టీడీఆర్ బాండ్ల గోల్‌మాల్
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:41 PM
తాడేపల్లిగూడెంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 150 కోట్లు విలువైన బాండ్‌లు జారీచేశారు. ఇందులో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించారు. కోట్ల రూపాయలు కొల్ల గొట్టారు. మున్సిపాలిటీ జారీచేసిన బాండ్‌లను మార్కెట్‌లో 40 శాతం ధరకు విక్రయించుకున్నారు.

తాడేపల్లిగూడెంలో వైసీపీ నేత దందా
రూ. 150 కోట్ల విలువైన బాండ్‌లు జారీ
మార్కెట్‌లో రూ.60 కోట్లకు విక్రయం
వైసీపీ నేతకు సింహభాగం
స్థల యజమానులతో అనేక ఒప్పందాలు
వైసీపీ ప్రభుత్వం వస్తే బాండ్‌లు ఇచ్చేలా ప్రణాళిక
ప్రభుత్వం మారిపోవడంతో మారిన తలరాత
వెలికి తీస్తున్న కూటమి నేతలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెంలో మీ స్థలం వెంబడి మాస్టర్ ప్లాన్ రహదారి వెళ్లింది. అదే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలను కుంటున్నారా ? సొమ్ములు చేతిలో లేవా.. అయితే మున్సిపల్ అధికారులను సంప్రదించండి. మాస్టర్ ప్లాన్ రహదారిలో ఉన్న స్థలానికి టీడీఆర్ బాండ్‌లు ఇచ్చేస్తారు. వాటిని బయట మార్కెట్‌లో అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. మాస్టర్ ప్లాన్ రహదారికి ఆనుకుని ఉన్న మిగిలిన స్థలంలో అదే సొమ్ముతో అపార్ట్‌మెంటే నిర్మించుకోవచ్చు. ఇలాగని ఆశపడి వెళితే కుదరదు. నేతలు ముందుకొస్తారు. బాండ్‌లు జారీ చేయిస్తారు. అమ్ముకుంటారు. వారే సొమ్ములు తీసుకుంటారు. లబ్ధిపొందుతారు. మార్కెట్ విలువ ప్రకారం మీ సొమ్ములు మీకు ఇస్తారు. మిగిలిన సొమ్మంతా నేతల జేబులోకి వెళ్లిపోతుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది. మాస్టర్ ప్లాన్ రహదారి పేరుతో బాండ్‌లు జారీచేశారు. రహదారిని విస్తరించ లేదు. అదే చోట అనేకమంది స్థల యజమానులు ఇప్పటికీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే బాండ్‌లు జారీచేసిన స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలి. రహదారిని విస్తరించాలి. ఇవేమీ చేయడం లేదు. బాండ్‌లు మాత్రం జారీచేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 150 కోట్లు విలువైన బాండ్‌లు జారీచేశారు. ఇందులో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించారు. కోట్ల రూపాయలు కొల్ల గొట్టారు. మున్సిపాలిటీ జారీచేసిన బాండ్‌లను మార్కెట్‌లో 40 శాతం ధరకు విక్రయించుకున్నారు. అంటే రూ. 60 కోట్ల మేర లబ్ధి చేకూరింది. భీమవరం–తాడేపల్లిగూడెం ప్రధాన రహదారి, పట్టణంలో 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారుల్లో బాండ్‌లు జారీ అయిపోయాయి. అప్పటి మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ బాండ్‌లు జారీ చేయించారు. మున్సిపల్ శాఖలో ఉన్నతాధికారి చక్రం తిప్పారు. వారి ఒత్తిడితో క్షేత్ర స్థాయిలో బాండ్‌లు జారీ అయిపోయాయి. స్థల యజమానులు ఒకరైతే... బాండ్‌లు జారీ అయింది నిర్మాణదారులకు. ఇలా ఎన్నో బాండ్‌లు జారీ అయిపోయాయి. మరోవైపు వైసీపీ నేతకు అండగా ఉండే వ్యాపారులు కూడా లబ్ధిపొందారు. తమ దుకాణాలు మాస్టర్ ప్లాన్‌లో రహదారిలో ఉన్నాయి. ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి రాసిచ్చేశారు. బాండ్‌లు పొందారు. అమ్ముకున్నారు. ఇప్పటికీ మున్సిపాలిటీకి ఇచ్చిన స్థలంలో వ్యాపారాలు చేసుకుంటు న్నారు. తాడేపల్లిగూడెం– భీమవరం రహదారిలో ప్రధాన మిఠాయి కొట్టు యజమాని ఈ విధంగా భారీ మొత్తంలో లబ్ధి పొందారు. అధికార పార్టీ నేతకు ముడుపులు ముట్ట చెప్పారు.
స్థలాలు స్వాధీనం చేసుకోని మున్సిపాలిటీ
టీడీఆర్ బాండ్‌లు జారీచేసిన స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలి. తాడేపల్లిగూడెంలో మాత్రం అలా జరగలేదు. రహదారి విస్తరించినప్పుడు తీసుకుంటామని గతంలో అధికారులు చెప్పుకొచ్చారు.వాస్తవానికి తాడేపల్లి గూడెం–భీమవరం రహదారి విస్తరించే అవకాశం లేదని తెలిసి బాండ్‌లు జారీ చేశారు. స్థల యజమానులకు లబ్ధి చేకూర్చారు. టీడీఆర్ బాండ్‌ల జారీలో రూ. 60 కోట్లు మేర చేతులు మారితే వైసీపీ నేతకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరింది. బాండ్‌లు జారీ చేయించినందుకు బాండ్‌లు జారీ అయిన వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు.
