Share News

Hyderabad: రూ. 7కోట్లు కొల్లగొట్టారు.. రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ఘరానా ఆర్థిక మోసం

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:13 AM

రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ఘరానా ఆర్థిక మోసాలకు పాల్పడి రూ. 7కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: రూ. 7కోట్లు కొల్లగొట్టారు.. రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ఘరానా ఆర్థిక మోసం

- ఆకర్షనీయ లాభాలంటూ నమ్మించారు.

- ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ఘరానా ఆర్థిక మోసాలకు పాల్పడి రూ. 7కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన తమ్మినీడి వెంకటప్రసాద్‌ కొర్రపాటి వెంకటరత్నం, వెంకట చిరంజీవి, విఠల్‌రెడ్డి తదితరులు కలిసి జేజే ఇండియా ఇన్‌ఫ్రా ప్రై.లిమిటెడ్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ప్రారంభించారు. దానికి తమ్మిడి వెంకటప్రసాద్‌ ఎండీగా, వెంకటరత్నం మార్కెటింగ్‌ ఏజెంటుగా ఉన్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. మహేశ్వరం, గచ్చిబౌలి, ఆమనగల్‌, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వెంచర్స్‌, వ్యవసాయ భూములు ఉన్నాయని చూపించారు. సరిగ్గా మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయని నమ్మించారు. ముందుగా పెట్టుబడి పెట్టినవారికి వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రూ. 10వేలకు ఎస్‌ఎ్‌ఫటీ చొప్పున కేటాయిస్తామని, ఆ తర్వాత ప్రతి నెల ఒక్క ఎస్‌ఎఫ్టీకి రూ. 100ల చొప్పున అద్దె చెల్లిస్తామని అలా 30 నెలల్లోనే పెట్టుబడి డబ్బుకు అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు.ఆకర్షనీయమైన బ్రోచర్లు, పేపర్‌ ప్రకటనలు ఇచ్చి కస్టమర్స్‌ను ఆకర్షించారు. వారి మాటలు నమ్మి పెట్టుబడుల రూపంలో ఎనిమిది మంది బాధితులు రూ. 3.56కోట్లు డబ్బులు చెల్లించారు. డబ్బులు చేతికి అందిన తర్వాత నిందితులు లాభాలు ఇవ్వడం అటుంచి స్పందించడం మానేశారు. దాంతో బాధితులు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. డీసీపీ కె. ప్రసాద్‌, ఎసీపీ ఎస్‌. రవీందర్‌ పర్యవేక్షణలో ఈవోడబ్ల్యూ పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితులు తమ్మిడి వెంకట ప్రసాద్‌, కొర్రపాటి వెంకటరత్నంలను అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో సుమారు 15 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. జేజే ఇన్‌ఫ్రాతో పాటు.. తరిణి అవెన్యూ, ఎల్‌ఎల్‌పీ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - Mar 16 , 2024 | 10:13 AM