Share News

వనామికి మంచు గండం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:09 AM

మంచు ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి వనామి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. జనవరిలో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రొయ్యల సాగు విస్తృతంగా చేస్తున్నారు. ఉదయం వేళ భారీగా మంచు కురుస్తూ చెరువులో తెట్టుగా పేరుకుపోవడంతో నీరు చల్లబడి ఆక్సిజన్‌ లోపంతో రొయ్యలు చనిపోతున్నాయి.

వనామికి మంచు గండం
రంగు మారిన రొయ్యలు

ఆక్సిజన్‌ అందక చనిపోతున్న రొయ్యలు

హడావుడిగా పట్టుబడులు

అయినకాడికి అమ్మకాలు

పెట్టుబడులు రాక నష్టాలు.. రైతుల లబోదిబో

కలిదిండి, జనవరి 4 : మంచు ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి వనామి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. జనవరిలో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రొయ్యల సాగు విస్తృతంగా చేస్తున్నారు. ఉదయం వేళ భారీగా మంచు కురుస్తూ చెరువులో తెట్టుగా పేరుకుపోవడంతో నీరు చల్లబడి ఆక్సిజన్‌ లోపంతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో చిన్న సైజు రొయ్యలనే హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు. కౌంటుకు రాకుండానే పట్టుబడి చేయడంతో గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. కనీసం ఖర్చులు రాక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన రొయ్యలు రంగు మారడంతో వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో వాటిని గోతుల్లో వేసి పూడుస్తున్నారు. కొద్ది రోజులుగా ఉదయాన్నే మంచు దట్టంగా పడుతుండడంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు చనిపోతున్నాయి. ఏరియేటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నా ఫలితం లేదు’ అని రైతు అండ్రాజు శ్రీనివాస్‌ వాపోయారు. మార్కెట్‌లో నాసి రకం మందులను విక్రయిస్తున్నారు. వీటిని చెరువుల్లో చల్లుతున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదని ఎన్‌.చలపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆక్సిజన్‌ కొరత నివారణకు చెరువుల్లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తగు మోతాదులో చల్లాలి. తెల్లవారుజాము నుంచి ఏరియేటర్లు నిరంతరాయంగా తిరుగుతూ ఉండాలి. దీనివల్ల ఆక్సిజన్‌ ఉత్పన్నమవుతుంది. మేత తక్కువగా వేయాలి’ అని మత్స్యశాఖ ఏడీ చాన్‌బాషా రైతులకు సూచించారు.

Updated Date - Jan 05 , 2024 | 12:09 AM