Share News

Hyderabad: వామ్మో.. వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.. కక్షతోనే హత్య చేశారు.. మర్మాంగాలు కోస్తూ స్నేహితుడికి వీడియో కాల్‌

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:28 PM

ఏడాది క్రితం తనపై చేసిన హత్యాయత్నంపై పగతో ఒకరు, తను సహజీవనం చేస్తున్న యువతిని కోరుకుంటున్నాడన్న అక్కసుతో మరొకరు.. రౌడీషీటర్లతో కలిసి బీజేపీ నాయకుడు, రియల్‌ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.

Hyderabad: వామ్మో.. వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.. కక్షతోనే హత్య చేశారు.. మర్మాంగాలు కోస్తూ స్నేహితుడికి వీడియో కాల్‌

- అనంతరం మద్యం తాగుతూ సంబరాలు

- బీజేపీ నేత, వ్యాపారి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్‌

హైదరాబాద్: ఏడాది క్రితం తనపై చేసిన హత్యాయత్నంపై పగతో ఒకరు, తను సహజీవనం చేస్తున్న యువతిని కోరుకుంటున్నాడన్న అక్కసుతో మరొకరు.. రౌడీషీటర్లతో కలిసి బీజేపీ నాయకుడు, రియల్‌ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కట్టా హరిప్రసాద్‌ వివరాలను వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము అలియాస్‌ సింగోటం రామన్న (35) వ్యాపారి. అదనపు ఆదాయం కోసం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి దిగాడు. ఇటీవల బీజేపీలో చేరాడు. కొల్లాపూర్‌లో అబ్దుల్‌ కలామ్‌ ఫౌండేషన్‌ పేరుతో సేవాసంస్థ ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. రియల్‌ వ్యాపారం కలిసి రాకపోవడంతో జూదంపై దృష్టి పడింది. అందర్‌ బాహర్‌, మూడు ముక్కలు ఆట నిర్వాహకుడిగా అవతారమెత్తాడు. ఖాళీ ప్రదేశాలు, దట్టమైన చెట్ల పొదలు, గెస్టుహౌసుల్లో జూదం నిర్వహించేవాడు. ఇలా ఏడాదిలోనే సుమారు రూ. ఐదు కోట్లు సంపాదించాడు. వ్యాపారాన్ని విస్తరించేందుకు జీడిమెట్ల రాంరెడ్డినగర్‌కు చెందిన స్నేహితుడు మణికంఠను కలుపుకున్నాడు. ఆదాయం చూసిన మణికంఠ తాను కూడా సంపాదించుకోవాలని రామన్న నుంచి వేరుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సంపాదించిన దాంట్లో రామన్న చాలావరకు పోగొట్టుకున్నాడు. ఆదాయం తగ్గిపోవడంతో మణికంఠపై కోపం పెంచుకొని 2022లో అతడిపై కత్తితో దాడి చేసి కారు ఎక్కించాడు. చావు అంచుల వరకు వెళ్లి మణికంఠ బతికాడు. ఆ కేసులో రామన్న జైలుకెళ్లాడు. అప్పటి నుంచీ రామన్నపై మణికంఠ కక్ష పెంచుకున్నాడు. ఇది పసిగట్టిన రామన్న బెయిల్‌పై వచ్చాక తన రక్షణ నిమిత్తం మనుషులను నియమించుకున్నాడు.

ఓ యువతి కోసం..

లక్ష్మీనర్సింహనగర్‌లో ఉండే మహిళ వద్దకు రామన్న, మణికంఠ, అతడి స్నేహితుడు వినోద్‌కుమార్‌ వస్తుంటారు. ఆ మహిళ కుమార్తెతో వినోద్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రామన్న కూడా ఆమెపై మనసు పడ్డాడు. ఈ విషయం వినోద్‌కు తెలిసింది. రామన్న తీరుపై వినోద్‌ నొచ్చుకుని విషయాన్ని మణికంఠకు చెప్పాడు. ఇదే అదునుగా ఇద్దరూ కలిసి రామన్న చంపాలనుకున్నారు. రౌడీషీటర్‌ కైసర్‌తో హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం.. మహిళ కుమార్తెతో రామన్నకు ఫోన్‌ చేయించి లక్ష్మీనర్సింహనగర్‌కు పిలిపించారు. అక్కడకు మణికంఠ, వినోద్‌ తదితరులు వచ్చి కత్తులతో రామన్నపై దాడి చేశారు. అతడి మర్మాంగాలను కోసి దారుణంగా హత్య చేశారు. స్నేహితుడైన ఫిరోజ్‌కు వినోద్‌ వీడియో కాల్‌లో చూపించాడు. అనంతరం కార్లలో పారిపోయారు. ఓ బార్‌ వద్ద పార్టీ చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. హత్య గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు తగిన ఆధారాలతో మణికంఠ, వినోద్‌, కైౖసర్‌, అతడి కావలి శివకుమార్‌, కప్పల నిఖిల్‌, తున్న కుమార్‌తోపాటు మహిళ, ఆమె కుమార్తెను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 10 , 2024 | 12:28 PM