Share News

నేడే నోటిఫికేషన్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:46 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు.

నేడే నోటిఫికేషన్‌

నేటి ఉదయం 11 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ

ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, ఎమ్మెల్యే

అభ్యర్థి పది వేలు డిపాజిట్‌ చెల్లించాలి

నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 17 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెల్లడించారు. అభ్యర్థులంతా ఎన్నికల సంఘం జారీచేసిన నియమావళికి లోబడే నామినేషన్లు దాఖలు చేయాలని, దీనిపై వారికి అవగాహన వచ్చేలా అధికారులను కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్‌ స్వీకరణ ఆరంభం. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్దేశించిన కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికా రులు నామినేషన్లు స్వీకరిస్తారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్వో కార్యాలయాన్ని భీమ వరం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేశాం. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరితేది. అదేరోజు నామినేషన్ల తుది జాబితాను ప్రకటిస్తాం. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఇప్పటికే నామినేషన్‌లకు సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న తహశీల్దార్‌ కార్యాలయాల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు నామినేష న్‌లు స్వీకరిస్తారు. నామినేషన్‌ దాఖలు సమయంలో రిటర్నిం గ్‌ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్లలోపు అభ్యర్థికి చెందిన మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తాం. పార్లమెంట్‌, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాట్లు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం–2 (ఏ) అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం–2(బి) సమర్పించాలి. పార్లమెంట్‌ నామినేషన్‌ దరఖాస్తుకు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. నామినేషన్‌ స్వీకరించడానికి ఉద్దేశించిన గదిలో 360 డిగ్రీల కోణంలో పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటుచేశాం. రాకపోకల కు ఉద్దేశించిన ద్వారాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. అభ్యర్థులకు ఇచ్చిన చెక్‌ లిస్టును డూప్లికేట్‌ తయారు చేసుకో వాలి. నామినేషన్‌ వేసే ప్రతి అభ్యర్థి తన పేరున ఏదైనా బ్యాంకులో కొత్తగా అకౌంటును ప్రారంభించి ఆ వివరాలను నామినేషన్‌తోపాటు ఆర్‌వోకు అందజేయాలి. నామినేషన్‌ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి ప్రపోజర్‌ పేరు ఓటరు జాబితాలో ఉందో, లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. నామినేషన్‌ ప్రక్రియ తదుపరి అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. నామినేషన్‌ ప్రక్రియపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కలెక్టరేట్‌లో సంప్రదించాలి.

ఖర్చు అభ్యర్థి ఖాతాలోనే

అభ్యర్థులు నామినేషన్‌ వేసినప్పటి నుంచి చేసే ఖర్చును వారి ఖాతాల్లోనే లెక్కిస్తాం. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చు సైతం అభ్యర్థి ఖాతా కిందకే వస్తాయి. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరూ ఉమ్మడిగా సమావేశాలు, సభలు నిర్వహిస్తే, ఆ ఖర్చును ఇద్దరికీ సర్దుబాటు చేస్తాం. జిల్లాకు ముగ్గురు అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఒకరు పార్లమెంటుకు, మిగిలిన ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. త్వరలో వారు జిల్లాకు రానున్నారు. వారు వచ్చేలోగా అవసరమైన అన్ని రిజిస్టర్లను సిద్ధం చేసి, ఏర్పాట్లు పూర్తి చేస్తాం. సభలు, సమావేశాలు జరిగిన 24 గంట్లలోగానే అభ్యర్ధి ఖాతాలో ఖర్చు నమోదు చేయాలని సూచనలు ఇచ్చాం. అభ్యర్థులు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకే ప్రచారం చేసుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు జారీ చేయటం కోసం ఇప్పటికే అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. మంచం మీద ఉన్న నడవలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జర్నలిస్టులు నిర్ణీత వ్యవధిలోనే దరఖాస్తు చేసుకోవాలి’ అని వివరించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:46 AM