సొంత స్థలాన్ని రాసిచ్చిన నేత
విమానాశ్రయ భూములకు ఆనుకుని వైసీపీ నేత 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి మీదుగా 60 అడుగుల రహదారి వెళ్లేలా మాస్టర్ ప్లాన్ రహదారి సిద్ధం చేశారు. మాస్లర్ ప్లాన్ రహదారిలో పడిన 60 సెంట్ల భూమిని గజాల రూపంలో మున్సిపాలిటీకి రిజిస్ర్టేషన్ చేసి ఇచ్చేశారు. అదికూడా భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ జరిగింది. అక్కడ ఎకరాల్లో కొనుగోలు చేసి గజాల్లో మున్సిపాలిటీకి రాసిచ్చిన ఘనుడు వైసీపీ నేత. అదేదో మున్సిపాలిటీకి అప్పనంగా ఇచ్చింది కాదు. బాండ్‌లు జారీ అయితే రూ. 15 కోట్లు లబ్ధి చేకూరేది. దానిని ఎన్నికల ముందు కూటమి నేతలు అడ్డుకున్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ వైసీపీ నేతకు పూర్తి స్థాయిలో సహకరించారు. మున్సిపల్ ఇన్‌ఛార్జ్ అధికారి సంతకం చేయకపోవడంతో బాండ్‌ల జారీ ఆగిపోయింది. రాష్ట్ర స్థాయి అధికారులతో మున్సిపల్ ఇన్‌ఛార్జ్‌పై వైసీపీ నేత ఒత్తిడి తేచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఇన్‌ఛార్జ్ అధికారి త లొగ్గలేదు. లేదంటే మున్సిపాలిటీ ఇచ్చే బాండ్‌ల రూపంలో రూ. 15 కోట్లు లబ్ధి పొందేవారు. ఇంతకి వైసీపీ నేత కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమి విలువ రూ.12 కోట్లు లోపలే ఉంది. ఆ మొత్తాన్ని కేవలం మున్సిపాలిటీ ఇచ్చే 60 సెంట్లతో లాగేద్దామని వైసీపీ నేత ఆశించారు. టీడీఆర్ బాండ్‌ల జారీ కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు. కూటమి నేతలు అడ్డుపడడంతో పాచిక పారలేదు.
స్థల యజమానులతో ఒప్పందాలు
మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైసీపీ నేత గ ట్టిగా నమ్మారు. మాస్టర్ ప్లాన్ రహదారి విస్తరించిన ఉన్న చోట స్థలాలను గుర్తించారు. స్థల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు. అడ్వాన్స్ రూపంలో సొమ్ములు చెల్లించారు. వైసీపీ అధికారంలో వస్తే ఆ స్థలాలకు బాండ్‌లు ఇప్పించుకునేవారు. మార్కెట్ విలువ ఆధారంగా వారికి సొమ్ములు ఇచ్చేవారు. మరో మూడు రెట్లు సొమ్మును వైసీపీ నేత కాజేసేవారు. ప్రభుత్వం మారిపోవడంతో ప్రణాళిక అడ్డం తిరిగింది. గతంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్‌ల వ్యవహారం తెరపైకి వస్తోంది.
టీడీఆర్ బాండ్‌లు ఎప్పుడు ఇవ్వాలి
రహదారులు విస్తరించాల్సి వస్తే స్థల యజమానుల నుంచి మున్సిపాలిటీ భూ సేకరణ చేస్తుంది. గజాల్లో తీసుకుంటుంది. అందుకు నాలుగు రెట్లు సరిపడా బాండ్‌లు జారీచేస్తుంది. రహదారి విస్తరిస్తుంది. దీనివల్ల స్థలం కోల్పోయిన యజమానికి ఇబ్బంది ఉండదు. మున్సిపాలిటీ సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం బాండ్‌లు ఇస్తుంది. వాటిని స్థల యజమానులు అమ్ముకుంటారు. లేదంటే తామే వినియోగించుకుంటారు. స్థలం ఇచ్చిన నాలుగు రెట్లు విస్తీర్ణంలో మున్సిపాలిటీ ప్లాన్ లేకుండానే అదనంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. దానివల్ల స్థల యజమానులు లబ్ధిపొందుతారు. టీడీఆర్ బాండ్‌లు కొనుగోలు చేసుకున్నా సరే వారుకూడా అనుమతులు లేకుండా అదనంగా నిర్మించుకోవచ్చు. అందుకు విశాఖ, విజయవాడల్లో బిల్డర్‌లు టీడీఆర్ బాండ్‌లను కొనుగోలు చేస్తుంటారు. బాండ్ విలువ మొత్తంలో 40 శాతం ధర ఇస్తారు.దీనిని తాడేపల్లిగూడెం వైసీపీ నేత సద్వినియోగం చేసుకున్నారు. కోట్ల రూపాయులు ఆర్జించారు.