Stock Market: మధ్యాహ్నం తర్వాత లాభాలు.. దేశీయ సూచీల సరికొత్త రికార్డు!
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:44 PM
మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి.

మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు కోలుకోలేకపోయాయి. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బ్యాంక్ నిఫ్టీ భారీగా లాభపడింది. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాల్లోకి వచ్చాయి.
బుధవారం ఉదయం 73,587 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 74,151 వద్ద ఆల్‌టైమ్ హైకు చేరుకుంది. చివరకు 409 పాయింట్ల లాభంతో 74,085 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. అలాగే నిఫ్టీ 117.75 పాయింట్ల లాభంతో 22,474 వద్ద రోజును ముగించింది. అయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 257 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి. ఎన్టీపీసీ, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.