Share News

‘కోడ్‌’కు జెల్లకొట్టి..

ABN , Publish Date - May 07 , 2024 | 05:47 AM

వైద్యులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.. ఆప్షన్లు అడగలేదు.. కానీ కోడ్‌ అమలులో ఉండగానే అకస్మాత్తుగా 61మంది సీనియర్‌ వైద్యుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. వారి మెడమీద కత్తి పెట్టి.. బదిలీ స్థానాల్లో చేరాల్సిందేనని ఒత్తిడి తెస్తోంది!

‘కోడ్‌’కు జెల్లకొట్టి..

  • 61 మంది సీనియర్‌ వైద్యుల ఆకస్మిక బదిలీ

  • ఈసీ అనుమతించడంపై విమర్శలు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): వైద్యులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.. ఆప్షన్లు అడగలేదు.. కానీ కోడ్‌ అమలులో ఉండగానే అకస్మాత్తుగా 61మంది సీనియర్‌ వైద్యుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. వారి మెడమీద కత్తి పెట్టి.. బదిలీ స్థానాల్లో చేరాల్సిందేనని ఒత్తిడి తెస్తోంది!

ముందస్తు కార్యాచరణ లేకుండా ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఏడాది కొత్త మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసేయడం, ఇంతవరకు వైద్యుల నియామకం చేపట్టకపోవడమే ఇందుకు కారణం.

వాస్తవానికి 17 మెడికల్‌ కాలేజీలూ 2021 నాటికి పూర్తి చేస్తామని జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రగల్భాలు పలికినా.. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. ఆరు నెలల క్రితం అతి కష్టం మీద 5కాలేజీల్లో ఆడ్మిషన్లు పూర్తి చేసినా.. నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో 5కాలేజీల్లో అడ్మిషన్లకు కసరత్తు చేస్తున్నారు.

పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ఆడ్మిషన్లకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఆయా కాలేజీల్లో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు. దీంతో 150 ఎంబీబీఎస్‌ సీట్లు కాస్త 100సీట్లకు ప్రభుత్వమే కుదించుకుని అడ్మిషన్లు చేసేద్దామని హడావుడి చేస్తోంది.

డీఎంఈ అధికారులు కూడా ముందూవెనుకా ఆలోచించకుండా ప్రభుత్వం చెప్పిందే గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. రెండోఫేజ్‌లో ఆడ్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్యుల నియామకానికి డీఎంఈ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

కానీ ప్రభుత్వంపై నమ్మకం లేక వైద్యులెవ్వరూ కొత్త కాలేజీల్లో చేరడానికి రాలేదు. వైద్యసిబ్బంది లేకపోతే అడ్మిషన్లు నిలిచిపోతాయి. కానీ అనుమతుల కోసం దరఖాస్తు చేయడంతో ఎన్‌ఎంసీకి తనిఖీలకు సిద్ధమైపోయింది. కొత్త నియామకాలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం.. పాత వారినే కొత్త కాలేజీలకు పంపించేద్దామంటూ వైద్యుల ఆకస్మిక బదిలీలలకు తెరతీసింది. బదిలీల్లో భాగంగా పాడేరు మెడికల్‌ కాలేజీకి విశాఖ ఆంధ్ర మెడికల్‌ కాలేజీ నుంచి, మదనపల్లెకి తిరుపతి నుంచి, మార్కాపురానికి విజయవాడ, గుంటూరు నుంచి, ఆదోనికి కర్నూలు మెడికల్‌ కాలేజీల సిబ్బందిని బదిలీ చేసేశారు.

ఒక ఉద్యోగిని ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేసే సమయంలో సదరు ఉద్యోగి నుంచి ఆప్షన్‌ తీసుకోవాలి. లేదంటే కనీస సమాచారం ఇవ్వాలి. డీఎంఈ అధికారులు కనీసం ఈ నిబంధనలు పాటించకుండా ఇలా అకస్మాత్తుగా 61 మంది సీనియర్‌ వైద్యులను కొత్త కాలేజీలకు బదిలీ చేసేశారు. ప్రొఫెసర్లు 12 మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 15, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 34 మందిని బదిలీ చేసేశారు.


పీక మీద కత్తిపెట్టి..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైద్యులతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటోంది. ఐదేళ్ల నుంచి ప్రభుత్వం చేసిన బదిలీల పుణ్యమా అని వైద్యులు కుటుంబాలను వదిలేసి నెలల తరబడి వివిధ జిల్లాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా బదిలీ చేసినవారిలో కొంత మందికి అనారోగ్య సమస్యలు, మరికొంత మందికి ఇతరత్రా అనేక సమస్యలున్నాయి.

వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఆకస్మిక బదిలీలు చేసేశారు. సోమవారం ఉదయం చాలామంది వైద్యులు డీఎంఈ కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలను విన్నవించారు. డీఎంఈ డాక్టర్‌ నరసింహం మాత్రం.. ఇదంతా తాత్కాలిక బదిలీలేనని, కొన్ని రోజుల తర్వాత వెనక్కి పంపించేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఆ విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనాలని వైద్యుల కోరగా సమాధానం లేదు. కాగా, ఫేజ్‌- 2 లో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లకు డీఎంఈ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల విషయానికి వచ్చే సరికి కేవలం నాలుగు కాలేజీలకు వైద్యులను బదిలీలు చేశారు.

పులివెందుల కాలేజీకి మాత్రం ఒక్కరిని కూడా బదిలీ చేయలేదు. పులివెందుల్లో కూడా వైద్య సిబ్బంది కొరత ఉంది. ఇప్పుడు కడప లేదా అనంతపురం నుంచి వైద్యులను పులివెందుల మెడికల్‌ కాలేజీకి బదిలీ చేస్తే ఎన్నికల సమయం కనుక ప్రభుత్వానికి నెగటివ్‌ అవుతుందని, ప్రత్యక్షంగా జగన్‌కు నష్టం వాటిల్లుతుందని.. ఆ కాలేజీకి కొత్త వారిని బదిలీ చేయలేదు. మిగిలిన నాలుగు కాలేజీలకు మాత్రం వైద్యులను బదిలీ చేసేశారు.

Updated Date - May 07 , 2024 | 05:47 AM