Share News

సంఘాలతో సాగుదాం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:13 AM

సాగు రైతులకు చేయూతనందించేం దుకు నీటి సంఘాలను వైసీపీ ప్రభుత్వం కనుమరుగు చేసింది. దిగువ స్థాయిలో సాగు ఇబ్బందులు చెప్పుకునేందుకు నీటి సంఘాలు లేక అవి పరిష్కారం కాక రైతు లు అవస్థలకు గురయ్యారు.

సంఘాలతో సాగుదాం

నీటి సంఘాలతో సాగు కష్టాలకు చెక్‌

రైతుల సమస్యలు.. రైతులే పరిష్కరించుకునేలా..

గత చంద్రబాబు పాలనో ఏడాదికి రూ.20 కోట్లతో పనులు

తర్వాత వైసీపీ పాలనలో అన్నీ గడ్డు రోజులే

కూటమి ప్రభుత్వం రాకతో సంఘాల ఏర్పాటుపై రైతులు ఆనందం

భీమవరం రూరల్‌, అక్టోబరు 23(ఆంధ్ర జ్యోతి):సాగు రైతులకు చేయూతనందించేం దుకు నీటి సంఘాలను వైసీపీ ప్రభుత్వం కనుమరుగు చేసింది. దిగువ స్థాయిలో సాగు ఇబ్బందులు చెప్పుకునేందుకు నీటి సంఘాలు లేక అవి పరిష్కారం కాక రైతు లు అవస్థలకు గురయ్యారు. పర్యవసానంగా పంట పంటకు సాగు భూమి తగ్గుతూ వచ్చింది. కౌలు రైతులు సాగు వైపు చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ హయాంలో జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల సాగు నుంచి రెండు లక్షల 20 వేల కు, ఈ ఏడాది సార్వాలో లక్ష 95 వేల ఎకరాలకు పడిపోయింది. కాలువల అభివృద్ధి చేయక సాగునీటి ఇబ్బందులు, మురుగునీటి సమస్యలు తలెత్తడం రైతులకు సాగు భయంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 62 కాలువలను అభివృద్ధి చేసేందుకు రూ.9 కోట్లతో పనులు చేపట్టింది. కొంతవరకు సాగును గట్టెక్కించినా ఐదేళ్లుగా కాలువల అభివృద్ధిలో నిర్లక్ష్యం, రైతు సంఘా లు లేని లోటు ఇప్పటికి రైతులను సాగులో వెంటాడుతూనే ఉంది.

నీటి సంఘాల పనితీరు ఇలా

నీటి సంఘాల ఏర్పాటుకు ఇటీవల నోటిఫి కేషన్‌ విడుదల చేసింది. నీటి సంఘాలలో ప్రాజెక్టు కమిటీ, నీటి పంపిణీ సంఘాలు, నీటి సంఘాలుగా ఏర్పడతాయి. ఈ సంఘాలలోని సభ్యులు సాగు జరుగుతున్న ప్రాం తాల్లోని రైతులే. వారికి సంబంధించిన ప్రాం తాలలో సాగు సమస్యలను అక్కడి రైతులు తోటి రైతుగా సంఘ సభ్యులకు సమాచారాన్ని ఇస్తారు. దీనివల్ల నీటి సంఘం తరపున సమస్యను ప్రభుత్వ అధికారులకు చేరవేయడం, దాన్ని పరిష్కరించే చర్యలు చేపడుతూ వస్తారు. నీటి సంఘాల ద్వారా వైసీ పీకంటే ముందు ప్రభుత్వాలు కోట్ల రూపాయలతో కాలువల అభివృద్ధి, చెత్త, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయించేవారు. కెమికల్‌ పిచికారీలు, సిల్టు తొలగింపుల్లో నీటి సంఘాలు బాధ్యతగా వ్యవహరించేవి. గత టీడీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.20 కోట్ల చొప్పున నీటి సంఘాల ఆధ్వర్యంలో సాగుకు సహకరించేలా కాలువల అభివృద్ధి, గేట్లు ఏర్పాటు, అవసరమైన తూరల ఏర్పాటు, చెత్త తొలగింపు వంటి పనులు చేపట్టారు.

