మేం ఉండలేం సారో..
ABN , Publish Date - Feb 11 , 2024 | 12:00 AM
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఆసరా నాలుగో విడత సభ నిర్వహించారు. ఈ సభకు ఏలూరు కార్పొరేషన్‌లోని అన్ని వార్డులతో పాటు డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చారు.
ఆసరా సభ నుంచి వెనుదిరిగిన మహిళలు
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 10 : ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఆసరా నాలుగో విడత సభ నిర్వహించారు. ఈ సభకు ఏలూరు కార్పొరేషన్‌లోని అన్ని వార్డులతో పాటు డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చారు. మహిళలను సభకు రప్పించేందుకు వెలుగు సిబ్బంది సంఘ సభ్యులపై ఒత్తిడి చేశారు. సభకు ఖచ్చితంగా రావాలని లేదంటే ఆసరా పథకం వర్తింప చేయబోమని, ఇతర పథకాలు నిలిపి వేస్తామని బెదిరించినట్టు విమర్శలు ఉన్నాయి. లబ్ధి పొందు తున్న మహిళలంతా తప్పనిసరిగా సభకు రావాలని చెప్పడంతో చాలా మంది సభకు అయిష్టంగానే హాజరయ్యారు. ఆటోల్లో సభకు బలవంతంగా తరలించారు. అయితే సభాస్థలిలో వీరికి తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. దీనికితోడు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి ఎండలో మహిళలు పడిగాపులు కాశారు. చివరకు సభ ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది. అప్పటికే నీరసించిన మహి ళలు ఓపిక నశించి మేం ఉండలేం.. అంటూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రసంగిస్తుండగానే సభ నుంచి బయటకు దారి తీశారు. ఒక్కసారిగా మహిళలు కుర్చీల నుంచి లేచి వెనుదిరుగుతుండడంతో మెప్మా సిబ్బంది, ఆర్పీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కంగారు పడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు ఆగకుండా వారిని తోచుకుంటూ బయటకు వచ్చేశారు. వైసీపీ నాయకులు ఆగండి.. ఆగండి అని కేకలు వేసినా ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వైసీపీ నాయకులు ముఖాలు వాడిపోయాయి. గేటు వద్ద పోలీసులు సైతం నిలువరించి లోపలకు వెళ్లాలంటూ అడ్డుకోబోయి విఫలమయ్యారు. తొలుత కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే ఆళ్ళనాని జ్యోతి వెలిగించి ప్రారం భించారు. రూ.27 కోట్ల చెక్కును మహిళలకు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో వివిధ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నాని ప్రారంభించారు. మేయర్ షేక్ నూర్జహాన్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఎన్.సుధీర్‌బాబు, శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యుడు ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ ఎన్.చిరంజీవులు, మెప్మా పీడీ ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.