Share News

నామినేటెడ్‌ వరం.. ఎవరికో..?

ABN , Publish Date - Jul 09 , 2024 | 12:08 AM

పార్టీలో ఐదేళ్లపాటు కష్టనష్టాలకు ఎదురొడ్డి పార్టీ కోసం, విజయం కోసం నిరంతర కష్టపడిన, వైసీపీ అరాచకాల కు బలైన, అక్రమ కేసులకు గురైన వారందరి కి తగిన గౌరవం ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయిం చింది.

నామినేటెడ్‌ వరం.. ఎవరికో..?

నియోజక వర్గానికి 100 పేర్లతో జాబితాలు

టీడీపీ అధిష్ఠానం సూచించింది ఇదే..

అక్రమ కేసుల్లో బాధితులకే అధిక ప్రాధాన్యత

ఈసారి మారిన నామినేటెడ్‌ కొలువుల ఛాన్స్‌

భారీ జాబితాలతో నష్టమంటున్న కేడర్‌

అధిష్ఠానానికి సంకేతాలు పంపేందుకు సన్నాహాలు

(ఏలూరు, ఆంధ్రజ్యోతి, ప్రతినిధి)

పార్టీలో ఐదేళ్లపాటు కష్టనష్టాలకు ఎదురొడ్డి పార్టీ కోసం, విజయం కోసం నిరంతర కష్టపడిన, వైసీపీ అరాచకాల కు బలైన, అక్రమ కేసులకు గురైన వారందరి కి తగిన గౌరవం ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయిం చింది. నియోజక వర్గాల వారీగా అక్రమ కేసులు ఎదుర్కొన్న వారిని, వైసీపీ అరాచకాలకు దీటుగా ఎదురొడ్డి నిలబడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. నియోజకవర్గ స్థాయిలో అందరిని గుర్తించి తమకు జాబితా అందజేయాల్సిందిగా ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా టీడీపీ అధిష్ఠానం మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే దాదాపు 100 మంది పేర్లకు తగ్గకుండా ఒక్కో నియోజక వర్గం నుంచి జాబితాను అధిష్ఠానంకు పంపారు. ఇక నిర్ణయించాల్సింది, పదవులు ఎవరెవరికి ఇవ్వాల్సింది అధిష్ఠానమే.

ఒకప్పుడు తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ముఖ్యనేతలు సిఫార్సులు చేసిన వారికి నామినేటెడ్‌ పద వులు దక్కాయి. పార్టీ విజయం కోసం కష్టించి పనిచేసిన అనేక వందల మంది అలాచూస్తూ ఊరుకునేవారు. పార్టీమీద ఉన్న అభిమానం అలాం టిది. ఎమ్మెల్యేలకు అనుంగ శిష్యులుగా ఉన్నవారికి సామాజిక వర్గాల్లో కాస్తంత బలం ఉన్నవారికి పదవులు దక్కేవి. పలానా వారికి నామినేటెడ్‌ పదవి వచ్చిందని, ప్రకటన వెలువడితే తప్ప అంతకు ముందుగా ఊహించ డమే కష్టంగా ఉండేది. ఈ పరిస్థితిని అంతటిని తెలుగుదేశం గడిచిన ఐదేళ్లల్లో ఆసాంతం పరిశీలించింది. తెలుగుదేశం కేడర్‌ ఊరు,వాడా వైసీపీ ఆరాచకాలను తట్టుకుని, నిలబడి పార్టీ విజయం కోసం ఎంతలా శ్రమిం చారో స్వయంగా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు.

టీడీపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, వైసీపీకి వ్యతిరేకంగా నిల బడతారో అటువంటి వారిని గడిచిన ఐదేళ్లల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. ఎక్కడికక్కడ కొందరి ఆస్తులను ధ్వంసం చేసింది. మరి కొందరిపై అక్రమ కేసులు బనాయించింది. వైసీపీ వాళ్లు దాడి చేసినా టీడీపీ వాళ్ల మీదే కేసు బనాయించేవారు. ఇలాంటి పరిణామాలన్నింటిని తెలుగుదేశం ముఖ్యనేతలంతా బరించారు. ఆఖరికి పార్టీ అధినేత చంద్ర బాబు అరెస్ట్‌ అయిన సమయంలోనూ ఎవరెవరు వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంది గమనించి వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశా రు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ప్రతి నియోజక వర్గంలోనూ పెద్ద సంఖ్యలో సాధారణ కార్యకర్తల మీద కేసులు లెక్కలేనన్ని నమోదయ్యాయి. ఒకవేళ ప్రస్తుత తాజా చట్టమే లేకపోతే టీడీపీ కార్యకర్తలతో జైళ్ళు అన్ని ఎప్పుడో కిక్కిరిసిపోయి ఉండేవి. అంతలాగా వైసీపీ వేధింపులను టీడీపీ కేడర్‌ ధైర్యంగా ఎదుర్కొంది. ద్వారకా తిరుమలతో పాటు అనేక మండలాల్లో కార్య కర్తలపై ఏకంగా హత్యాప్రయత్నాలు జరిగాయి. ఇంకొన్నిచోట్ల పంట పొలాలకు వెళ్ళే దారుల్లోనూ ఇంటి స్థలాల్లోనూ వివాదాలు సృష్టిం చారు. ఇక తెలుగుదేశం బతికిబట్ట కట్టరాదనే ధోరణిలోనే వైసీపీ వ్యవహరించింది. అప్పట్లో తెలుగుదేశం అధ్యక్షుడిగా ఇదంతా గమనించిన చంద్ర బాబు ఎన్నికల సభల్లో మాట్లాడుతూ అక్రమ కేసులు అంతు తేలుస్తా మని, అధికారంలోకి వచ్చాకా ఈ కేసుల వ్యవ హారం నిగ్గుతేల్చి ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కునారో వారందరికి పార్టీలో తగు గౌరవం ఇచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ భరోసా నేపథ్యంలోనే టీడీపీ ముఖ్యనేతలు, కేడర్‌ అందరికి నామినేటెడ్‌ పదవుల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం దాదాపు సంసిద్ధమై తగు సంకేతాలు పంపింది.

