నలుగురు దారి దోపిడీ దొంగల అరెస్టు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:01 AM
దారిదోపిడీకి పాల్పడ్డ నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు తెలిపారు.
భీమవరం క్రైం, ఆగస్టు 23 : దారిదోపిడీకి పాల్పడ్డ నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు తెలిపారు. శుక్రవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాళ్ళ మండలం కోపల్లె గ్రామానికి చెందిన కోన రమేష్ ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఒక వివాహ వేడుకలో ఫొటోలు తీసి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో చినఅమిరం గ్రామం అంబేడ్కర్ సెంటర్ వద్దకు వెళ్ళేసరికి నలుగురు యువకులు రమేష్ వాహనాన్ని ఆపారు. జేబులో ఉన్న సొమ్ము ఇమ్మని లేనిపక్షంలో చంపుతామంటూ కత్తితో బెదిరించి కొట్టారు. అనంతరం అతని జేబులో ఉన్న ఐదువేల రూపాయల పర్సుని లాక్కుని వెళ్ళిపోయారు. దీనిపై రమేష్ శుక్రవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా చినఅమిరం గ్రామానికి చెందిన కొడాలి సతీష్, బిరుదగడ్డ నరేష్, గూడపాటి ఉదయ్‌కుమార్, తెనాలి దావీద్‌లను శుక్రవారం మధ్యాహ్నం భీమవరం హాస్పిటల్స్ వెనుక రోడ్డులో అరెస్టు చేసినట్లు తెలిపారు. కొడాలి సతీష్‌పై ఒక హత్య కేసు కూడా ఉంది. గూడపాటి ఉదయ్‌కుమార్‌పై రెండు కేసులు, తెనాలి దావీదుపై రెండ కేసులు ఉన్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన సీఐ కాళీచరణ్, ఎస్‌ఐ రహ్మాన్, సిబ్బందికి రివార్డు అందిస్తామని తెలిపారు.