Share News

పెద్దపులి పంజా

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:04 AM

పెద్దపులి పంజా విసిరిన ఘటన దేవినేనివారిగూడెంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామంలో రెండు ఆవులు, ఓ దూడపై పులి దాడి చేయడంతో అవి బెంబేలెత్తి కట్లు తెంపుకుని రోడ్డుపైకి పరుగులు తీశాయి. రైతులు, స్థానికుల గుండెల్లో భయం పెరిగింది. బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

పెద్దపులి పంజా
దేవినేనివారిగూడెం గ్రామస్థులతో మాట్లాడుతున్న అటవీఅధికారి రవీంద్ర

దేవినేనివారిగూడెంలో పశువులపై దాడి

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్‌ అధికారుల సూచన

ముండూరు సమీపంలో బోను ఏర్పాటు

ద్వారకాతిరుమల, జనవరి 28 : పెద్దపులి పంజా విసిరిన ఘటన దేవినేనివారిగూడెంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామంలో రెండు ఆవులు, ఓ దూడపై పులి దాడి చేయడంతో అవి బెంబేలెత్తి కట్లు తెంపుకుని రోడ్డుపైకి పరుగులు తీశాయి. రైతులు, స్థానికుల గుండెల్లో భయం పెరిగింది. బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వివరాలివి.. తిమ్మాపురానికి చెందిన రైతు పాకలపాటి మఽధుకు దేవినేనివారిగూడెంలో పొలం ఉంది. ఆయన ఆదివారం ఉదయం నాలుగు గంటలకు పొలానికి వచ్చేసరికి తన మూడు ఆవులు గాయాలతో రోడ్డుపై అరుస్తూ నిలబడి ఉండడాన్ని చూసి వాటిని పరిశీలించి సాటిరైతులకు సమాచారం ఇచ్చాడు. అందరూ వచ్చిచూడగా ఆవులపై పులి గోళ్లతో దాడి చేసినట్టు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఫారెస్ట్‌ అధికారి రవీంద్రధామ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన ఆవులను, ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులనుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాపికొండల అటవీప్రాంతం నుంచి పులి తప్పిపోయి వచ్చిన ట్టు సమాచారం ఉందన్నారు. ఇది పగలంతా విశ్రాంతి తీసుకుంటూ రాత్రివేళ రోజుకు దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, కొద్దిరోజులు రైతులు, స్థానికులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఎవరూ హాని కల్గించవద్దని అలాచేస్తే వన్యప్రాణిరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. గ్రామాల్లో సాయంత్రం ఐదు ఐదు గంటల తర్వాత తిరగద్దని టాంటాం వేయించాలని సూచించారు. రైతుల పశువులకు ఈ పులివల్ల నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

బోను ఏర్పాటు చేస్తున్నాం : రవీంద్రదామా

పెదవేగి, జనవరి 28 : ముండూరు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలికలను గుర్తించామని, పులిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అటవీశాఖాధికారి రవీంద్ర దామా తెలిపారు. శనివారం ఉదయం దెందులూరు మండలం పెరుగ్గూడెం, చల్లచింతలపూడి గ్రామాల్లో పులి పాదముద్రలు గుర్తించగా, ఆదివారం మేదినరావుపాలెం మీదుగా పెదవేగి మండలం ముండూరు సమీపంలో పోలవరం కుడికాలువ సమీపంలో పంటపొలాల్లో పులి పాదముద్రలు కనిపించాయి. రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి వై.శ్రీనివాసరెడ్డి, రాజమహేంద్రవరం డీఎఫ్‌వో ఎ.త్రిమూర్తులురెడ్డి, ఇతర అధికారులతో కలిసి పులి తిరిగినట్టు గుర్తించిన ప్రదేశాల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముండూరు, మేదినరావుపాలెం, ధర్మారావుపేట, చక్రాయగూడెం, సీతారామపురం గ్రామాల చుట్టుపక్కల పులి తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి సమయంలో ఒంటరిగా పొలాలకు వెళ్ళవద్దు, ముఖ్యంగా పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. పెద్దపులిగా అనుమానిస్తున్న జంతువు సమాచారం తెలిస్తే అటవీశాఖాధికారులకు సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 5909 కు అందించాలని సూచించారు.

Updated Date - Jan 29 , 2024 | 12:04 AM