నీటి ఎద్దడి సమయంలో..

దాళ్వా పంటకు వచ్చేసరికి ప్రతీ ఏడాది పదేళ్ళుగా నీటి వంతులవారీ విధానం ఆనవాయితీగా మారింది. దీంతో ఈ వంతుల వారీ విధానంలో నీటి సంఘాలు ప్రధానపాత్ర పోషిస్తూ వచ్చాయి. ఎందుకంటే సంఘాలలోని సభ్యులు రైతులు కావడం ఆ ప్రాంతా ల్లోని కాలువలు ఏ విధంగా సరఫరా చేస్తాయన్నది అవగాహన ఉంటుంది. దీంతో దాళ్వా సాగు నారుమడుల దశలలోనే ఇరిగేషన్‌, అగ్రికల్చర్‌, సంబంధింత అధికారులతో నీటి సంఘాలు జిల్లా సమావేశాలు నిర్వహించేవారు. ఏ ఆయకట్టుకు ఎంత నీరు వదలాలి, ఏ ప్రాంతంలో ముందు సాగు, వెనుక సాగు వివరాలను తెలిపి వంతుల వారీ విధానంలో ప్రణాళిక తీసుకొచ్చేవారు. కాలువలు పొంగినా, గట్లకు గండ్లు పడినా నీటి సంఘాలే అప్రమత్తం చేసేవి.

సంఘాలు.. విధులు

నీటి సంఘం ఒక గ్రామం ఆయకట్టును బట్టి రెండు, మూడు గ్రామాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడుతుంది. ఇలా జిల్లాలో 112 నీటి సంఘాలు ఉంటాయి. వీటి పరిధిలోని రైతులంతా ఆయా సంఘాలకు అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, సభ్యులను ఎన్నుకుంటారు.

నీటి సంఘాల కార్యవర్గాలన్నీ నీటి పంపిణీ కమిటీ చైౖర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యులను ఎన్నుకుంటారు.

నీటి పంపిణీ కమిటీ కార్యవర్గాలు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ను, వైస్‌ చైర్మన్‌ ఎన్నుకుంటారు.

సాగునీటి సంఘాలన్నీ తమ పరిధిలోని సాగు నీరు, మురుగు నీటి కాల్వల సమస్యలను గుర్తించి.. నీటి పంపిణీ కమిటీలకు సమాచారాన్ని ఇస్తుంది. తమ పరిధిలోని సంఘాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంపిణీ కమిటీలు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరిస్తారు.

రైతు సమస్యలకు చెక్‌

రైతులకు నీటి సంఘాలు ఎంతో అవ సరం. వీటి ద్వారా టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో రూ.60 కోట్లతో కాలువలు, ఇతర పనుల అభివృద్ధికి ఉపయోగించేవారు. రైతుల సమస్యలపై సంఘాలకు పూర్తి అవగాహన ఉంటుంది. వీటిని అధికారుల దృష్టికి తీసుకుని వెళతారు. సాగు నీటి సమస్య, మురుగు నీటి సమస్యలను పరిష్కరించుకుంటారు. వైసీపీ హయాంలో అలాంటి సంఘాలు లేకపోవడంతో సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ సంఘాల ఏర్పాటుతో రైతుల సమస్యలకు చెక్‌ పడినట్లే.

– పొత్తూరి రామరాజు, ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్‌

సంఘాల్లేక అస్తవ్యస్తం

రైతులే నీటి సం ఘంలో ఉంటారు కనుక సాగులో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. అలాంటి సంఘాలను వైసీపీ ప్రభుత్వం తీసేసింది. దీనివల్ల ఈ రోజు ప్రధాన రహదారుల పక్కనే వున్న పొలాలు బీడువారాయి. ఎకరానికి 50 బస్తాలు పండే భూములకు కాల్వలు సరిలేక రైతులు సాగును వదిలేయడంతో సాగు అస్తవ్యస్తమైంది.

కోళ్ళ సీతారామయ్య, చిన అమిరం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు

Updated Date - Oct 25 , 2024 | 12:17 AM