Share News

నేటి నుంచే ఉచిత ఇసుక

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:02 AM

జిల్లా వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం. నేటి నుంచి అమ లు కాబోతోంది. తగ్గట్లుగా రాష్ట్రప్రభుత్వం ఎక్కడికక్కడ అధి కారులకు మార్గనిర్దేశం చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే కేవలం నామమాత్రపు ఛార్జీలు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.

నేటి నుంచే ఉచిత ఇసుక
కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట వద్ద నిల్వ ఉన్న ఇసుక

వింజరం, ఇబ్రహీంపేట, చేబ్రోలులో ఇసుక స్టాక్‌ పాయింట్లు

ఒక్కొక్కరికి 20 టన్నులకు లోబడే అందజేత

నామమాత్రపు ధరకే సరఫరా

సీసీ కెమెరాల ఏర్పాటు, అధికారుల పర్యవేక్షణ

స్టాక్‌ పాయింట్లను పరిశీలించిన

కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ లావణ్యవేణి

(ఏలూరు,ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

నాడు..

ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు ఏరోజు కారోజే ఇసుక కోసం యుద్ధం. ఒకవైపు దళారులు, ఇంకోవైపు వైసీపీ నేతలు పేరుకి పక్కాగా ఇసుక పంపిణీ చేస్తామంటూనే ప్రకటనలు గుప్పించి, ధరలు ప్రకటించి ఇష్టానుసార వ్యవహారం. చిన్నపాటి ఇల్లు కట్టుకుందామన్నా ఇసుక లేదు. భారీ పరిశ్రమకు అవసర మైన నిల్వలు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రహద్దులు దాటి పొరుగు రాష్ర్టాలకు కోట్లాది రూపాయల ఇసుక రవాణా. వీటిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులకు వాటాలు.. కీలక పాత్ర.. దొరికినంత మేర అడ్డంగా ఇసుక దోపిడీ.

నేడు..

రాష్ట్రంలో కూటమి పాలన ఆరంభం. ప్రజ లు మెచ్చిన ప్రజా ప్రభుత్వం పక్కాగా నిర్ణయా లు.దానిలో భాగంగానే గడిచిన ఐదేళ్లు జనం పడ్డ పాట్లు స్థానంలో ఉచిత ఇసుక విధానం. అదికూడా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే అమలు. ఇప్పటికే నిల్వఉన్న ఇసుకను వినియోగదారులకు అందిం చబోతున్నారు. ఒక్కో ఆధార్‌ కార్డు మీద ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. కేవలం నామమాత్రపు ఛార్జీలు మాత్రమే వసూ లు చేస్తారు. అది కూడా జీఎస్టీ, ఇసుక ఎత్తిపోయడానికి ఆయిన ఛార్జీలతో పాటు ఇసుక పన్నును వసూలు చేస్తారు. ఇక రవాణా ఛార్జీలను వినియోగదారులే భరించాలి. గోదావరి ఇసుకను అందించేందుకు వీలుగా కుక్కునూరు మండలం వింజరం, ఇబ్రహీంపేట, ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద ఇసుక స్టాక్‌ పాయింట్ల నుంచే ఉచిత ఇసుకను ఇప్పుడు ప్రథమ దశలో అందరికి అందిస్తారు.

జిల్లా వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం. నేటి నుంచి అమ లు కాబోతోంది. తగ్గట్లుగా రాష్ట్రప్రభుత్వం ఎక్కడికక్కడ అధి కారులకు మార్గనిర్దేశం చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే కేవలం నామమాత్రపు ఛార్జీలు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. దీనికి మించి ఎక్కడా ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంతకు ముందు గోదావరి ఒడ్డున గూటాల గ్రామ సమీపాన ఇసుక రీచ్‌ ఉండేది. అది ఒక్కటే ఈ జిల్లాలో అతి పెద్ద రీచ్‌. కాని ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ఆరంభం కానుండడంతో ఎక్కడైతే ఇసుక స్టాక్‌ ఉంటుందో అక్కడి నుంచే పని మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు అం దాయి. కుక్కునూరు మండలం వింజరంలోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద ప్రతి మెట్రిక్‌ టన్నుకు రూ.362, ఇబ్రహీంపేట స్టాక్‌ పాయింట్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.210, ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉన్న ఇసుక పాయింట్‌ వద్ద మెట్రిక్‌ టన్ను ఒక్కింటికి రూ.578 వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంతకు ముందు అయితే టన్ను ఇసుక కావాలంటే అత్యధి కంగా వేలల్లో రేట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. ప్రయా ణ ఛార్జీలతో కలిపి మరి ముక్కుపిండి వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు. ఈ సారి కూటమి ప్రభుత్వంలో దీనికి భిన్నమైన నేపఽథ్యంలో ఇసుకను వినియోగదారుల చెంతకే చేర్చబోతున్నారు. ఎక్కడికక్కడ ఇసుక స్టాక్‌ పాయిం ట్ల వద్ద వినియోగదారుల నుంచి ఎంతెంత వసూలు చేయ బోతున్నారో ప్రభుత్వం నిర్దేశించిన ధరలను పట్టిక రూపంలో ప్రదర్శించాల్సిందే. దీనికి లోబడి మాత్రమే ఇసుకను సరఫరా చేయాలి. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ వంటి అధికారు ల పర్యవేక్షణ నిత్యం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అన్ని రీచ్‌లవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు జరిగే లావాదేవీలను నిర్దేశిస్తారు, నిఘా పెడతారు. అలాగే ఇసుక అక్రమ మార్గాల్లో తరల కుండా ఎక్కడికక్కడ పోలీస్‌, రెవెన్యూ అధికారులను అప్రమ త్తం చేశారు. ఎవరైతే వినియోగదారులు తమకు ఇసుక కావా లని, ముందుకొస్తారో వారంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసు కోవాలి. దరఖాస్తు ఎవరైతే ముందు చేశారో, ఆ క్రమపద్ధతి లోనే స్టాక్‌ పాయింట్లో ఉన్న ఇసుకను అందించే ప్రయత్నం చేస్తారు. అంటే ముందుగా వస్తే ముందు వరుసలోనే అనే సూత్రాన్ని పాటిస్తారు.

