Share News

విదేశాల్లో ఉద్యోగం.. 2.5 లక్షల జీతం..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:49 AM

‘మీకు ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఫర్వాలేదు. కెనడాలో మీకు ఉద్యోగం ఇప్పిస్తా. నెలకు రెండున్నర లక్షల జీతం. దీనికోసం మీరు చేయాల్సింది.. అక్కడ మీరు సంపాదించబోయే రెండు నెలల జీతాన్ని ముందుగా ఇక్కడ పెట్టుబడి పెట్టడమే’’ అంటూ ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఆశలు కల్పించింది. కెనడా డాలర్లను ఆశగా చూపి వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసి వారందరికీ కుచ్చుటోపి పెట్టింది. విజయవాడలోని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకురాలి వలలో చిక్కుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన మాయలాడి నిర్వాకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విదేశాల్లో ఉద్యోగం.. 2.5 లక్షల జీతం..!

5 లక్షలిస్తే వీసా, టికెట్‌, ఉద్యోగ కల్పన బాధ్యత నాదే

కెనడాలో ఉద్యోగాల పేరిట ఓ కన్సల్టెన్సీ ఎర

50 మందికిపైగా నిరుద్యోగులకు కుచ్చుటోపీ

నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బాధితులకే బెదిరింపు

పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమైన బాధితులు

విజయవాడలో రూ.కోట్లు దండుకున్న నకిలీ కన్సల్టెన్సీ నిర్వాహకురాలు

‘మీకు ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఫర్వాలేదు. కెనడాలో మీకు ఉద్యోగం ఇప్పిస్తా. నెలకు రెండున్నర లక్షల జీతం. దీనికోసం మీరు చేయాల్సింది.. అక్కడ మీరు సంపాదించబోయే రెండు నెలల జీతాన్ని ముందుగా ఇక్కడ పెట్టుబడి పెట్టడమే’’ అంటూ ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఆశలు కల్పించింది. కెనడా డాలర్లను ఆశగా చూపి వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసి వారందరికీ కుచ్చుటోపి పెట్టింది. విజయవాడలోని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకురాలి వలలో చిక్కుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన మాయలాడి నిర్వాకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు, జూన్‌ 16 : గతంలో విజయవాడ ఆటోనగర్‌లోని ఓ కన్సల్టెన్సీ ద్వారా కొంతమంది యువకులు విజిటింగ్‌ వీసాపై కెనడా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వారిని చూసి మరికొందరు కూడా కెనడా వెళ్దామని భావించి ఆటోనగర్‌లోని కన్సల్టెన్సీని సంప్రదించారు. ఆ కన్సల్టెన్సీలో భాగస్వామి అయిన ఓ యువతి బాధితులకు పరిచయమై.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని వారందరికీ నమ్మకం కలిగించింది. అదే సమ యంలో ఆ కన్సల్టెన్సీలో భాగస్వామితో విభేదాలు వచ్చి ఆమె బయటకు వచ్చేసింది. ఏలూరు రోడ్‌లో మరో కన్సల్టెన్సీ స్థాపించి వారందరినీ అక్కడకు పిలిపించుకుంది. గత డిసెంబరు నుంచి ఒక్కొక్కరి వద్ద ఐదు లక్షలు కట్టించుకుంది. ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి గుంటూరు వరకు అనేకమంది ఆమెకు డబ్బులు కట్టారు. గుంటూరుకు చెందిన కే అనిల్‌ కుమార్‌ నుంచి రూ.5 లక్షలు కట్టించుకుంది. ఆమె సూచన మేరకు బ్రిటన్‌లో ఎమ్మెస్‌ చదువుతున్న అనిల్‌ కుమార్‌ అన్న కుమార్తెను కూడా చదువు మధ్యలోనే ఆపేసి స్వదేశానికి రప్పించారు. ఆ యువతి కూడా కన్సల్టెన్సీ నిర్వాహకురాలికి రూ.5 లక్షలు చెల్లించారు. మీకు వీసా వచ్చిందని, ఉద్యోగం కూడా రెడీగా ఉందని ఏప్రిల్‌ 25న కెనడా వెళ్లిపోవడమే అని నమ్మించింది. ఇందుకుగాను వారిరువురి పేరుతో ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలతో విమాన టికెట్లు బుక్‌ చేసినట్లు నకిలీ టికెట్లు కూడా పంపింది. తక్షణం డబ్బులు చెల్లిస్తే టికెట్‌ బుక్‌ అవుతుందని.. లేదంటే వీసా కూడా రద్దవుతుందని భయ పెట్టింది. నిజమేనని నమ్మిన బాధితులు మరో మూడున్నర లక్షలు ఆమెకు చెల్లించారు. అనంతరం వారు కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా గడువు సమీపించే సమయానికి ఆమె మాట మార్చింది. సాంకేతిక సమస్య వచ్చిందని త్వరలోనే మీరు వెళ్లే తేదీని ఖరారు చేస్తానని కాలయాపన చేసింది. దీంతో బాధితులు తాము మోసపో యామని భావించారు. అదే సమయంలో వివిధ జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో వారందరూ కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి చర్చించుకున్నారు. మోసపోయామని గ్రహించి రెండు రోజుల క్రితం ఏలూరు రోడ్‌లోని కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లి తమ డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ, ఆమె వారిని తీవ్రస్థాయిలో బెదిరిం చింది. బాధితులే తనకు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేయబోయారంటూ విజయవాడ కమిషనర్‌, మాచవరం సీఐకి ఫిర్యాదు చేసినట్టుగా తయారు చేసిన ఫిర్యాదును అనిల్‌ కుమార్‌కు పంపి పరోక్షంగా బెదిరించింది. ఈ నకిలీ కన్సల్టెన్సీ నిర్వాహకుల చేతిలో మోసపోయిన వారిలో అత్యధిక మంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించేందుకు సిద్థమయ్యారు. తమను మోసం చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకురాలి నుంచి తమ సొమ్మును రికవరీ చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:49 AM