భిన్నమైన ఎన్నికలు చూడబోతున్నాం..
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:26 AM
ఎన్నికల్లో అధికార పార్టీ అభివృద్ధిని చూపుతూ పోటీకి రావడం లేదని, దోచిన డబ్బుతో పోటీకి వస్తోందని, గత ఎన్నికల కన్నా భిన్నమైన ఎన్నికలను చూడబోతున్నామని ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో పార్థసారథి
కొత్తగూడెంలో మాగంటితో కలసి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
నూజివీడు, మార్చి 3: ఎన్నికల్లో అధికార పార్టీ అభివృద్ధిని చూపుతూ పోటీకి రావడం లేదని, దోచిన డబ్బుతో పోటీకి వస్తోందని, గత ఎన్నికల కన్నా భిన్నమైన ఎన్నికలను చూడబోతున్నామని ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం నూజివీడులో నిర్వ హించిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సంక్షేమం నేతిబీరలో నేతి చందంగా ఉందన్నారు. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెబుతున్న ్టప్రభుత్వం ఆ నిధితో రైతులకు ఏం మేలుచేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. నాసిర కపు లిక్కర్ విక్రయాల వల్ల వేలాదిమంది ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం తనకున్న ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో ఇక నుంచి గ్రూప్‌లకు తావులేదని అందరం ఒకే కుటుంబంలా సమష్టిగా శ్రమించి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు చెప్పిన విధంగా నడుస్తానన్నారు.
టిడ్కో ఇళ్లు ఆరు నెలల్లో ఇవ్వకుంటే నా ఇంటిపై రాళ్లేయండి..
నూజివీడులో 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ళను తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పూర్తిచేసి ప్రజలకు అందిస్తానని, అలా జరగకపోతే లబ్ధిదారులు తన ఇంటిపై రాళ్ళు రువ్వవచ్చని సారథి స్పష్టం చేశారు. స్థానికుడిని అని చెప్పుకుంటే సరిపోదని, పెనమలూరులోనూ తాను స్థానికుడిని కానని, అయినా అక్కడ ప్రజలు తన పనితీరును చూసి మూడుసార్లు తనను గెలిపించారన్నారు. ఇక్కడ శాసనసభ్యుడు రైతులకు ఆధారమైన చింతలపూడి విషయంలోనూ, టిడ్కో గృహాల విషయంలోనూ కనీసం మాట్లాడలేదని, తాను అధికారంలోకి వచ్చిన తరువాత చింతలపూడిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు టిడ్కో ఇళ్ళను ఆరునెలల్లో పూర్తిచేయడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారం పై దృష్టిపెడతానన్నారు. 2018లో నిధులు మంజూరైన వివిధ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని దీనిపై ఎందుకు నిలిచాయో ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమీషన్లు అడుగుతున్నారని విషయం బయటపడిందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కుమారుడిపై అనేక ఆరోపణలు విన్నానని, వాటిని తాను అరికడతానన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, నూజివీడు పట్టణ నాయకులు హాజరు అయ్యారు.
చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర మనుగడ..
చాట్రాయి: టీడీపీ, జనసేన కూటమిని గెలిపించుకొని చంద్రబాబును సీఎంను చేస్తేనే రాష్ట్రానికి మనుగడ ఉంటుందని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, నూజివీడు టీడీపీ అభ్యర్థి పార్థసారథి అన్నారు. కొత్తగూడెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి వారు ఆవిష్కరించి మాట్లాడుతూ ఐదేళ్ళుగా జగన్ విధ్వంసక, అరాచక పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, వైసీపీ బూటకపు వాగ్దానలకు మళ్ళీ మోసపోతే భావితరాలకు మనుగడ ఉండదన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అడ్డదారుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నదని టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీ కుట్రలు తిప్పికొట్టాలన్నారు. అంతకు ముందు సోమవరం గ్రామం వద్ద మాగంటి, పార్థసారథికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడే దివంగత టీడీపీ నాయకులు యర్రోజు సత్యనారాయణ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం సోమవరం నుంచి కొత్తగూడెం వరకు బారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు గంగాధర్, అట్లూరి రమేష్, నూతక్కి వేణు, మండల నాయకులు బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి చిట్టిబాబు, వెల్ది నాగేశ్వరరావు, రాజారత్నం, శేఖర్, దుర్గారావు, వెల్ది రాజారావు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.