Share News

'ఎస్మా'సురుడు'

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:30 AM

2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల గౌరవవేతనం రూ.4,200 మాత్రమే. చంద్రబాబు దానిని రూ.7,000 వేలకు పెంచారు. 2018లో మరోసారి రూ.10,500కు పెంచారు. అంటే.. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.6,300 పెరిగింది. అంతేగాక అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పఽథకాలు అందేలా నిబంధనలు సవరించారు.

'ఎస్మా'సురుడు'

అంగన్వాడీలకు జగన్‌ వంచన

తెలంగాణ కంటే రూ.వెయ్యి వేతనం అదనంగా ఇస్తామని హామీ

అధికారంలోకి వచ్చాక తూచ్‌.. ఓసారి వెయ్యి పెంచి

పథకాలు కట్‌.. హామీ అడిగితే ఎస్మా ప్రయోగం

నాడు వేతనాల పెంపు

2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల గౌరవవేతనం రూ.4,200 మాత్రమే. చంద్రబాబు దానిని రూ.7,000 వేలకు పెంచారు. 2018లో మరోసారి రూ.10,500కు పెంచారు. అంటే.. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.6,300 పెరిగింది. అంతేగాక అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పఽథకాలు అందేలా నిబంధనలు సవరించారు.

నేడు ఎస్మా బహుమతి

అంగన్వాడీలకు తెలంగాణలో కంటే వేతనం రూ.1000 ఎక్కువగా ఇస్తామన్న హామీకి జగన్‌ తూట్లు పొడిచారు. 2019లో ఒకసారి రూ.1000 పెంచి సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.13,650, ఆయాలకు రూ.7,800 ఇస్తుండగా.. ఏపీలో రూ.11,500, రూ.7,000 ఇస్తున్నారు. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన అంగన్వాడీల మొర వినకుండా జగన్‌ సర్కారు వారిపై ఎస్మా ప్రయోగించింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) ‘నా అక్కాచెల్లెమ్మలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ సంబోధిస్తుంటారు. కానీ లక్షా నాలుగు వేలమంది అంగన్వాడీలకు ఉసూరు మనిపించారు. గత ఎన్నికల్లో ఇతర వర్గాలకు మాదిరిగానే వారికి ఇచ్చిన హామీని నెరవేర్చకుండా చేతులెత్తేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని సమ్మెకు దిగిన అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపి అణచివేశారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి ఎక్కువగా వేతనాలు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.


దీంతో ఇతర వర్గాల మాదిరే అంగన్వాడీలు జగన్‌ మాటను నమ్మారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ విధంగా వేతనాలు పెంచలేదు. 2019లో వేతనం రూ.1000 పెంచినట్లే పెంచి అంగన్వాడీ కార్యకర్తలకు వస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేశారు. పలు నిబంధనలతో పథకాలకు అనర్హులుగా చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ ఆసరా, రైతు భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ పథకాలను అంగన్వాడీలు అందుకోలేకపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంతో పాటు సంక్షేమ పథకాలు రద్దు చేయడంతో అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు.

సంక్షేమ పథకాలు కట్‌ చేయడంపై వినతులు అందజేసి, నిరసనలు తెలిపినా జగన్‌ సర్కార్‌ కనికరించలేదు. చిరుద్యోగులైన తమకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సంక్షేమ పథకాలకు అర్హత కలిగిన అంగన్వాడీలకూ అమలు కావడంలేదని, సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించి అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని అంగన్వాడీలు కోరినా పట్టించుకోలేదు. ఐదేళ్లుగా జగన్‌ సర్కార్‌ అంగన్వాడీలను సంక్షేమ పథకాలకు దూరం చేసింది. మరోవైపు ఒకటికి నాలుగు యాప్‌లు రూపొందించి అంగన్వాడీలపై పనిభారం పెంచేసింది.


42 రోజులు సమ్మె చేసినా..

తమ డిమాండ్ల సాధనకు అనేకసార్లు వినతులు ఇచ్చి, నిరసనలు తెలిపిన అంగన్వాడీలు.. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత సమ్మెకు దిగారు. తెలంగాణతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అయితే జగన్‌ సర్కారు చర్చలు అంటూనే అంగన్వాడీలపై నిర్బంధకాండకు దిగింది. వారిని భయబ్రాంతులకు గురి చేసి పోలీసులను ప్రయోగించింది. సర్కారు ఆంక్షల నడుమే 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం దిగి రాలేదు. వారిపై ఎస్మా ప్రయోగించింది. సమ్మె విరమించి విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ఆదేశాలు ఇచ్చింది. అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం ఎనిమిదిసార్లు చర్చలు జరిపినా వారి ప్రధాన డిమాండ్‌ అయిన వేతనాల పెంపుపై దిగిరాలేదు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, జూన్‌లో వేతనాలు పెంచుతామని మాయ మాటలు చెప్పి దాటవేసింది. ఇతర డిమాండ్లపై కొన్ని జీవోలు ఇచ్చి, మరికొన్ని నెరవేరుస్తామంటూ హామీలు ఇచ్చింది. మంత్రుల కమిటీ ఇచ్చిన హామీల్లో కొన్నింటికి జీవోలు ఇవ్వకపోవడంతో అంగన్వాడీ సంఘాలు ఇప్పటికీ ప్రభుత్వానికి వినతులు ఇస్తూనే ఉన్నాయి.

మాట మడత..

తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు రూ.వెయ్యి పెంచుతామన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. వేతనాలపై ప్రశ్నించిన అంగన్వాడీలకు ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. తెలంగాణలో వేతనాలు పెరిగినప్పుడల్లా తాము పెంచుతామని చెప్పలేదని బుకాయించింది.

తాము అధికారంలోకి వచ్చిన నాటికి తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల జీతం రూ.10,500 ఉందని, తాము రూ.వెయ్యి పెంచి రూ.11,500 చేశామని, పొరుగు రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం ఇచ్చామని గొప్పలకు పోయింది. అయితే ఆ తర్వాత తెలంగాణలో అంగన్వాడీల వేతనం పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ.13,650, ఆయాలకు రూ.7,800 ఇస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీలకు వేతనాలు వారికంటే రూ.1000 ఎక్కువ ఇవ్వడం మాట అటుంచి, వారితో సమానంగా కూడా పెంచలేదు.

Updated Date - Apr 26 , 2024 | 05:30 AM