Share News

మాలధారణం.. నియమాల తోరణం

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:03 AM

స్వామియే శరణం అయ్యప్పా... అంటూ స్వాముల శరణుఘోషతో ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు మార్మోగుతుఉన్నాయి. స్వాముల మాలధారణతో ఆధ్యాత్మిక చింతన భావం పెరుగుతోంది

మాలధారణం.. నియమాల తోరణం

ధర్మవరం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్వామియే శరణం అయ్యప్పా... అంటూ స్వాముల శరణుఘోషతో ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు మార్మోగుతుఉన్నాయి. స్వాముల మాలధారణతో ఆధ్యాత్మిక చింతన భావం పెరుగుతోంది. ఈ 41 రోజుల పాటు స్వామి వారి కఠిన దీక్షతో మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఏటా అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో స్వాములు మాలధారణ చేస్తుంటారు. కార్తీక మాసం, ధనుర్మాసం రెండు నెలల్లో మండలి దీక్ష, మకరజ్యోతి దర్శనానికి వెళ్లే భక్తులతో శబరిమల కిటకిటలాడుతుంది. ఈ ఏడాది అధిక సంఖ్యలో స్వాములు మాల ధరించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షమంది స్వాములు మాల ధరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది గ్రామాల్లో స్వాముల సంఖ్య మరింత పెరిగింది.


క్రమశిక్షణకు మారు పేరు : స్వామి మాలధారణ 41 రోజుల పాటు నియమ, నిష్టలతో ఆచరించే స్వాములు శారీరకంగా , మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రవర్తణలో చాలా మార్పు వస్తుంది. సత్ప్రవర్తన మంచి ఆలోచనకు దారితీస్తుంది. శాకాహారం తీసుకోవడం, చిన్న,పెద్ద, కుల, మత, ఆర్థిక తారతమ్యం లేకుండా అందరూ ఒక చోట ఉండి పూజలు చేస్తుంటారు. మాలధారణ చేసిన భక్తులు 41 రోజుల పాటు కఠోర దీక్ష చేస్తారు. అనంతరం గురుస్వాములు ద్వారా ఇరుముడినని కట్టి కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వెళ్లి ఇరుముడిని అయ్యప్పకు సమర్పిస్తారు. అక్కడకు వెళ్లలేని స్వాములు ద్వారపూడిలో అందజేస్తారు.


మాలధారణతో ప్రయోజనాలు

ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. శిర స్నానంతో రక్తపోటు తగ్గి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శీతాకాలం స్వాములు నల్లటి వస్ర్తాలను ధరిస్తారు. నల్లటి వస్ర్తాలు వెచ్చదనాన్ని ఇస్తాయి. చలికాలంలో ఇవి శరీరానికి ఉపకరిస్తాయి. స్వాములు శని ప్రభావానికి లోనుకాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని గురుస్వాములు అంటున్నారు. నుదుటన చందనం, విభూది, కుంకుమ పెట్టడం వల్ల చల్లధనంతో పాటు మానసిక ప్రశాంతత కల్గుతుంది. కాళ్లకు చెప్పులు లేకపోవడం వల్ల నడిచేటప్పుడు చిన్నచిన్న రాళ్లు తగిలి రక్త ప్రసరణ బాగా అవుతుంది. శాఖాహారంతో ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు మంచి దినచర్య అలవడుతుంది.

Updated Date - Dec 02 , 2024 | 12:03 AM