బడి గంటకు వేళాయె
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:12 AM
నేటితో వేసవి సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి.

రేపటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్
కూటమి ప్రభుత్వం రాకతో ప్రభుత్వ స్కూళ్లకు మంచి రోజులు వచ్చేనా ?
ఇంకా అందని పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, విద్యా సామగ్రి
భీమవరం ఎడ్యుకేషన్, జూన్ 11 : నేటితో వేసవి సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి విద్యార్థుల చేరికలు మొదలు కానున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 2024–25 విద్యా సంవత్సరంపై ప్రభావం చుపుతుందా..? లేక మెరుగు పడుతుందా ? అనేది ఈసారి పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్ణయించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌లు, షూలు ఇప్పటికే పాఠశాలలకు చేరిపోవాలి. ఈ నెల 12వ తేదీ నాటికి విద్యా సామగ్రి అందాల్సి వుండగా వాయిదా వేశారు. మండలాల వారీగా విద్యాసామగ్రి చేరడం పూర్తయ్యింది. ప్రైమరీలోనే ఇంకా కొన్ని పుస్తకాలు రావాలి. మిగిలినవన్ని పూర్తిస్థాయిలో వచ్చాయి.
అడ్మిషన్‌లు ఈసారి ఏమవుతాయో..
వైసీపీ ప్రభుత్వ విద్యా విధానం కారణంగా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విముఖత ఏర్ప డింది. ఇది ప్రభుత్వ పాఠశాలల పతనానికి దారితీసింది. గడిచిన రెండేళ్లలో 1,352 ప్రభుత్వ పాఠశాల్లోని 32,746 మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. 2023–24 విద్యా సంవత్సరం లక్షా ఐదు వేల 31 మంది విద్యార్థులకు పడిపోయింది. గడిచిన ఐదేళ్ళలో జిల్లాలో 45 వేల మందిపైగా విద్యార్థులు ప్రైవేటుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం 2024–25 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు.
ప్రైవేటులో అడ్మిషన్‌లపై దృష్టి
గతం మాదిరి ఈ ఏడాది ప్రైవేటు విద్యా సంస్థలు అడ్మిషన్లలో వారి వారి వ్యూహాలతో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మే నెల నుంచే క్యాంపెయిన్లు చేసి అడ్మిషన్లు భారీగా తీసుకున్నారు. జిల్లాలో 473 ప్రైవేటు పాఠశాలలో లక్ష పది వేల మంది విద్యార్థులున్నారు.
నాడు–నేడుతో తీరని సమస్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సెకండ్ ఫేజ్ నాడు–నేడు పనులు చాలా వరకు మిగిలిపోయాయి. దీంతో ఈ ఏడాది చాలా పాఠశాలలు అరకొర సదుపాయాలతో నిర్వహించాల్సి వస్తుంది. 2022లో మొదలైన సెకండ్ ఫేజ్ నాడు–నేడులో 746 పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.261.37 కోట్లు మంజూరన్నారు. ఇప్పటి వరకు రూ.142.77 కోట్లు పనులే చేపట్టారు. అదనపు తరగతి గదుల పనులు నిలిపివేశారు. మొదటి ఫేజ్‌లో జిల్లాలో 524 పాఠశాలలో నాడు–నేడు కింద రూ.113.91 కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ కూడా పూర్తిస్థాయి సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారు.