Share News

రొయ్యకు వైరస్‌

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:05 AM

వనామి రొయ్యల సాగు చేస్తున్న రైతులకు సీడ్‌ దశలో షాక్‌ తగులుతోంది. చెరువులో సీడ్‌ వేసిన నెలరోజులకే వైరస్‌ సోకి చనిపోతున్నాయి.

రొయ్యకు వైరస్‌
వైరస్‌ సోకి చనిపోయిన రొయ్యలు

సీడ్‌ దశలోనే వనామికి పెద్ద దెబ్బ

ఆక్వా రైతుల్లో ఆందోళన

కలిదిండి, జనవరి 17 : వనామి రొయ్యల సాగు చేస్తున్న రైతులకు సీడ్‌ దశలో షాక్‌ తగులుతోంది. చెరువులో సీడ్‌ వేసిన నెలరోజులకే వైరస్‌ సోకి చనిపోతున్నాయి. రొయ్యలకు ధర పెరుగుతుండడంతో రైతులు రొయ్యల సాగు ప్రారంభించారు. సీడ్‌ దశలో వైరస్‌ సోకడంతో వంద కౌంటుకు రాకుండానే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని పెట్టుబడులు రావడం లేదని రైతులు వాపోతున్నారు. వైజాగ్‌, కాకినాడ, నెల్లూరు, చెన్నై తో పాటు స్థానికంగా హేచరీలు సుమారు 200 వరకు ఉన్నా యి. కొన్నిచోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడ్‌ ఉత్పత్తి పరిమితంగా సాగుతోంది. కొనుగోలు చేసిన సీడ్‌ను ల్యాబ్‌లలో పరీక్షించిన ప్పుడు ఎటువంటి వైరస్‌ తేలలేదని, కానీ చెరువులో వేసే సరికి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు 25 పైసలు ఉన్న రొయ్య పిల్ల ధర అమాంతంగా హేచరీల్లో 35 పైసలకు పెంచారు. ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలు వరకు రొయ్య పిల్లలను వదులుతారు. పెరిగిన ధరతో సీడ్‌ కొనుగోలు చేసి చెరువులో వేసిన నెల రోజులకే వైరస్‌తో మృత్యువాత పడుతుం డడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ప్రైవేట్‌ హేచరీలపై ఆధారపడడం వల్లే వైరస్‌ సీడ్‌ కొనుగోలు చేసి నష్టపోతున్నామని, ప్రభుత్వమే హేచరీలు ఏర్పాటు చేసి నాణ్య మైన సీడ్‌ను ఉత్పత్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

నాసిరకం సీడ్‌తో నష్టాలు

ప్రైవేట్‌ హేచరీలు లాభార్జనే ధ్యేయంగా నాసిరకం సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తూతూ మంత్రంగా పీసీఆర్‌ పరీక్షలు చేయడంతో చెరువులో వదిలిన నెల రోజుల్లోనే వనామి రొయ్యలు చనిపోతున్నాయి. లక్షలాది రూపాయల నష్టం వస్తోంది. ప్రభుత్వమే హేచరీలను ఏర్పాటు చేసి నాణ్యమైన రొయ్యల సీడ్‌ను ఉత్పత్తి చేయాలి.

– పి.శ్రీనివాస్‌, ఆక్వా రైతు

ప్రభుత్వ అజమాయిషీ లేకే..

హేచరీలపై ప్రభుత్వ అజమాయిషీ లేక సముద్ర తీర ప్రాంతా ల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లాభార్జనే ధ్యేయంగా నాసిరకం సీడ్‌ను విక్రయిస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు హేచరీ కేంద్రాలను తరచూ తనిఖీలు చేసి నాణ్యమైన రొయ్యల సీడ్‌ను విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.

– దుగ్గిరాల పరమేశ్వరరావు, ఆక్వా రైతు

రైతులు అప్రమత్తంగా ఉండాలి

రొయ్య పిల్లలను వేసే ముందు చెరువు గుణగణాలను సమగ్రంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఉదజని, పీహెచ్‌సీ పరీక్షించాలి. చెరువులో ఒక అడుగు నీరు నిండిన తర్వాత ప్లవకాలు వృద్ధి చెందేలా దృష్టి పెట్టాలి. సీడ్‌ సమయంలో మూడు అడుగుల నీరు ఉండాలి. ప్రధానంగా ఉదజని, అమ్మోనియా, నైట్రేట్‌ వంటి అన్ని పరీక్షలు చేయించుకోవాలి.

– చాన్‌ బాషా, మత్స్యశాఖ ఏడీ

Updated Date - Jan 18 , 2024 | 12:05 AM