సీఐడీ దూకుడు
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:18 AM
ఒక ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి.
కాకినాడ పోర్టు కేసులో కేవీ రావు వాంగ్మూలం!
సాక్షుల విచారణ, ఆధారాల సేకరణపై దృష్టి
3వేల కోట్ల ఆస్తి కొట్టేయడానికి కుట్ర.. మోసం.. బెదిరింపులు
ఏ1 విక్రాంత్ రెడ్డిని అరెస్టు చేసి విచారించే వీలు
ఆధారాలు లభిస్తే జగన్ పేరూ నిందితుల జాబితాలో!
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఒక ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారం ఇందుకు పరాకాష్ఠ అని సీఐడీ భావిస్తోంది. దీంతో కాకినాడ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచేశారు. రూ. మూడు వేల కోట్ల ఆస్తిని కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో బుధవారం బాధితుడు కేవీ రావు వాంగ్మూలాన్ని నమోదుచేసినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు వై.విక్రాంత్ రెడ్డి నేరుగా తాడేపల్లి ప్యాలె్‌సకు కేవీ రావును తీసుకెళ్లి బెదిరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా జరిగింది..... ఆ సమయంలో తాడేపల్లి ప్యాలె్‌సలో ఎవరున్నారు...బాధితుడితోపాటు ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా.....హైదరాబాద్‌లో విక్రాంత్ రెడ్డి ఇంటికెళ్లినప్పుడు కేవీ రావుతోపాటు ఎవరైనా వెళ్లారా.... తదితర అంశాలపై సమీక్షించిన సీఐడీ అధికారులు....కేవీ రావు వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసే అవకాశాలపై కసరత్తు చేసినట్లు సమాచారం. ఏడేళ్లకు పైగా శిక్షలు పడే సెక్షన్లు ఉన్నందున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేసి ప్రశ్నించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
మరోవైపు ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి.....ఆడిటర్ పీకేఎఫ్ శ్రీధర్ ‘సంతానం ఎల్‌ఎల్‌పీ’తో ఎవరు 900కోట్ల మోసం రిపోర్టు చేయించారు....సంస్థ చేతులు మారగానే కేవలం తొమ్మిది కోట్లకే ఎలా తగ్గించారు....అనేదానిపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఎవరి పాత్రపై ఆధారాలు లభించినా వెంటనే అరెస్టు చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఆధారాలు లభిస్తే ఈ కేసులో జగన్ పేరు కచ్చితంగా చేర్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో కొందరు అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల పాత్రపైనా సాక్ష్యాలు సేకరించే పనిలో సీఐడీ నిమగ్నమై ఉంది. ‘రూ.మూడు వేల కోట్ల ఆస్తి కొట్టేయడానికి నేరపూరిత కుట్ర, మోసం, బెదిరింపులకు పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తేనే మరిన్ని ఆధారాలు లభిస్తాయి’ అని సీఐడీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.