Share News

ఆ 350 ఎకరాలు ఎక్కడ?

ABN , Publish Date - May 30 , 2024 | 12:06 AM

దేవుడు మాన్యాలు పరులపాలవుతున్నాయి. దేవుడిపై భక్తితో గతంలో సంస్థానాధీశులు, రాజులు, ధనవంతులు, భక్తిపరులు వేలాది ఎకరాల భూములను దానం ఇచ్చారు.

ఆ 350 ఎకరాలు ఎక్కడ?
ఆలయం పక్కనే ఆలయ భూమికి ఫెన్సింగ్‌ వేసిన దేవదాయశాఖ అధికారులు

పరాధీనంలో దాసాంజనేయస్వామి ఆలయ భూములు

పట్టించుకోని దేవదాయశాఖ

ఉన్న భూములను ప్రైవేటుకు అప్పగింత

హిందూ ధార్మిక సంస్థల మండిపాటు

దేవుడు మాన్యాలు పరులపాలవుతున్నాయి. దేవుడిపై భక్తితో గతంలో సంస్థానాధీశులు, రాజులు, ధనవంతులు, భక్తిపరులు వేలాది ఎకరాల భూములను దానం ఇచ్చారు. ఈ భూములు ఎక్కడున్నాయి ? వాటి పరిస్థితి ఏమిటి ? ఎవరు అనుభవిస్తున్నారు ? ఎంత మంది ఆక్రమించుకున్నారు? ఎన్ని భూములు పరాధీనమయ్యాయనే సమాచారం దేవదాయ శాఖ వద్ద లేదు. ఈ భూములు దేవాలయాలకు చెందినవని రెవెన్యూ అధికారులు చెబితే కాని తెలుసుకోని స్థితిలో ఆ శాఖ అధికార యంత్రాంగం ఉంది. ఆ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాల్సిన వారు ఆలయానికి ఉన్న స్థలాలను ప్రైవేట్‌పరం చేయడంపై ధార్మిక సంస్థలు, హిందూ ధర్మ రక్షా సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఏలూరు కల్చరల్‌, మే 29 : ఏలూరు సమీపంలోని శనివా రపుపేటలో 200 ఏళ్ల నాటి దాసాంజనేయస్వామి కోవెల ఉంది. అప్పట్లో నూజివీడు జమీందారు పెంటపాడు మండలం కస్పా పెంటపాడులోని బైరాగి మఠానికి దీపదూప నైవేద్యాల కు 1,350 ఎకరాలు రాసి ఇచ్చారు. ఇందులో 350 ఎకరాలు శనివారపుపేట దాసాంజనేయస్వామి ఆలయాభివృద్ధికి, దూప దీప నైవేధ్యాలకు నిత్య కార్యక్రమాలకు కేటాయించారు. కాలక్రమేణా ఈ ఆలయాన్ని 2005లో దేవదాయ శాఖ స్వాధీ నం చేసుకుంది. అంతకుముందే 1995 నుంచి ఈ ఆలయానికి రిజిస్టర్డ్‌ కార్యవర్గం ఉంది. ఆలయానికి సంబంధించి కరెంటు ఖర్చు, ఆలయ అర్చకుడి వేతనానికి రూ.14 వేలు మాత్రమే దేవదాయ శాఖ చెల్లిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించి నిర్వహణ అంతా కొన్నేళ్లుగా బైరాగిమఠం స్వాధీనంలోనే ఉంది. దేవదాయ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలయానికి సం బంధించి 350 ఎకరాల భూమి కస్పా పెంటపాడులో వివిధ చోట్ల ఉన్నట్టు గుర్తించారే తప్ప దానిపై ఆదాయం ఎటు పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు భూమి పరిస్థితి ఏంటి ? ఎవరి అధీనంలో ఉంది.. ? అన్న విషయం దేవదాయ శాఖ చెప్పడం లేదు. ఈ క్రమంలో దాసాంజనేయస్వామి కోవెలకు సంబంధించి ఆలయం ఎదురుగా సుమారు 250 గజాల స్థలాన్ని ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలకు, అన్న దాన కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. తాజాగా ఆ స్థలాన్ని 11 ఏళ్లపాటు ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇస్తూ ఇటీవల దేవదాయశాఖ ఆదేశాలు జారీచేసింది. 350 ఎకరాలు భూమి వివరాలు చెప్పకుండా ఉన్న స్థలాన్ని ఎలా ప్రైవేట్‌పరం చేస్తారంటూ ధార్మిక సంస్థలు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద బుధవారం సమావేశం నిర్వహించారు. ఆలయానికి సంబంధించి బైరాగి మఠానికి ఇచ్చిన భూములు విషయంతోపాటు ఆ భూమిపై వచ్చే ఆదాయాన్ని తక్షణం లెక్కలు చెప్పాలని హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్‌ సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. ఆలయ కమిటీకి, గ్రామ పెద్దలకు తెలియకుండా 250 గజాలు స్థలాన్ని ఎలా ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయిస్తారంటూ మండి పడ్డారు. ఆలయానికి సంబంధించి అర్చకులకు కరెంటు బిల్లు, స్వీపర్‌కు తప్ప దేవదాయ శాఖ ఎటువంటి నగదు ఇవ్వడం లేదని, ఆలయంలో ఏం జరిగినా దాతలు, కమిటీ సభ్యులే వేడుకలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఆలయానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి అధికారులు లెక్కలు చెప్పి, లీజును తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 12:06 AM