Share News

ఆకివీడులో వ్యాన్‌ బీభత్సం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:07 AM

ఆకివీడులో ఐషర్‌ లారీ బీభత్సం సృష్టించింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. దాని స్పీడ్‌కు కరెంటు స్తంభం విరిగిపడింది. పలు వాహనాలు ధ్వంస మయ్యాయి.

ఆకివీడులో వ్యాన్‌ బీభత్సం
గుడి గోడను ఢీకొట్టి ఆగిన వ్యాన్‌

చౌకడిపో డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడు జీవరత్నం మృతి

విరిగి పడిన కరంటు స్తంభం.. పలు వాహనాలు ధ్వంసం

ఆకివీడు, ఫిబ్రవరి 12: ఆకివీడులో ఐషర్‌ లారీ బీభత్సం సృష్టించింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. దాని స్పీడ్‌కు కరెంటు స్తంభం విరిగిపడింది. పలు వాహనాలు ధ్వంస మయ్యాయి. ఆకివీడులో హెచ్‌పీ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న రేషన్‌ డీలరు, చౌకడిపో డీలర్ల రాష్ట్ర నాయకుడు మద్దా జీవరత్నం (66)ను చేప పిల్లల ఐషర్‌ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. జీవరత్నం రిజిస్ట్రేషన్‌ పనిమీద స్కూటీపై కూతురితో కలిసి సచివాలయానికి వెళ్లాడు. ఆమెను అక్కడ దించి ఎదురుగా ఉన్న బంకులో పెట్రోలు కొట్టించుకుని రోడ్డు దాటుతుండగా ఐషర్‌ లారీ వెనుక భాగం ఢీకొట్టడంతో స్కూటీతో సహా పక్కకు పడిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా వైద్యుడు చనిపోయారని తెలిపారు. డ్రైవర్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎస్‌ఐ బత్తిన నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీభత్సం జరిగిందిలా..

ప్రమాదం జరిగిన ఆందోళనలో వ్యాన్‌డ్రైవర్‌ జాతీయ రహదారికి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. స్తంభం విరిగి ఎస్‌ఎల్బీ హోమ్‌ మార్ట్‌ ఎదురుగా ఆగి ఉన్న రెండు మారుతి కార్లు, రెండు మోటారు సైకిళ్లుపై పడడంతో ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా రోడ్డ పక్కన ఉన్న మెకానిక్‌ షాపును ఈడ్చుకెళ్ళిపోయింది. షాపు యజమాని ఎండ ఎక్కువగా ఉండడంతో అప్పుడే పక్కకు వెళ్ళడంతో ప్రాణాలు నిలిచాయి. అంతటితో ఆగకుండా వ్యాన్‌ అక్కడే ఉన్న ఆటోని ఢీకొని నాగదుర్గ దేవాలయం గోడను ఢీకొట్టి ఆగింది. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే యాంగిలర్‌ ఊడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - Feb 13 , 2024 | 12:07 AM