Share News

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

ABN , Publish Date - May 03 , 2024 | 08:27 AM

రూ.2 వేల నోట్లపై(RS.2000) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్‌లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

ఢిల్లీ: రూ.2 వేల నోట్లపై(RS.2000 Notes) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్‌లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.

RBI ప్రకటన ప్రకారం.. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రూ. 2 వేల నోట్ల మొత్తం విలువ మే 2023లో రూ. 3.56 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ 30, 2024 నాటికి రూ. 7,961 కోట్లకు పడిపోయింది. అంటే రూ.2 వేల నోట్ల లభ్యత గణనీయంగా తగ్గిందనమాట.

క్లీన్ నోట్ పాలసీ

కరెన్సీ చలామణిని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. రూ. 2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో జరిగేవి. 2023 మే 19 నుంచి ఆర్బీఐ ఇష్యూ చేసిన కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వెసులుబాటు కలిగింది.


పోస్టాఫీసు డిపాజిట్లు

గతేడాది అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు,సంస్థల నుంచి రూ. 2 వేల నోట్లను స్వీకరించి వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. అదే కాకుండా రూ.2 వేల నోట్లను పోస్ట్ ద్వారా తమ ఖాతాల్లో క్రెడిట్ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.

అందుకే రూ. 2 వేల నోట్లు చలామణిలోకి..

ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తరువాత(రూ. 500, రూ. 1,000 నోట్లు) కరెన్సీ అవసరాలను తీర్చడానికి రూ.2 వేల నోట్లను ఆర్బీఐ జారీ చేసింది. రూ.2 వేల నోట్లనూ రద్దు చేయడంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. మిగతా నోట్లు కూడా త్వరలోనే పూర్తిగా తిరిగివస్తాయని ఆర్బీఐ భావిస్తోంది.

For Latest News and Business News Here

Updated Date - May 03 , 2024 | 08:27 AM