Share News

రద్దీ వేళల్లో రైళ్ల రద్దు

ABN , Publish Date - May 23 , 2024 | 12:24 AM

కొన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. దీనికితోడు ఈ రద్దీ సమయాల్లోనే కొన్ని రూట్లలో రైల్వే నిర్వహణ పనులు చేపట్టింది. ఈ కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రద్దీ వేళల్లో రైళ్ల రద్దు

పలు రైళ్లు అలస్యంగా..

ప్రయాణికులకు అవస్థలు

నరసాపురం, మే 22: వేసవి సెలవులంటే ప్రయా ణాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావ డంతో చాలామంది సొంత ఊళ్లు, తీర్థయాత్రలకు వెళుతుంటారు. ఈ కారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి.ఈ సీజన్‌లో రైల్వే కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంటుంది. అయితే ఈసారి కొన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. దీనికితోడు ఈ రద్దీ సమయాల్లోనే కొన్ని రూట్లలో రైల్వే నిర్వహణ పనులు చేపట్టింది. ఈ కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రయాణికులు నరకయాతన ఆనుభవిస్తున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి నడిచే రైళ్లలో గుంటూరు, విజయవాడ , రాజమండ్రి, నిడదవోలు వెళ్లే రైళ్లు పుల్‌గా ఉంటాయి. చాలామంది బస్సుల కన్నా డెమో రైళ్ళలో గమ్యస్ధానాలకు వెళ్లుతుంటారు. అయితే ఈనెల 15 నుంచి నరసాపురం– గుంటూరు పాస్ట్‌, నరసాపురం విజయ వాడ, నరసాపురం– నిడదవోలు, రాత్రి నరసాపురం నుంచి వెళ్లే రాజమండ్రి వెళ్లే రైళ్లను రద్దు చేసింది. దీంతో ఉదయం పూట డెల్టా నుంచి విజయవాడ వెళ్లాలంటే 11 గంటలకు నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే దిక్కయింది. ఇక నిడదవోలు వైపు వెళ్లే రైళ్లు లేక పోవడంతో నరసాపురం నుంచి భీమవరం, తణుకు, నిడదవోలు వెళ్లే ప్రయాణికులు బస్సులపై ఆధారపడాల్సి వచ్చింది. విజయవాడ, నిడదవోలు డివిజన్లలో రైల్వే నిర్వహణ పనులు చేపడుతున్నందున చాలా రైళ్లను ఈ రూట్లలో ఈనెల 26 వరకు, మరికొన్నింటిని నెలాఖరు వరకు రద్దుచేసింది. ప్రధానంగా ఉదయం విజయవాడ– గుంటూరు వెళ్లేందుకు జిల్లా వాసులు ఎక్కువుగా గుంటూరు పాస్ట్‌ ప్యాసింజర్‌పైనే ఆధారపడుతుంటారు. ఇటు వ్యాపారులు, ఉద్యోగస్తులు, ఆస్పత్రులకు, విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఆశ్రయిస్తారు. తిరుగు ప్రయా ణంలో కూడా ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఉదయం వేళల్లో జిల్లా నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయాల్లో రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల నుంచి పలు సంఘాలు రైల్వే ఆఽధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కనీసం ఉదయం 6 గంటలకు నరసాపురం నుంచి నడిచే పాస్ట్‌ ప్యాసింజర్‌ను నడపాలని కోరారు. ఆయినా రైల్వే స్పందించలేదు. నిర్వహణ పనుల పేరుతో వినతుల్ని పక్కన పెట్టింది.

నరకం చూపిస్తున్న నాగర్‌ సోల్‌

నరసాపురం–షిర్డీల మధ్య నడిచే నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నది. ఈ రైలులో ప్రయాణించాలంటే 30 గంటలు పడుతోంది. వారం రోజుల నుంచి ఈ రైలు ఆలస్యంగా నడుస్తోంది. ఉదయం 8.30కి రావాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 1 లేదా 3 గంటలకు వస్తోంది. మహారాష్ట్రలోని పలు డివి జన్లలో మరమ్మతు పనులు చేపడుతున్నందున ఎక్కడ బడితే అక్కడ గంటల తరబడి నిలిపేస్తున్నారు. దీంతో ఈ రైలు సికింద్రాబాద్‌కు రాత్రి 11 గంటలకు రావాల్సి ఉండగా ఉదయం 4, 5 గంటలకు చేరుతోంది. అక్కడ నుంచి నరసాపు రానికి మఽధ్యాహ్నానికి చేరుకుంటోంది. రద్దీ సమయాల్లో రైల్వే ప్రత్యేక రైళ్లను నడ పాల్సిందిపోయి నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రయాణికులు దుమ్మెత్తిపోస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 12:24 AM