Share News

భూ పంపిణీలో దళితులకు అన్యాయం

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:46 PM

డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే భూ పంపిణీకి అర్హులుగా నమోదు చేసిన రెవెన్యూ అధికారులు మిగిలిన వారికి మొండి చేయి చూపారని రైల్వేకోడూరు వ్యవసాయ కార్మికుల సంఘం నేతలు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

భూ పంపిణీలో దళితులకు అన్యాయం
కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తున్న కార్మికసంఘం నేతలు

రాయచోటి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 12: డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే భూ పంపిణీకి అర్హులుగా నమోదు చేసిన రెవెన్యూ అధికారులు మిగిలిన వారికి మొండి చేయి చూపారని రైల్వేకోడూరు వ్యవసాయ కార్మికుల సంఘం నేతలు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పండుగోల మణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు నిరుపేద దళిత, గిరిజనులకు ఒక సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇప్పటికి 100 అర్జీలు పెట్టినా, రైల్వే కోడూరు మండల తహసీల్దార్‌ అసైన్మెంట్‌ భూములను పెత్తందారులకే కట్టబెడుతున్నారన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో 8వ విడత అసైన్మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి నిజమైన నిరుపేద దళిత, గిరిజనులకు భూ పంపిణీ కార్యక్రమం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ అధ్యక్షుడు రేవూరి శంకరయ్య, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చలంపాటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

‘వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి’

మాసాపేటలోని 3వ సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌ లో 2021లో వార్డెన్‌గా విధులు నిర్వహించిన వ్యక్తి తన భార్య, ఆమె తమ్ముడి పేర్లతో అక్రమ లావాదేవీలు నిర్వహించాడని ఐఎఫ్‌ఎస్‌ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడంతోపాటు, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశాడన్నారు. 2021 సంవత్సరంలో విద్యార్థుల బయోమెట్రిక్‌పై విచారణ చేయిస్తే అక్రమాలు బయటపడ తాయన్నారు. ఐఎఫ్‌ఎస్‌ నాయకులు శివతేజ, ఉపేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:46 PM