Share News

ధాన్యం సొమ్ము కోసం.. 30 నెలలుగా ఎదురుచూపు

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:53 AM

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం అమ్మి 30 నెలలు కావస్తున్నా నేటికీ ఓ కౌలు రైతు పూర్తి సొమ్మును అందుకోని వైనమిది.

 ధాన్యం సొమ్ము కోసం.. 30 నెలలుగా ఎదురుచూపు
ధాన్యం అమ్మిన పత్రాలను చూపుతున్న కౌలు రైతు శ్రీనివాసరావు

మిల్లరు ఇవ్వాలంటున్న సొసైటీ కార్యదర్శి

ముదినేపల్లి, జూలై 30 : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం అమ్మి 30 నెలలు కావస్తున్నా నేటికీ ఓ కౌలు రైతు పూర్తి సొమ్మును అందుకోని వైనమిది. భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేందుకు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా కుంగిపోయాడు ఆ కౌలు రైతు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన ఈదర జనార్దనరావు నాలుగెకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కోడూరు శ్రీనివాసరావు కొన్నేళ్లుగా కౌలుకు చేస్తున్నాడు. 2022 ఖరీఫ్‌ సీజన్‌లో ఫిబ్రవరి 15న ఆ కౌలు రైతు పెదపాలపర్రు పీఏసీఎస్‌ ద్వారా 40 కేజీల సామర్థ్యం కలిగిన 258 బస్తాల ధాన్యాన్ని రైతు జనార్దనరావు పేరున అమ్మాడు. అందులో 174 బస్తాలకే సొమ్ము బ్యాంకులో జమ అయింది. మిగిలిన 84 బస్తాల ధాన్యానికి జమ కాలేదు. ఈ విషయమై పీఏసీఎస్‌ కార్యదర్శిని కౌలు రైతు సంప్రదించగా, రైసు మిల్లు నుంచి బకాయిలు రావాల్సి ఉందని చెప్పటం, కొంతకాలం వేచి చూస్తుండటంతో 30 నెలలు గడిచిపోయింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన మిల్లరు పెదపాలపర్రు మిల్లును మూసేసి వెళ్లిపోవటం, సొమ్ము చెల్లించకపోవటంపై తనకు సొమ్ము అందుతుందా లేదా అన్న భయంతో ధాన్యం సొమ్ము చెల్లింపులో అవకతవకలు జరిగాయని, విచారణ జరపాలని కౌలు రైతు శ్రీనివాసరావు సహకార శాఖ ఏలూరు డీఆర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. శాఖాపరంగా ఎలాంటి కదలిక రాకపోవటంతో కౌలు రైతు మరింత ఆందోళనకు గురవుతున్నాడు. సుమారు రూ.63 వేలు పెండింగ్‌లో ఉండటంతో పెట్టుబడికి అప్పట్లో తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నాడు.

మిల్లరు చెల్లించాలి

రైతు ఈదర జనార్దనరావు పేరిట కౌలు రైతు శ్రీనివాసరావు అమ్మిన ధాన్యానికి సొమ్ము రావాల్సి ఉంది. సుమారు 33 క్వింటాళ్ల ధాన్యం సొమ్ము మిల్లర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. మిల్లరు అందుబాటులో లేరు. సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.

–నాగమల్లీశ్వరి, కార్యదర్శి, పెదపాలపర్రు, పీఏసీఎస్‌

ఆమరణ దీక్ష చేస్తా..

తన సమస్యను త్వరలో అధికారులు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కౌలు రైతు గుమ్మడి శ్రీనివాసరావు హెచ్చరించారు. పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాను. సంఘ కార్యదర్శిని అడిగితే రైసు మిల్లు నుంచి సొమ్ము రావాలి అని చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా పరిష్కరించి సొమ్ము ఇప్పించాలని వేడుకుంటున్నాడు.

Updated Date - Jul 31 , 2024 | 12:53 AM