Share News

పులి బాబోయ్‌ పులి !

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:00 AM

పులి..బాబాయ్‌ పులి.. అంటూ జనం బెంబే లెత్తుతున్నారు. పులి పశువుని తింటున్న వీడియో సోషల్‌ మీడియాలో విప రీతంగా ప్రచారం అవుతుండటంతో గ్రామాల్లోని ప్రజలందరూ భయం దోళన చెందుతున్నారు.

పులి బాబోయ్‌ పులి !
మేదినరావుపాలెం మొక్క జోన్న తోటలో పులి కాలు గుర్తులు

భయంతో వణుకుతున్న జనం

పెరుగుగూడెం, మేదినరావుపాలెంలో కలకలం

దెందులూరు, జనవరి 27 : పులి..బాబాయ్‌ పులి.. అంటూ జనం బెంబే లెత్తుతున్నారు. పులి పశువుని తింటున్న వీడియో సోషల్‌ మీడియాలో విప రీతంగా ప్రచారం అవుతుండటంతో గ్రామాల్లోని ప్రజలందరూ భయం దోళన చెందుతున్నారు. కూలీలు, రైతులు పనులకు వెళ్లడం మానేశారు. రైతులు పాలు తీసుకునేందుకు పొలాల్లోకి వెళ్లడం లేదు. శనివారం దెందు లూరు మండలం మేదినరావు పాలెం పోలవరం కాల్వ పక్కనే ఉన్న గట్టు వద్ద పులి అడుగులు కనిపించడంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున కర్రలు, గునపాలతో వెతికారు. పులి అడుగుల గుర్తులు కనిపిం చడంతో వీఆర్వోకి సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు సమా చారం ఇచ్చారు. శుక్రవారం పెరుగుగూడెం గ్రామానికి చెందిన యలమర్తి బాపారావు కుమారుడు వేణుగోపాల్‌కు చెందిన గేదెల పాక వద్ద, మొక్కజొన్న తోటలో పులి తిరిగిన గుర్తులు ఉన్నాయంటూ అందిన సమా చారం మేరకు అటవీ శాఖ అధికారి కుమార్‌ సిబ్బందితో వచ్చి గుర్తులను పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలం సత్తెనపల్లిలోను అదేరోజు పులిగుర్తులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెరుగు గూడెం, సత్తెనగూడెంలో ఉన్న అడుగులు పులివే అని చెప్పారు. కానీ అడవి నుంచి 30 కిలోమీటర్ల వరకూ బయటకు వచ్చి ప్రయాణించిన పులి జంతువులు, పశువులమీద గానీ దాడి చేయ లేదని తిరిగి వెళ్లిందా లేక ఇక్కడే ఉందా అనే దానిసై స్పష్టత కోసం పోలీసు, అటవీశాఖ సిబ్బంది విచారిస్తున్నారని తెలిపారు. నాలుగు గ్రామాల ప్రజలు ఒంటరిగా పోలాల్లోకి వెళ్లవద్దని ఏవిధమైన సమాచారం తెలిసినా టోల్‌ఫ్రీ నంబర్‌ 1800–4255909కు ఫోన్‌ చేయాలని కుమార్‌ తెలిపారు.

యర్రమిల్లిపాడు మొక్కజొన్న చేలల్లో ...

ఉంగుటూరు, జనవరి 27 : ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు రైతు పోతురాజు మొక్కజొన్న చేలో పాదముద్రలు కనిపిం చాయి. పలుచోట్ల పంట పాడు చేయడంతో పాటు పైపులైను ధ్వసం అవ్వడంతో రైతులు అనుమానం వచ్చి చేబ్రోలు పోలీసులకు తెలిపారు.ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా ఫారెస్ట్‌ రేంజర్‌ కుమార్‌ తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అడవి పందుల గుంపు వచ్చి ఉంటుందని, వాటి పదునైన దంతాలతో పైపులైన్లు, పంటను నాశనం చేసి ఉంటాయని వివరించారు. నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల ప్రాంతాలలో పెద్ద పులి తిరుగుతుందంటూ ఆయా మండలాల ప్రజలు భయాందోళన చెందుతు తున్నారని భయం అవసరం లేదన్నారు.

అవి పులి పాద ముద్రలే..

ఏలూరు, జనవరి 27: ఏలూరు సెక్షన్‌ రామసింగవరం బీట్‌ పరిధిలో గల దెందులూరు మండలం పెరుగుగూడెంలో సంచరిస్తున్న జంతువు పాద ముద్రల పరిశీలించిన పిమ్మట పెద్దపులి పాదముద్రలుగా నిర్ధారించి నట్టు జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా గాయపరచుట గానీ, చంపుట గానీ, చేసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు.

భయపడాల్సిన అవసరం లేదు : ఎస్పీ

ఏలూరు క్రైం, జనవరి 27 :పలు మండలాల్లో పులి సంచారమని వస్తున్న వార్తలు నమ్మి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారంపై అటవీశాఖ, పోలీస్‌శాఖ అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టారన్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్‌ 100, 112 నంబర్లకు, ఏలూరు పోలీస్‌ కంట్రోల్‌ 83329 59179 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Jan 28 , 2024 | 12:00 AM