Hyderabad: జవహర్‌నగర్ కార్పొరేటర్ కిడ్నాప్?
ABN , Publish Date - Feb 04 , 2024 | 11:55 AM
కార్పొరేటర్ కిడ్నాప్ విషయం కలకలం రేపింది. జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాసానికి ఈ నెల 19వ తేదీని ఖరారు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
- ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులు
జవహర్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కార్పొరేటర్ కిడ్నాప్ విషయం కలకలం రేపింది. జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాసానికి ఈ నెల 19వ తేదీని ఖరారు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మేయర్ వర్గానికి చెందిన జవహర్‌నగర్ 10వ కార్పొరేటర్ గండి రాంచందర్(Corporator Gandi Ramchander)ను కిడ్నాప్ చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు శిల్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న రాత్రి అసమ్మతి కార్పొరేటర్లు క్యాంపునకు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, అసమ్మతి కార్పొరేటర్లు రాంచందర్‌ను కార్లు మారుస్తూ బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో తమకు లొకేషన్ పంపించారని, వెంటనే వెళ్లి కాపాడామని, పూర్తి వివరాలు పోలీసులకు ఇచ్చామని కార్పొరేటర్ ఏకే మురుగేశ్ వివరణ ఇచ్చారు. అసమ్మతి వర్గంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మరో 15 రోజులు క్యాంపులోనే కొనసాగుతారా..? ఇచ్చిన మాట మీదే ఉంటారా? అనేది తేలాలంటే ఈ నెల 19 వరకు వేచి చూడాల్సిందే. అయితే, పోలీసులు మాత్రం కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, రాంచందర్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. కిడ్నాప్ జరిగిందా లేదా అనే విషయంతోపాటు, తాను మేయర్ వర్గంలో ఉన్నాడా లేక అసమ్మతి వర్గంలో ఉన్నారా అనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు.