Share News

చేలు బీళ్లు..రైతు కన్నీళ్లు..

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:08 AM

పొలాలకు సాగునీరు అందక రైతులకు కంటి మీద కునుకు కరువైంది. కాలువ ఎప్పుడు వస్తుందా.. పంట పొలాలకు నీరు పెట్టుకుందామా అని రేయింబవళ్లు పంట పొలాల చుట్టూ తిరుగుతున్నారు.

చేలు బీళ్లు..రైతు కన్నీళ్లు..
మోగల్లులో నెర్రలు తీసిన పొలం

శివారుకు చేరని వంతుల వారీ నీరు

నీరందక నెర్రలు తీస్తున్న వరిచేలు

పాలకోడేరు, మార్చి 21 : పొలాలకు సాగునీరు అందక రైతులకు కంటి మీద కునుకు కరువైంది. కాలువ ఎప్పుడు వస్తుందా.. పంట పొలాలకు నీరు పెట్టుకుందామా అని రేయింబవళ్లు పంట పొలాల చుట్టూ తిరుగుతున్నారు. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీరందక నెర్రలు తీస్తున్నాయి..మోగల్లులో గుత్తులవారి పాలెంకు వెళ్ళే ఊరకోడు దొడ్డితో పాటు వేండ్ర రహదారిలో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. పొట్ట దశలో ఉన్న తరుణంలో సాగునీరు లేక పంట పొలాలన్నీ నెర్రలు తీసి ఉన్నాయి. ఇంజన్ల సహాయంతో, కారెంలతో నీటిని తోడుకుంటున్నారు. ఇప్పటికే ఎకరానికి పాతిక వేలు పెట్టామని ఇప్పుడు నీరు కోసం ఎకరానికి వచ్చి ఐదారు వేల రూపాయిలు ఖర్చు పెడుతున్నామని ఆ ప్రాంత రైతులైన సైదు నారాయణ, గుత్తుల శ్రీనివాసరావు, గుత్తుల పెంటయ్య, రాయపూడి గంగాధర్‌, మందులు వాపోతున్నారు. సాగునీరు లేకపోవడంతో ఓవైపు ఎలుకల దాడి, మరోవైపు దోమ పోటుతో మరింత ఇబ్బందిగా మారిందని ఆ ప్రాంత రైతులు అంటున్నారు.

ఇంజన్ల సాయంతో నీరు

ఆచంట : వంతులవారీ విధానంతో సాగునీటి కష్టాలు మరింత పెరిగాయి. మండలంలో శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో పంట బోదెల్లో ఉన్న నీటిని ఇంజన్ల సాయంతో చేలకు పెడుతున్నారు. ప్రస్తుతం పంట పొలాలు పొట్ట దశలో ఉన్న కారణంగా ఇపుడే నీటి అవసరం ఎక్కువని అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

చేలు ఎండిపోతున్నాయి

వీరవాసరం :పొట్టదశకు వస్తున్న వరిచేలకు సాగునీరు అందక ఎండిపోయిన స్థితికి చేరుతున్నాయి. క్రమం తప్పకుండా ఇవ్వవలసిన వంతు ఇవ్వకపోవటం వలన పీర్లకోడు కాలువ ఆయుకట్టు భూముకు నీరు అందడం లేదు. వీరవాసరం–మత్స్యపురి రహదారికి అటూ ఇటూ వీరవాసరం పరిధిలో సుమారు 100 ఎకరాలకు పీర్లకోడు ద్వారా సాగునీరు అందుతుంది. మూడునెలల్లో మూడు సార్లు కూడా ఈ ఆయుకట్టు భూములకు వంతుల్లో నీరు అందలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్ప టికే మూడు కోటాల మందు వేశామని దాని ఫలితం కూడా పంటపై కనపడటం లేదని అంటున్నారు చేలల్లో నీరు లేకపోవడంతో కలుపు విపరీతంగా పెరుగుతుంది. ఈ కలుపు తొలగించటానికి రైతులు ఎకరాకు మూడువేల వరకూ అదనంగా పెట్టుబడి పెట్టారు. పంటబోదుల్లో వచ్చే నీటిని ఇంజన్ల ద్వారా , కారెంల ద్వారా తోడుతున్నారు. అరకొరగా నీటితో చేలను కాపాడుతున్నారు. నెలలో ప్రతి పదిరోజులకు వంతు వచ్చేదని, జనవరి నెల నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు మాత్రమే వంతు వచ్చిందన్నారు. నీరు ఇప్పించాలని బుధవారం పీర్లకోడు పంటకాలువకు చెందిన పలువురు రైతులు జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Mar 22 , 2024 | 12:08 AM