Share News

Hyderabad: స్మగ్లర్‌గా ఫార్మసీ విద్యార్థి.. బ్యాగుల్లో దుస్తుల మధ్య హెరాయిన్‌

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:13 AM

అతనో బీ ఫార్మసీ విద్యార్థి. చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం స్మగ్లర్‌గా మారాడు. ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణిస్తూ.. లగేజీ బ్యాగులో దుస్తుల మధ్యన డ్రగ్స్‌ పెట్టి రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు తరలించేవాడు.

Hyderabad: స్మగ్లర్‌గా ఫార్మసీ విద్యార్థి.. బ్యాగుల్లో దుస్తుల మధ్య హెరాయిన్‌

- రాజస్థాన్‌ నుంచి నగరానికి సరఫరా

- నగరంలో బైక్‌ సర్వీసుల ద్వారా కస్టమర్లకు..

- ఇద్దరు నిందితుల అరెస్ట్‌

- రూ. 50లక్షల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): అతనో బీ ఫార్మసీ విద్యార్థి. చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం స్మగ్లర్‌గా మారాడు. ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణిస్తూ.. లగేజీ బ్యాగులో దుస్తుల మధ్యన డ్రగ్స్‌ పెట్టి రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు తరలించేవాడు. నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడి బైక్‌ సర్వీ్‌సల ద్వారా కస్టమర్స్‌కు గుట్టుగా సరుకు రవాణా చేస్తాడు. ఇలా కొంతకాలంగా రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితుడిని అతని స్నేహితున్ని (మైనర్‌) రాచకొండ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 50లక్షల విలువైన 80 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో బుధవారం సీపీ సుధీర్‌బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రాజస్థాన్‌ రాషం జాలారు జిల్లా, ధనిసురచంద్‌ గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ బీ ఫార్మసీ చదువుతున్నాడు. స్నేహితుల ద్వారా డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. డ్రగ్స్‌ కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును అదే డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేసి సంపాదించాలని అనుకున్నాడు. రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి బతుకుతున్న స్నేహితులు, తెలిసిన వారి ద్వారా ఇక్కడ డ్రగ్స్‌కు బాగా డిమాండ్‌ ఉందని తెలుసుకున్నాడు. అలా కొంతమంది కస్టమర్స్‌ను తయారు చేసుకున్నాడు.

city3.jpg

ఒక్క గ్రాముకు రూ. 5వేలు

రాజాస్థాన్‌లో ఒక్క గ్రాము హెరాయిన్‌ను రూ. 5 వేల నుంచి 6 వేల చొప్పున 100 గ్రాముల కొనుగోలు చేసేవాడు. దాన్ని ప్యాక్‌ చేసుకొని లగేజీ బ్యాగులో దుస్తుల మధ్య పెట్టుకొని స్నేహితునితో (మైనర్‌) కలిసి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో నగరానికి వచ్చేవాడు. లంగర్‌హౌజ్‌లో ఉంటున్న తన స్నేహితుల రూమ్‌లో స్టే చేసేవాడు. ఆ తర్వాత బైక్‌ సర్వీ్‌సల ద్వారా హెరాయిన్‌ ఉంచిన కవర్స్‌ను కస్టమర్స్‌కు చేరవేసేవాడు. హెరాయిన్‌ను నగరంలో ఒక్క గ్రాము రూ. 10-12వేలకు అమ్మేవాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో బుధవారం హైదరాబాద్‌లో దిగిన స్మగ్లర్స్‌ హయత్‌నగర్‌ పరిధిలోని ఓ పార్కింగ్‌ యార్డు వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ బృందం, హయత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఇంటర్నేషనల్‌ మార్కెట్లో రూ. 50లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మైనర్‌ను హోమ్‌కు తరలించారు. స్మగ్లర్స్‌ను పట్టుకున్న ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ టీమ్‌, హయత్‌నగర్‌ పోలీస్‌, కేసును పర్యవేక్షించిన డీసీపీ మురళీధర్‌, ఏసీపీ మట్టయ్యను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.

Updated Date - Jan 11 , 2024 | 11:19 AM