వైసీపీలో చిచ్చు
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:11 AM
తాడేపల్లిగూడెం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గం నేతలకు, పార్టీ శ్రేణులకు పొసగడం లేదు.
తాడేపల్లిగూడెంలో భగ్గుమన్న విభేదాలు
జగన్ వద్ద ఓ మహిళా ప్రజా ప్రతినిధి పంచాయితీ
తనకు జరిగిన అన్యాయంపై పార్టీ అధినేతకు ఏకరవు
మాజీ మంత్రి కొట్టుకు దూరమవుతున్న పార్టీ కేడర్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గం నేతలకు, పార్టీ శ్రేణులకు పొసగడం లేదు. వైసీపీ ఘోర ఓటమి తర్వాత కేడర్ చెల్లాచెదురైంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అది కూడా తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఆచంట వంటి నియోజక వర్గాల్లోనే సమీక్షించారు. వీటి తర్వాత పార్టీలో లుకలుక లు మొదలై శ్రేణులు వర్గాలుగా చీలిపోయారు. గడిచిన ఐదేళ్లలో పదవులను అనుభవించి, తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కార్యకర్తలు కారాలు మిరియాలు నూరారు. జిల్లా లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇటువంటి విభేదాలు బహిర్గతమవు తున్నాయి. వర్గపోరులో తాడేపల్లిగూడెం కాస్త ముందుంది. ఇటీవల మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, పది మంది నాయకులతో పోలీస్ ఐల్యాండ్ వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ పట్టణాధ్యక్షుడు గుండుగోగుల నాగు ఏఎంసీ లో వైఎస్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో విభే దాలతో కూడిన పోస్టింగులు ఊపందుకున్నాయి. ఆప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామనాయుడుతోపాటు మండల పరిషత్, జడ్పీటీసీ పదవులు అనుభవిస్తున్న వారు కొట్టుకు దూరంగా ఉంటున్నట్లు చర్చ జరుగుతోంది.
మహిళా ప్రజా ప్రతినిధికి ఎంత కష్టం
నియోజకవర్గంలోని ఒక మహిళా ప్రజా ప్రతినిధి జగన్ వద్దే నేరుగా పం చాయితీ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమెను బరిలో నిలపాలని నిర్ణ యించారు. రిజర్వేషన్‌ల ప్రక్రియ జాప్యంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత ఆమె భర్త, కుమారుడు చనిపోయారు. మరో బిడ్డ విదేశంలో ఉన్నారు. దీంతో సదరు నాయకురాలు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపలేదు. తొలుత ఎన్నికల వ్యయం కోసం రూ.35 లక్షలు ఇస్తామని మహిళ భర్త నియో జకవర్గ నాయకత్వానికి హామీ ఇచ్చారు. అటు భర్త, ఇటు కుమారుడిని కోల్పోవ డంతో ఆమె పోటీకి నిరాకరించారు. అయితే ఆ నేత ఒత్తిడితో బరిలో నిలిచారు. ఎన్నికల వ్యయం కోసం ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకున్నారు. మిగిలిన 15 లక్షలకు ఖాళీ చెక్కులు ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలలో నెగ్గారు. కానీ రూ.15 లక్షలు ఇవ్వలేనంటూ ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ వేడుకున్నారు. దీంతో ఆ నేత మిన్నకుండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫలితాలు తారుమారయ్యాయి. తాడేపల్లిగూడెంలో
వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఆ నాయకురాలి ఖాళీ చెక్కులు తెరపైకి తీశారు. పెంటపాడు మండల నాయకునితో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెక్కులు బౌన్స్ అయ్యాయి. మండల నాయకుని అనుకూలంగా తీర్పు వచ్చింది. మహిళా నాయకురాలు షాక్ తిన్నారు. మోసపోయానని గుర్తించారు. జగన్ వద్దకు వె ళ్లి బోరున విలపించారు. కుటుంబాన్ని కోల్పోయి బాధల్లో వున్న తనకు నియోజకవర్గ నాయకత్వం నుంచి ఎదురైన ఇబ్బందులను జగన్ వద్ద ఏకరవు పెట్టారు. ఈ వ్యవహారాన్ని విన్న జగన్ నిర్ఘాంతపోయారు. దీనిపై నియోజకవర్గ నాయకుడితో మాట్లాడినట్లు సమాచారం.
కూటమి నాయకుని చొరవెందుకో
వైసీపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధిని కూటమి నాయకులు ఫోన్‌లో సంప్రదించారు. వైసీపీ మండల నాయకునితోపాటు, ప్రజాప్రతినిధి వస్తే సమస్య పరిష్కరి స్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ ప్రజాప్రతినిధి కూటమి నాయకుని ప్రతిపాదనను దాటవేశారు. దీంతో వ్యవహా రం యధావిధిగానే ఉంది. ఇది నియోజకవర్గంలో ఇప్పుడు కాక పుట్టిస్తు న్నది. మహిళా ప్రజా ప్రతినిధికి ఇబ్బందులు గురిచేసిన నియోజకవర్గ నాయక త్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఎందరో నాయకులు బయటకు వస్తున్నారు. జువ్వలపాలెం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కష్టపడిన తర్వా తే పనిమీద వెళితే రూ.10 లక్షలు కమీషన్ తీసుకున్నారంటూ ఇప్పుడా నాయ కుడు మదనపడుతున్నాడు. పట్టణాధ్యక్షుడు సైతం దూరమయ్యారు. వైసీపీ సానుభూతిపరులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నియోజకవర్గ నాయకత్వానికి దూరంగా ఉంటున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి దగ్గరయ్యే విధంగా చూస్తున్నారు. ఎన్నికల ముందే వైసీపీకి చెందిన అనేక మంది మాజీ మంత్రి అనుచరులు టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
సమస్యలుంటే రండి.. యువనేత పోస్టు
నియోజకవర్గ నాయకత్వంపై కేడర్‌లో నమ్మకం సడలి మాజీ మంత్రి కొట్టు వద్దకు కాకుండా ఇతర నేతల వద్దకు వెళుతున్నారు. ఇది తెలిసిన యువనేత సమస్యలుంటే పరిష్కారం కోసం మాజీ మంత్రి వద్దకే రావాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయినా సరే కేడర్‌లో స్పందన లేదు. పార్టీ శ్రేణులు వేరేదారులు వెతుక్కుంటున్నాయి. తమ అనుచరులకు ఉద్యోగా లు పోతాయనుకుంటే కూటమిలోకి పంపుతున్నారు. ఉద్యోగాలను కాపాడుకుం టున్నారు. ఈ నేత వద్దకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. గత అయిదేళ్లలో నియోజకవర్గ నాయకత్వానికే అన్ని ప్రయోజనాలు సమకూరాయి. తమకు ఒరిగింది ఏమీ లేదని కస్సుబుస్సులాడుతున్నారు.