పంపిణీ జాతర
ABN , Publish Date - May 12 , 2024 | 12:39 AM
ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఏ రోజు కోసమైతే ప్రజలంతా ఎదురుచూస్తున్నారో ఆ సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది.

ఓటుకు రూ.1000 నుంచి రూ.2,500
భీమవరం, ఉండి, పాలకొల్లులో పోటాపోటీ
మిగిలిన చోట్ల సమానం..
కొన్ని వర్గాలను మినహాయిస్తున్న వైసీపీ
ఇదేం తీరంటూ పార్టీ శ్రేణుల్లో అసహనం
భారీగా ఇస్తారని మొదట ప్రచారం
తర్వాత తగ్గించడంపై పెదవి విరుపు
ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఏ రోజు కోసమైతే ప్రజలంతా ఎదురుచూస్తున్నారో ఆ సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. గెలుపు కోసం ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థులు చివరి అంకంలో ఓటర్లకు కోట్లాది రూపాయల నజరానాలు పంపిణీ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను డబ్బుతోనే తిప్పికొట్టాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అత్యధికంగా ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నారు. మూడు రోజుల ముందుగానే ఓటర్లకు కానుకలు ముట్టజెప్పే ప్రక్రియను ప్రారంభించారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తాయిలాల విషయంలో పోటీ పడుతున్నాయి. స్థానికంగా ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి వైసీపీ పెద్ద మొత్తంలో ఓటర్లకు సొమ్ములు అందజేస్తోంది. జిల్లాలో అత్యధికంగా భీమవరం, తాడేపల్లిగూడెంలలోనే అభ్యర్థులు అధిక సొమ్ములు ముట్టచెబుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
హోరాహోరీగా పంపకాలు
తాడేపల్లిగూడెంలో అధికార పార్టీ ఒక్కో ఓటరుకు రూ.2,500 పంపిణీ చేస్తోంది. ఇటీవల వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అనుచరవర్గం రూ.3 వేలు ఇవ్వాలని పట్టుబట్టింది. ప్రభుత్వంపైన, అభ్యర్థిపై వున్న వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడాలంటే ఈ మాత్రం ఇవ్వాల్సిందేని భావించారు. అధిష్ఠానం వద్ద ఈ మేరకు అంగీకరించి టిక్కెట్ తెచ్చుకుని, ఇప్పుడు తగ్గిస్తే ముందుగానే చేతులెత్తిసినట్టు అవుతుందని చెబుతున్నారు. దీంతో ప్రతి ఓటరుకు రూ.2,500 పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన ఓటర్లు కొందరిని పక్కన పెడుతున్నారు. మరోవైపు రూ.1,500 వరకు ఇచ్చేందుకు కూటమి అభ్యర్థి నిర్ణయించారు. ఈ మేరకు ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో 80 శాతం, పట్టణాల్లో 70 శాతం మేర ఓటర్లకు తాయిలాలు అందిస్తున్నారు. భీమవరంలో పంపకాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారు.అధికార పార్టీ ఇప్పటికే మహిళా ఓటర్లను ఆక ట్టుకునేందుకు తొలివిడత వెయ్యి వంతున పంపిణీ పూర్తి చేసింది. సంఘాల ప్రతినిధులకు, సంఘాలను పర్యవేక్షించే మహిళలు భారీగా నజరానాలు ముట్టజెప్పారు. పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే గృహ సారఽథులకు, రాజీనామా చేసిన వలంటీర్లకు కనిష్టంగా రూ.20 వేలు చేతికిచ్చారు. డ్వాక్రా మహిళలతోపాటు అందరికీ ఇప్పుడు రూ.2 వేలు వంతున ఇస్తోంది. దీనికి దీటుగానే కూటమి కూడా పంపకానికి సన్నద్ధమవుతోంది. భీమవరంలో ఇప్పటివరకు పంపకాల విషయంలో ప్రధాన పార్టీల మధ్య సయోధ్య ఉండేది. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకరికి మించి ఒకరు అనే పోటీ నెలకొంది. ఉద్యోగుల బ్యాలెట్ ఓట్ల విషయంలోనూ అదే జరిగింది. కూటమే పైచేయిగా నిలిచింది. ఉద్యోగుల ఓట్లన్నీ దాదాపు కూటమికి ఏకపక్షమయ్యాయి. ఇప్పుడు కూటమి తరపున ప్రతి ఓటరుకు రూ.2 వేలు పంపణీ చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఓటర్లు సంఖ్య తక్కువగా ఉంది. అక్కడ తాయిలాలు తక్కువగా అందనున్నాయి. వైసీపీ రూ.1,500 ఇస్తోంది కూటమి జనసేన అభ్యర్థి రూ.1,000 పంపిణీ చేస్తున్నారు. ఉండిలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీతోపాటు తెలుగుదేశం కూటమి పోటాపోటీగా పంపిణీకి సిద్ధమవుతోంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2 వేలు వంతున అందజేశారు. ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రూ.1,000 ఇచ్చారు. ఓటర్లకు అదే స్థాయిలో పంపిణీ చేస్తున్నారు. వైసీపీ రూ.2 వేలు ఇస్తోంది. కూటమి తరపున తెలుగుదేశం రూ.2 వేలు అందజేస్తోంది. ఇండియన్ ఫ్వార్డర్ బ్లాక్ అభ్యర్థి రూ.1,000 అందజేస్తున్నారు. ఆచంటలో ఓటర్లకు ఇచ్చే తాయిలాల విషయంలో పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలు పంపిణీ ప్రారంభించాయి. వైసీపీ నుంచి రూ.2 వేలు ఇస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద మొత్తంలోనే పంపిణీ ఉంటుందని అంతా ఆశించారు. అక్కడ రూ.2 వేలకే పరిమితమయ్యారు. తెలుగుదేశం కూటమి నుంచి రూ.1,000 ఇస్తున్నారు. మూడు రోజుల ముందుగానే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తణుకులోనూ నజరానాల విషయంలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఇప్పటికే ఓటర్లకు రూ.2 వేలు పంపిణీ చేస్తోంది. కొన్ని వర్గాలకు మాత్రమే పూర్తిస్థాయిలో ఇస్తున్నారు. జనసేన, టీడీపీ ఓటు బ్యాంకును మినహాయిస్తున్నారు. తణుకులో కూటమి అభ్యర్థి ఓటుకు రూ.1,500 ముట్టచెబుతున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ పంపిణీలు కొలిక్కి వచ్చాయి.
