ముసుగు తొలగింది
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:35 AM
ఎన్నికల సమయంలో పార్టీకి ఉపయోగపడేలా వలంటీర్లను వినియోగించే ప్రణాళిక చేశారు. వలంటీర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

పార్టీ వ్యతిరేక ఓటర్లను గుర్తించాలని
సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ దిశా నిర్దేశం
అలాంటి వారి ఇళ్లకు వెళ్లి వైసీపీకి మద్దతు కోరాలి : గ్రామాల వారీగా సమీక్ష
ఇదేం పని అంటూ అవాక్కవుతున్న ప్రజలు.. ప్రతిపక్ష పార్టీలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ : మన పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవారు ఎవరైనా ఉన్నారా?
వలంటీర్: చాలామంది ఉన్నారు.
కో–ఆర్డినేటర్: మీ క్లస్టర్‌లో ఎంతమందిని గుర్తించారు.
వలంటీర్: కొన్ని కుటుంబాలు వ్యతిరేకిస్తున్నారు.
కో–ఆర్డినేటర్: వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ?
వలంటీర్: కొందరికి అందుతున్నాయి.
కో–ఆర్డినేటర్: వారిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మలచండి. ఇంటింటికి వెళ్లండి. ప్రభుత్వ పథకాలు పాందుతున్న వారు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేయమని చెప్పండి.
వలంటీర్: అలాగే మేడమ్.. తమ మాట వింటారంటే చెపుతాం..
– ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ నియోజక వర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కో–ఆర్డినేటర్, వలంటీర్‌కు మధ్య జరిగిన సంభాషణ. జిల్లాలో సోషల్ మీడియా కో–ఆర్డినేటర్‌లు చురుగ్గా ఉన్న చోట ఇటు వంటి దందా సాగుతోంది. వలంటీర్ల ద్వారా అధికార పార్టీకి ప్రచారం చేసేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే పార్టీ సమావేశంలో వలంటీర్లు తమ పార్టీ కార్య కర్తలంటూ సంభోదించారు. అందుకు తగ్గట్టుగానే కొందరు సోషల్ మీడియా కో–ఆర్డినేటర్‌లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలంటీర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకుం టున్నారు.
ఆచంట నియోజకవర్గంలో ఓ సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ పంచాయతీల వారీగా వలంటీర్లను సమావేశపరుస్తున్నట్టు తెలు గుదేశం గుర్తించింది. కొన్ని పంచాయతీల్లో ఇటువంటి సమా వేశాలు నిర్వహించారు. వలంటీర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో ఇదే తరహాలో వలంటీర్లను వినియోగించేలా పావులు కదుపుతున్నారు. తమకు అనుకూలంగా లేని వలంటీర్లను తొలగిస్తున్నారు. ఒకే పంచాయతీలో ఏకకాలంలో ఇటీవల 20 మంది వలంటీర్లను తొలగించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే వలంటీర్లను తొలగించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించలేదన్న ఉద్దేశంతో వలంటీర్లపై వేటుపడింది. ఇప్పుడదే నియోజకవర్గంలో వలంటీర్లను విరివిగా వినియోగిం చుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. సోషల్ మీడియా కో–ఆర్డినేట ర్‌లు, నాయకులను రంగంలోకి దింపుతున్నారు.
దెందులూరు సభకు రావాలంటూ ఒత్తిడి
ఇటీవల దెందులూరులో సిద్ధం సభను నిర్వహించారు. ఆ సమావేశానికి జిల్లాలోని వలంటీర్లంతా హాజరుకావాలని ఒత్తిడి చేశారు. అధికారుల నుంచి వర్తమానం పంపారు. దాంతో జిల్లా నుంచి అత్యధికమంది వలంటీర్లు సభకు హాజరయ్యారు. ఇలా ప్రభుత్వం వేతనం చెల్లిస్తూ ఎన్నికల సమయంలో పార్టీకి ఉపయోగపడేలా వలంటీర్లను వినియోగించే ప్రణాళిక చేశారు. దెందులూరు సభకు వలంటీర్ హాజరుకానట్టయితే ఇద్దరిని పంపాలంటూ ఆదేశాలు జారీచేశారు. అప్పటినుంచే పార్టీకి సానుకూలంగా ఉండేలా వలంటీర్లపై ఒత్తిడి పెంచారు. ఎ న్నికల విధులకు వలంటీర్లను వినియోగించకూడదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశా లు జారీచేసింది. ప్రభుత్వ పరంగా వారిని ఎన్నికల విధుల్లో ఉపయో గించలేదు. కానీ పార్టీ కోసం ఉప యోగపడేలా అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచించారు. సంక్షేమ పథ కాలను తీసుకున్న వారిపై ఒత్తిడి పెంచేలా వినియోగిస్తున్నారు.
అక్కరకురాని అర్హత పత్రాలు
వలంటీర్లను ఎన్నికలకు ఉపయోగించడం ఒక ఎత్తయితే ఇళ్ల స్థలాలు కేటాయింపులో అధికార పార్టీ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో అనర్హులంటూ తొలగించిన వారికి ఇప్పుడు పత్రాలు ఇస్తున్నారు. అవి రిజిస్ర్టేషన్ చేయడానికి పనికిరావు. అటువంటి పత్రాలతో లబ్ధిదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఓ పుంతలోనూ ఈ పత్రాలే ఇచ్చారు. వీఆర్వో సంతకాలతో వాటిని నివాసితులకు అందించా రు. గోదావరి తీర ప్రాంత నియోజకవర్గాల్లోనూ ఈ దందా సాగుతోంది. ఒకవైపు వలంటీర్లను వినియోగించుకోవడం, మరో వైపు సంక్షేమ పథకాలు అంటూ ఓటర్లను లోబరచుకునేలా అధికార పార్టీ నేతలు పన్నాగం చేస్తున్నారు.
వలంటీర్లపై ప్రత్యేక ప్రేమ!
ఇరగవరం, మార్చి 5 : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులు వలంటీర్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నియోజకవర్గంలో పలుచోట్ల వారిని క్షేత్రస్థాయిలో ప్రచార కార్యకర్తలుగా ఇప్పటికే వాడుకుంటున్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచనలు తెలుపుతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెబుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వలంటీర్లకు వందనం పేరుతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి వారిని ఆకర్షించుకునేందుకు తాయిలాలు అందజేస్తున్నారు. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికలలోపు ప్రతి వలంటీరు వారి పరిధిలో ఉన్న ఇంటిని కనీసం ఐదుసార్లు సందర్శించే విధంగా ప్రణాళిక చేపట్టి సీఎం జగన్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని హుకుం జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ వలంటీర్లు రాజకీయ పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న జిల్లా ఉన్నతాధికారుల ఉత్తర్వులు అమలయ్యేనా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
సర్వేలో వలంటీర్ల నిమగ్నం
వలంటీర్లను సర్వేకు ఉపయోగిస్తున్నారు. అత్తిలి, ఇరగవరం మండలాల్లో కొందరు వలంటీర్లు సర్వేకు ఉపక్రమించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే వలంటీర్ల రంగంలోకి దిగారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రజలనాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ వలంటీర్ల ద్వారా ఎంపిక చేయడంతో వారి ప్రభావం ఓటర్లపై ఉంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. ప్రజాధనంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వలంటీర్లకు ప్రభుత్వ సొమ్మునే వేతనాలుగా ఇస్తున్నారు. అవా ర్డులంటూ ప్రభుత్వం సొమ్ములు వెచ్చిస్తున్నారు. ఇఉ్పడు పార్టీకి వారి సేవలను వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.