Share News

Expenses Growing : ఆహారేతర ఖర్చులే అధికం

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:51 AM

దేశీయంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చుల వ్యత్యాసం రోజురోజుకు తగ్గుతోంది. శుక్రవారం కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘గృహ వినియోగ ఖర్చుల సర్వే’ ఈ విషయం తెలిపింది.

Expenses Growing : ఆహారేతర ఖర్చులే అధికం

  • తగ్గుతున్న వినియోగ ఖర్చులు

  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అదే ట్రెండ్‌

  • గృహ వినియోగ ఖర్చుల సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చుల వ్యత్యాసం రోజురోజుకు తగ్గుతోంది. శుక్రవారం కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘గృహ వినియోగ ఖర్చుల సర్వే’ ఈ విషయం తెలిపింది. 2022 ఆగస్టు-2023 జూలై కాలంతో పోల్చితే 2023 ఆగస్టు-2024 జూలై మధ్య కాలంలో ఈ వ్యత్యాసం మరింత తగ్గినట్లు వెల్లడించింది. సమాజంలో సంపద పంపిణీ, వినియోగ ఖర్చుల అసమానతలను తెలిపే జినీ కోఎఫీషియెంట్‌ నమూనా కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. దీని ప్రకారం 2023 ఆగస్టు- 2024 జూలై మధ్య కాలంలో వినియోగ ఖర్చుల అసమానత గ్రామీణ ప్రాంతాల్లో 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందని సర్వే పేర్కొంది.

ఇదీ ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నెలవారీ సగటు ఖర్చు (ఎంపీసీఈ)లు రూ.3,773, పట్టణ ప్రాంతాల్లో రూ.6,459గా నమోదయ్యాయి. అదే 2023-24 కాలానికి వచ్చేసరికి గ్రామాల్లో రూ.4,122కు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996కు పెరిగినట్టు సర్వే తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను మినహాయించినా, ప్రస్తుత ధరల ప్రకారం ఈ కాలంలో నెలవారీ గృహ వినియోగ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247గా, పట్టణ ప్రాంతాల్లో రూ.7,078గా నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాల నెలవారీ వినియోగ ఖర్చుల ఆధారంగా ప్రభుత్వం ఈ సర్వే రూపొందించింది. దీని ప్రకారం చూసినా పట్టణ-గ్రామీణ ప్రాంతాల నెలవారీ వినియోగ ఖర్చుల వ్యత్యాసం 2022-23లో 84 శాతం నుంచి 71 శాతానికి, 2023-24లో 70 శాతానికి తగ్గింది.


మిగతా అవసరాలే ఎక్కువ: నెలవారీ గృహోపయోగ ఖర్చుల్లో ఆహారేతర ఖర్చులదే అగ్రస్థానమని కూడా సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం గ్రామీణ నెలవారీ గృహ వినియోగ ఖర్చుల్లో 53 శాతం ఆహారేతర వస్తువులపై ఖర్చు చేశారు. పట్టణ జీవులకు వచ్చేసరికి ఇది మరింత పెరిగి 60 శాతంగా నమోదైంది. గ్రామీణ-పట్టణ ప్రాంత ఆహార ఖర్చుల్లో శీతల పానీయాలు, అల్పాహారాలు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్ధాల ఖర్చులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆహారేతర ఖర్చుల్లో ప్రయాణ ఖర్చులు, బట్టలు, పాదరక్షలు, వినోద, ఇతర చిల్లర ఖర్చులు ఎక్కువై పోయాయి. ఇంటి, గ్యారేజీ అద్దెలు, హోటల్‌ వసతుల కోసం చేసే ఖర్చులూ ఆహారేతర ఖర్చుల్లో ఏడు శాతం వరకు ఉన్నట్టు సర్వే తెలిపింది.

Updated Date - Dec 28 , 2024 | 03:59 AM