్‌ 19: సూర్యాపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే కాంగ్రెస్‌ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు. రెండ్రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడం, ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎల్లయ్య కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ అనే మహిళ నుంచి జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి రూ.20 లక్షల దాకా అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడుగుతున్నా శ్రీనివాస్‌ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన నాగారం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన యువకులకు అపర్ణ చెప్పుకొని బాదపడింది. తమ గ్రామానికి చెందిన వడ్డె ఎల్లయ్య డబ్బులు ఇప్పిస్తాడని.. ఆమెకు వారు చెప్పారు. అనంతరం వడ్డె ఎల్లయ్యను అపర్ణ కలిసింది. ఈ నెల 18న అపర్ణ హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకొచ్చింది. సూర్యాపేట నుంచి ఎల్లయ్య కారులో ఇద్దరూ జగ్గయ్యపేట బయలుదేరారు. దారిలో కోదాడలో ఉంటున్న తన స్నేహితుడు అంజయ్యను ఎల్లయ్య కారులో ఎక్కించుకున్నారు. కారులో ముగ్గురూ జగ్గయ్యపేటకు వెళ్లగానే అపర్ణ తనకు డబ్బులు ఇవ్వాల్సిన శ్రీనివా్‌సకు ఫోన్‌ చేసి పిలిపించింది. అతడొచ్చి అపర్ణకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని, తనతో ఎల్లయ్య మాత్రమే రావాలని షరతు పెట్టాడు. దీంతో ఎల్లయ్య శ్రీనివా్‌సతో కలిసి ఆయన కారులో వెళ్లాడు. ఎంతసేపటికీ ఎల్లయ్య తిరిగి రాలేదు. కొద్దిసేపటికి ఎల్లయ్యకు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చింది. తర్వాత అపర్ణ ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి వస్తానని, అంజయ్యను అక్కడే ఉండాలని చెప్పి వెళ్లింది. తర్వాత ఆమె ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయింది. సాయంత్రమైనా ఎల్లయ్య, అపర్ణ రాకపోవడంతో అంజయ్య విషయాన్ని ఎల్లయ్య కుటుంబానికి చెప్పాడు. ఎల్లయ్య కుటుంబసభ్యుడు సతీశ్‌, జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండ్రోజులు గడిచినా ఎల్లయ్య ఆచూకీ తెలియడం లేదు.

Updated Date - Apr 20 , 2024 | 09:53 AM