Share News

YSR Congress: ఎన్నికల వేళ.. వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

ABN , Publish Date - May 05 , 2024 | 03:57 AM

రైతుల భూముల హక్కులకు ముప్పు తెచ్చేలా ఉన్న ల్యాండ్‌ టైటిల్‌ చట్టం సెగ అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు గట్టిగానే తగులుతోంది..

YSR Congress: ఎన్నికల వేళ.. వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

  • ఎన్నికల వేళ ల్యాండ్‌ టైటిల్‌ సెగ..

  • చట్టం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

  • నేడు ముఖ్యనేతలతో జగన్‌ భేటీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి):

రైతుల భూముల హక్కులకు ముప్పు తెచ్చేలా ఉన్న ల్యాండ్‌ టైటిల్‌ చట్టం (AP Land Titling Guarantee Act- 2022) సెగ అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు (CM YS Jagan) గట్టిగానే తగులుతోంది. భూములు, ఆస్తులకు ఎసరు పెట్టేలా జగన్‌ సర్కారు ఈ చట్టం రూపొందించడంపై రైతులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ వైసీపీ నాయకులను నిలదీతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని వ్యతిరేకించడంతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాల నిండా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోలు వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందులలో ఏకంగా ఆయన సతీమణి భారతిని సొంత పార్టీ నేతలే నిలదీశారంటే ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీంతో ఇన్నాళ్లూ తాను చేసిందే చట్టం అన్నట్టుగా వ్యహరించిన సీఎం జగన్‌ స్వరంలోనూ మార్పు వస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేతలపై విమర్శలకే పరిమితమవుతూ వస్తున్న జగన్‌.. ల్యాండ్‌ టైటిల్‌ చట్టంపై వివరణ ఇచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఈ చట్టం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చించాలని నిర్ణయించారు. ఆదివారం ఎన్నికల బహిరంగ సభల్లో కూడా పాల్గొనకుండా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ చట్టంపై ప్రజలకు స్పష్టత ఇచ్చేలా పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయాలని జగన్‌ భావిస్తున్నారు. ప్రజలకు నచ్చజెప్పేలా 47,000 బూత్‌ కమిటీ సభ్యులు, స్థానిక నేతలను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు.


తొలిసారి జగన్‌ వేడుకోలు

ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేని సమయంలో ల్యాండ్‌ టైటిల్‌ చట్టంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అధికార పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ల్యాండ్‌ టైటిల్‌ చట్టం, పాస్‌ పుస్తకాలపై ఫొటోల వ్యవహారంపై ప్రజాగ్రహాన్ని మొదట్లో ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకున్నారు. ఎన్నికల వేళ వైసీపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడటం, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో జగన్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. ల్యాండ్‌ టైటిల్‌ చట్టం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలేమీ లేవంటూ శనివారం హిందూపురం సభలో ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిని అభ్యర్థిస్తూ మాట్లాడారు. కాగా, ల్యాండ్‌ టైటిల్‌ చట్టంపై రాష్ట్ర మంత్రులు విరుద్ధంగా మాట్లాడుతూ.. ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు.

అసలు లేని చట్టాన్ని ఎలా అమలు చేస్తారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించగా.. ముఖ్యమంత్రి జగన్‌ చట్టాన్ని అమలు చేసి తీరుతారంటూ మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కాగా, వైఎస్‌ కుటుంబానికి పులివెందుల కంచుకోట లాంటిది. అయితే ఇప్పుడు పులివెందుల ప్రజలు నిరసన గళం విప్పుతున్నారు. జగన్‌ తరఫున ప్రచారం చేస్తున్న భారతీరెడ్డిని నిలదీస్తున్నారు. ఇకవివేకా హత్య కేసులో సొంత చెల్లెళ్లు షర్మిల, సునీత విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎన్నికల వేళ ల్యాండ్‌ టైటిల్‌ చట్టం కారణంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీపై ఉంటుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 05 , 2024 | 08:47 AM