Share News

RBI Rule: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు.. అవి ఏంటంటే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:25 PM

ఆన్‌లైన్ మనీ ట్రాన్‌ఫర్‌ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. ఏప్రిల్ 1, 2025 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్‌ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది.

RBI Rule: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు.. అవి ఏంటంటే..
New rules for online money transfer

ఆన్‌లైన్ మనీ ట్రాన్‌ఫర్‌ (online money transfer)ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. ఏప్రిల్ 1, 2025 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్‌ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది. నిధుల బదిలీలో పొరపాట్లను నివారించడానికి, మోసాలను అరికట్టడం కోసం లబ్ధిదారుల ఖాతా పేరును ధ్రువీకరించే సదుపాయాన్ని తీసుకురాబోతున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ కొత్త సదుపాయం ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వ్యక్తి లబ్ధిదారుల పేరును తెలుసుకునే వీలు కలుగుతుంది. చెల్లింపుదారు నమోదు చేసిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఆధారంగా, లబ్ధిదారుని బ్యాంక్ సీబీఎస్ నుంచి ఖాతాదారుడి పేరు బదిలీ చేసే వ్యక్తికి ఈ పేరు కనిపిస్తుంది. ఆ పేరు సరైనదేనని ధ్రువీకరించుకున్న తర్వాత చెల్లింపుదారుడు ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయవచ్చు. ఒకవేళ లబ్ధిదారుడి పేరు కనిపించకపోతే, ఆ ట్రాన్సాక్షన్ చేయాలా? వద్దా? అనేది చెల్లింపుదారుడి ఇష్టం.


ఎలాంటి ఛార్జీలు లేకుండానే కస్టమర్లకు ఈ సేవను అందిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సదుపాయానికి సంబంధించిన ఎలాంటి డేటాను నిల్వ చేయదు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితమైన, వినియోగదారు-స్నేహపూర్వకంగా మార్చడానికి ఆర్బీఐ ఈ ముఖ్యమైన చొరవ తీసుకుంటోంది. ఇది ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లో తప్పులను తగ్గించడమే కాకుండా, కస్టమర్ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ సంబంధిత వివాదాలు తలెత్తినప్పుడు, చెల్లింపుదారు బ్యాంక్, లబ్ధిదారుడి బ్యాంక్ వివాదాన్ని ప్రత్యేక లుకప్ రిఫరెన్స్ నంబర్, సంబంధిత లాగ్‌లను ఉపయోగించి పరిష్కరిస్తారని కూడా ఆర్బీఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2024 | 05:25 PM