Forex Market : ‘బేర్’ మంటున్న రూపాయి
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:05 AM
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి రూ.85.48 వద్ద ముగిసింది.

మరో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 85.48కి పతనం..
త్వరలో 86 స్థాయికి పడిపోయే చాన్స్
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి రూ.85.48 వద్ద ముగిసింది. 2023 ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒకే రోజు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఆ రోజు డాలర్‌తో భారత కరెన్సీ మారకం రేటు 68 పైసలు నష్టపోయింది. శుక్రవారం ఉదయం డాలర్‌తో 85.31 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం రేటు ఇంట్రాడేలో ఒక దశలో 53 పైసలు నష్టపోయి 85.80 స్థాయిని తాకింది. ఆ దశలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పెద్దఎత్తున డాలర్లను అమ్మకానికి పెట్టడంతో కొద్దిగా కోలుకుని 21 పైసల నష్టంతో 85.48 వద్ద ముగిసింది.
రెండు వారాలుగా ఇదే ట్రెండ్: గడిచిన రెండు వారాలుగా అమెరికా డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆపసోపాలు పడుతోంది. గురువారం కూడా డాలర్‌తో రూపాయి 12 పైసలు నష్టపోయి 85.27 వద్ద ముగిసింది. అంతకు ముందు రెండు రోజుల్లోనూ 13 పైసలు నష్టపోయింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే కొద్ది రోజుల్లోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు 86కు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. రూపాయి మారకం రేటు పతనానికి ఈ కింది అంశాలు దోహదం చేస్తున్నాయి.
డాలర్లకు డిమాండ్: డిసెంబరు 31 సమీపిస్తుండడంతో దిగుమతిదారులు.. తమ చెల్లింపుల కోసం డాలర్ల కోసం ఎగబడుతున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్లో డాలర్ల సరఫరా లేదు. దీంతో గత రెండు వారాలుగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి గింగిరాలు పోతోంది.
ఎఫ్‌పీఐల అమ్మకాలు: దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఈ నెల ప్రారంభంలో అమ్మకాల హోరు కొద్దిగా తగ్గించిన ఎఫ్‌పీఐలు మళ్లీ అమ్మకాలకు దిగాయి. గురువారం ఈ సంస్థలు రూ.2,376.67 కోట్ల విలువైన నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇది కూడా డాలర్‌తో రూపాయి మారకం రేటును దెబ్బతీస్తోంది.
అమెరికా వడ్డీ రేట్లు: అమెరికాలో వడ్డీ రేట్లు మళ్లీ పైచూపులు చూస్తున్నాయి. పదేళ్ల కాల పరిమితి ఉండే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేటు 0.76 శాతం పెరిగి ఏడు నెలల గరిష్ఠ స్థాయి 4.61 శాతానికి చేరింది. దీంతో భారత డెట్ ఫండ్స్‌లో మదుపు చేసిన ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను మరింత సురక్షితంగా భావించే అమెరికా రుణ పత్రాలకు తరలిస్తున్నాయి. ఇది కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది.
బలపడుతున్న డాలర్: డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు మరింత పుంజుకుంది. గురువారం మరో 0.04 శాతం పెరిగి 107.94కు చేరింది. ఈ ప్రభావం రూపాయి మీదా కనిపిస్తోంది.
చమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ పైచూపులు చూస్తోంది. శుక్రవారం బ్యారల్ బ్రెంట్ రకం చమురు ధర 73.37 డాలర్లకు చేరింది. త్వరలోనే ఇది మరింత పెరిగి 80 డాలర్లకు చేరువవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మన ద్రవ్య లోటు పెరిగి రూపాయి మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఫారెక్స్ నిల్వలూ ఢమాల్
రూపాయి మారకం రేటుతో పాటు భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు 64,439 కోట్ల డాలర్లకు (సుమారు రూ.55.08 లక్షల కోట్లు) పడిపోయాయి. గత ఏడు నెలల్లో ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ ఇంత కనిష్ఠ స్థాయికి చేరలేదు. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 850 కోట్ల డాలర్లు తక్కువని ఆర్‌బీఐ తెలిపింది. గత నెల రోజుల్లో ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ ఒక వారంలో ఇంత భారీగా పడిపోలేదు. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, విదేశీ చెల్లింపుల భారం పెరగడం, రూపాయి మారకం రేటును ఒక స్థాయిలో నిలబెట్టేందుకు ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ ద్వారా డాలర్లను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.