Share News

బీసీలమని అణగదొక్కినా ప్రజల వెంటే ఉంటాం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:51 AM

వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కి అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసినా జైలు నుంచి తిరిగివచ్చి తాము ప్రజల్లోకే వెళతామని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

బీసీలమని అణగదొక్కినా ప్రజల వెంటే ఉంటాం
ఐక్యత చాటుతున్న మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాగంటి బాబు తదితరులు

అటపాకలో జయహో బీసీ

బీసీలంతా వైసీపీని సాగనంపాలని నాయకుల పిలుపు

కైకలూరు, జనవరి 31: వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కి అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసినా జైలు నుంచి తిరిగివచ్చి తాము ప్రజల్లోకే వెళతామని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం అటపాకలో జయహో బీసీ సభను జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. వందలాది బైకులతో కొల్లు రవీంద్రను ర్యాలీగా సభా ప్రాంగణానికి పూలవర్షం కురిపిస్తూ తీసుకువచ్చారు. సభలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బీసీలకు పెద్దపీట వేశారని, వైసీపీ ప్రభుత్వం బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటూ నాలుగున్నరేళ్లుగా అణగదొక్కిందని, దీనిని బీసీలంతా గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా బీసీలుంటున్నారని కక్షగట్టి పార్టీలో ప్రధాన నాయకులుగా ఉన్న అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడుతో పాటు తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. తాము జైలుకు పోయినా మరలా ప్రజల్లోనే ఉంటామని ముఖ్యమంత్రికి పదవి పోతే పూర్తిగా జైలు జీవితమే మిగులుతుందన్నారు. అనేక కుట్రలు, కుతంత్రాలతో మరలా అధికారంలోకి రావాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని బీసీలు అప్రమత్తతో ఉండి అఽధికారపార్టీ ఎత్తుగడలను ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. ఇటీవల ఓ మత్స్యకారుడ్ని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్నాడని అక్రమ కేసు పెట్టి అతడే ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేశారన్నారు. రానున్న రోజుల్లో కొల్లేరు సమస్యను పరిష్కారానికై చిత్తశుద్ధితో పనిచేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీమంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రౌడీలను ప్రోత్సహించి బీసీ నాయకులపై దాడులు చేయించారన్నారు. ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండి టీడీపీ–జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలన్నారు. ఈ నెల 5న చింతలపూడిలో ‘రా కదలిరా’ కార్యక్రమాన్ని పార్లమెంటు స్థాయిలో నిర్వహిస్తున్నామని కైకలూరు నియోజక వర్గం నుంచి ప్రజలు పెద్దఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి వీరంకి గురుమూర్తి, మాజీ ఎమ్మె ల్సీ కమ్మిలి విఠల రావు, బీసీ నాయకులు బీకేఎం నాని, బలే ఏసురాజు, పూల రామచంద్రరావు, రెడ్డి శ్రీనివాస చక్రవర్తి, అండ్రాజు శ్రీనివాసరావు, వీరమల్లు శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ నాయకులు తేరా రమేష్‌, టీడీపీ నాయకులు కొత్త నాగేంద్రబాబు, కొడాలి వినోద్‌, పెన్మెత్స వెంకటేశ్వరరాజు, నాలుగు మండల పార్టీల అధ్యక్షులు, బీసీ నాయకులు పరసా విశ్వేశ్వరరావు, బీసీ మహిళా నాయకురాలు గంగుల శ్రీదేవి, గంగుల వెంకట నరసమ్మ, తెంటు వెంకటరమణ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:51 AM