Share News

Hyderabad: గోల్డ్‌ ప్లేస్‌లో రోల్డ్‌ గోల్డ్‌.. బంగారు దుకాణాలకు టోకరా

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:58 AM

కొనుగోలు కోసం బంగారు దుకాణాలకు వెళ్తూ.. నకిలీవి పెట్టి బంగారు ఆభరణాలను దోచేస్తున్న కిలాడీ లేడీని సరూర్‌నగర్‌(Sarurnagar) పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: గోల్డ్‌ ప్లేస్‌లో రోల్డ్‌ గోల్డ్‌.. బంగారు దుకాణాలకు టోకరా

- కిలాడీ లేడీ అరెస్ట్‌..

దిల్‌సుఖ్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కోసం బంగారు దుకాణాలకు వెళ్తూ.. నకిలీవి పెట్టి బంగారు ఆభరణాలను దోచేస్తున్న కిలాడీ లేడీని సరూర్‌నగర్‌(Sarurnagar) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయిశ్రీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌(Mahbubnagar) జిల్లా జడ్చర్లకు చెందిన గోనెల గౌతమి(24) సంవత్సరం క్రితం భర్త నరేందర్‌తో కలిసి నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్‌ భూపే్‌షగుప్తానగర్‌లో నివాసం ఉంటోంది. నరేందర్‌ సినీరంగంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌. ఈయన సంపాదన సరిపోవడం లేదని, సులువుగా డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలను మార్గంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా జువెల్లరీ షోరూంలకు వెళ్లి నగలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కళ్లు గప్పి బంగారు ఆభరణాలను తస్కరిస్తుంది. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను పెడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్‌ 31న మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో చైతన్యపురిలోని లలితా జువెల్లర్స్‌కి వచ్చింది. తనకు చైన్స్‌ చూపించాలని కోరడంతో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వివిధ డిజైన్‌లతో కూడిన చైన్‌లను ఒక ట్రేలో తీసుకువచ్చి ఆమె ముందు పెట్టింది. ఆ చైన్‌లను పరిశీలిస్తున్నట్లు గౌతమి నటించింది. ఈ లోపు సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పక్కన ఉన్న ట్రేలు సరిచేస్తుండగా, గౌతమి తన దగ్గర ఉన్న రోల్డ్‌గోల్డ్‌ చైన్‌ను ఆ నగల ట్రేలో పెట్టి, అందులో ఉన్న బంగారు చైన్‌ను మాయం చేసింది. అనంతరం తనకు చైన్‌ డిజైన్స్‌ నచ్చలేదని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. గౌతమి వెళ్లిపోయిన తర్వాత చైన్‌లను ట్రేలో నుంచి తీసి షో కేసులో పెడుతున్న సమయంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రోల్డ్‌ గోల్డ్‌ చైన్‌ను గుర్తించి, దుకాణ యజమాన్యానికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుట్టురట్టు చేసిన సీసీ కెమెరాలు..

సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో డీఐ యాదగిరి, క్రైం ఎస్‌ఐ సునిల్‌లు లలితా జ్యువెల్లర్స్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. గౌతమి వెళ్లిన ఆటోను గుర్తించారు. చైతన్యపురి నుంచి కర్మన్‌ఘాట్‌ వరకు ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా భూపే్‌షగుప్తానగర్‌లో గౌతమి ఉంటున్నట్లు నిర్ధారణకు వచ్చి ఆమెపై నిఘా పెట్టి గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. నవంబర్‌లో చైతన్యపురి మలబార్‌ జ్యువెల్లర్స్‌, చైతన్యపురి మంఖాల్‌, జూబ్లీహిల్స్‌, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. దీంతో సరూర్‌నగర్‌ పోలీసులు ఆమె నుంచి రూ.12 లక్షల విలువ చేసే 19 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 05 , 2024 | 10:58 AM