నేడు అంకురార్పణ

ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచే అమల్లోకి తేబోతున్నారు. కుక్కునూరులో ఇసుక స్టాక్‌ పాయింట్ల నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని నాంది పలకబోతున్నారు. ఈ మేరకు సంబంధిత ప్రజా ప్రతినిధులతో పాటు కలెక్టర్‌ వెట్రి సెల్వి హాజరు కానున్నారు. ఇప్పటికే కుక్కునూరు, వేలేరు పాడులో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి పర్యటించి, అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు స్టాక్‌ పాయింట్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఇంతకు ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్‌కుమార్‌ ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌కు మార్గనిర్దేశం చేశారు. ఉచిత ఇసుక విధానం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆరా తీసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సూచన లు జారీ అయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ విధానాన్ని ప్రజలకు నేరుగా చేరేలా చూడాల్సిందిగా కూటమి నాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

పారదర్శకంగా ఉచిత ఇసుక : కలెక్టర్‌

ఉంగుటూరు : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టిందని ఈ విషయంలో నాణ్యతతో కూడి పారదర్శకంగా పంపిణీ జరగాలని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి పేర్కొన్నారు. ఆదివారం చేబ్రోలు ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఎమ్మెల్యే ధర్మరాజుతో కలసి సందర్శించి నాణ్యతను గనుల శాఖ అధికారుల సమక్షంలో పరిశీలించా రు. ఆమె మాట్లాడుతూ ఇసుక నాణ్యతను పరిశీలించి నివే దిక సమర్పించాలని కోరారు. ఇసుక స్టాక్‌ కోసం కుక్కు నూరు మండలంలోని రీచ్‌ నుంచి లేదా సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రీచ్‌ నుంచి ఇసుకను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాక్‌ పాయింట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఇనుప కంచె వేయించాలని, రవాణా వాహనాల రాకపోకలకు ముఖద్వారం నిర్మించాలన్నారు. ఇసుక ఛార్జీలు ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. స్టాక్‌ పాయింట్‌లో ఉన్న ఇసుక నాణ్యతను పరిశీలించి గనుల శాఖ సర్వేయర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. ఆమె వెంట గనుల శాఖ ఏడీ జి.సునీల్‌ బాబు, ఏలూరు ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్‌ కె.వెంకట శివయ్య,సిబ్బంది పాల్గొన్నారు.

ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుకనే అందిస్తాం : జేసీ

కుక్కునూరు : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీ నేటి నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో మండలంలోని వింజరం ఇసుక డిపోను ఆదివారం జేసీ లావణ్యవేణి పరిశీలించారు. ఇప్పటి వరకు ఏజన్సీల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా జరిగిందని ఇక నుంచి కొత్త విధి విఽధానాలతో ఇసుక సరఫరా అవుతుందన్నారు. కుక్కునూరు మండలంలోని దాచారం, వింజరం, ఇబ్రహీంపేట, వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట–1, రుద్రంకోట –2 ఇసుక రీచ్‌లు ఉన్నాయన్నారు. మైనింగ్‌ శాఖ వింజరం డిపోలో 4వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక, ఇబ్రహీంపేటలో డిపోలో 95 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఇసుక డిపోల్లో అసలు ఎంత నిల్వలు ఉన్నాయో క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇసుకను ప్రాథమికంగా అంచనా వేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం డిపోలలో ఉన్న ఇసుకను మాత్రమే ప్రజలకు అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా వింజరం డిపోలో 4 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉన్నట్టు నివేదిక ఇవ్వగా క్షేత్రస్థాయిలో 1500 మెట్రిక్‌ టన్నుల ఇసుక మాత్రమే ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆర్డీవో అద్దయ్య, తహసీల్దార్‌ అచ్యుతకుమారి పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:02 AM