పాలకొల్లులో కొందరికి మినహాయింపు
పాలకొల్లు : నియోజకవర్గంలో వైసీపీ నాలుగు రోజులుగా పంపిణీ ప్రారంభించింది. వైసీపీ అభ్యర్థి ఓటుకు రూ.3,000 ఇస్తారని నెల రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఓటుకు రూ.1,500 మాత్రమే పంపిణీ చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లోని కమ్మ, క్షత్రియ, కాపు సామాజిక వర్గాల్లోని ఓటర్లకు సొమ్ములు పంపిణీ నిలిపి వేయాలని వైసీపీ కార్యకర్తలకు ఫోన్లు వెళ్లాయి. దీనిపై వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ విధంగా చేస్తే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ తొలుత ఓటుకు రూ.1,000 ఇస్తారని ప్రచారం జరగ్గా, ఇప్పుడు రూ.1,500 ఇస్తున్నారు. సుమారు 90 శాతం మంది ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.
తమ వారికే తాయిలాలు
తాయిలాల పంపిణీలో వైసీపీ ఓ వ్యూహంతో వెళుతోంది. నియోజకవర్గాల్లో తమకు అనుకూరులు ఎవరో.. కాని వారు ఎందరో లెక్కలు వేసుకుని జాబితాలు సిద్ధం చేసింది. గృహ సారథులు, వలంటీర్ల ద్వారా వివరాలు సేకరించింది. దాని ఆధారంగానే పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. కూటమికంటే అధికంగా ఇవ్వడానికి వెసులుబాటు కావాలంటే టీడీపీ, జనసేన ఓటు బ్యాంకును మినహాయించాలనే ఆలోచన చేసింది. మరోవైపు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడానికి తాయిలాలే ఆయుధంగా కనిపిస్తోంది.
ఊహించింది ఎంతో..
వైసీపీ ఈసారి పెద్ద మొత్తంలో నజరానాలు ఇస్తారని ఆశించారు. కేడర్‌కే కోట్లు ఖర్చు పెట్టారు. అధిష్ఠానం ప్రతి నియోజక వర్గానికి పెద్ద మొత్తంలో చేరవేసింది. దీనికి కలుపుకుని అభ్యర్థులు ఎంత ఇవ్వాలనేది ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతున్నాయి. అధిష్ఠానం సొమ్ములు ఇచ్చే విషయంలో వెనకడుగు వేసింది. ముందుగా అనుకున్న దానికంటే దాదాపు సగానికి తగ్గించేసింది. దీంతో వైసీపీ అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు తగ్గిపోతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకున్న కొందరు ఉద్దేశ పూర్వకంగానే తాయిలాలను కుదించారు. జనం మాత్రం వైసీపీ ఎంతో ఇస్తుందని ఊహించారు. తాడేపల్లిగూడెంలో జనసేన ఓటు బ్యాంకును మినహాయిస్తున్నారు. పాలకొల్లులోనూ అదే పరిస్థితి. అక్కడ కూటమికి పక్కా ఓటు బ్యాంకు అనే సామాజిక వర్గాలను మినహాయించి పంపిణీలు చేస్తున్నారు.
ముగిసిన ప్రచారం
మూగబోయిన మైకులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి) :
ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దాదాపు 45 రోజులపాటు ఊరూ వాడా, పల్లె, పట్టణాల్లో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించారు. ఆటోలలో రికార్డులు పెట్టి హోరెత్తించారు. సినీ నటులు ప్రచారాల్లో సందడి చేశారు. అభ్యర్థులు, కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటా తిరిగారు. ఓటర్లను కలుసుకున్నారు. ఈ సారి సుదీర్ఘ వ్యవధి ఉండడంలో ప్రచారాలతో ఎన్నికలు సందడిగా మారాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలు సంధించుకున్నారు. రాష్ట్ర నేతలు ప్రచారాలకు విచ్చేశారు. గబ్బర్‌సింగ్ టీమ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో పర్యటించారు. సుడిగాలి సుధీర్, పృథ్వీరాజ్, ఆటో రాంప్రసాద్ పర్యటించి సందడి చేశారు. కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఆటో చక్రాలు నిలిచిపోయాయి. మైకులు మూగబోయాయి. అభ్యర్థులు ఇళ్లకు చేరుకున్నారు. తాయిలాల పంపిణీలో నిమగ్నమయ్యారు. జనమంతా పోలింగ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఇతర రాష్ర్లాల నుంచి స్వచ్ఛందంగా ఓటర్లు తరలి వస్తున్నారు. కొందరు అభ్యర్థుల రవాణా సౌకర్యం కల్పించారు.