ఈసారి అంతా కేడర్‌కే పట్టం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిత్యం కష్టించి పనిచేసిన కేడర్‌కు ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల్లో స్థానం కల్పించి, వారికి గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా తెలుగుదేశం తన పార్టీ కేడర్‌లో ఎవరెవరు, ఎక్కడెక్కడ ఏఏ రీతుల్లో వైసీపీతో నిర్బీతిగా పోరాడింది, అక్రమ కేసుల్లో అలవోకగా ఎదుర్కొంది, ఆస్తి, ప్రాణనష్టం జరిగినా వెనుకంజ వేయకుండా పార్టీనే నమ్ముకున్నది ఎవరు? అనే అంశాలపై జిల్లాల వారీగా జాబితాలను సేకరించే పనిలో పడింది. ప్రతి నియోజకవర్గం నుంచి వందమందికి తగ్గకుండా గుర్తించి జాబితాలను పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు, మండల అధ్యక్ష కార్యదర్శులతో పాటు పార్టీలో వివిధ కేడర్‌లలో పనిచేస్తున్న వారందరి కష్టనష్టాలను గడిచిన ఐదేళ్ళల్లో బేరీజు వేసి మరీ తాము సూచించిన యాప్‌లోనే నమోదు చేసేందుకు అనువుగా ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఒక స్పష్టత ఇచ్చింది. ఎక్కడైతే నియోజక వర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో, వారి సమక్షంలోనూ, మరెక్కడైతే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఉంటారో వారి సాయంతోనే ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి తగ్గకుండా తాము సూచించిన మార్గదర్శకసూత్రాలకు అనుగుణంగానే పేర్లను వీలైతే ఈనెల 8,9 తేదీల నాటికే తాము సూచించిన యాప్‌లలో నమోదు చేయాలని ప్రకటించింది. ఈ నేపథ్యం లోనే జాబితాలన్ని ఎక్కడికక్కడ పరిశీలించి అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని, అందరి పేర్లను జాబితాలోకి చేర్చి అధిష్ఠానానికి నివేదించే పనిలో పడ్డారు.

అందరికి న్యాయం జరిగేనా?

ఒకప్పుడు మాదిరిగా కాకుండా ఈ సారి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో తెలుగుదేశం వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగానే ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది పేర్లతో కూడిన జాబితాను కోరిం ది. పార్టీలో కష్టపడి పనిచేసిన వారందరికి తగు భాగస్వామ్యం కల్పించేలా కసరత్తుకు దిగింది. అయితే పార్టీ ఆదేశించిన మేరకు ప్రతి నియోజక వర్గానికి 100మంది పేర్లను పంపించాలన్న నిర్ణయం పార్టీలో అందరికి

రుచించడం లేదు. ఎందుకనంటే ఎవరైతే పార్టీకి కోసం కష్టపడి పనిచేశారో, ఐదేళ్ళ పాటు కష్టనష్టాలకు ఓర్చి పార్టీయే ప్రాణంగా నిల బడ్డారో, వారు ఎవరు అనేది ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. కాని ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల పంపకంలో ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది పేర్లు ఉండాలన్న ప్రతిపాదనపై కొంత అసంతృప్తే వ్యక్తమవుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎలా కాదన్నా కనీసం రెండు డజన్లకే ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇప్పటికే అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో పాటు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు అందరిపై దాదాపు 700కు పైబడే చిన్నా చితకా కేసులు నమోదై ఉన్నాయి. కేవలం కక్ష సాధింపులకు దిగి తమకు సంబం ధం లేని కేసుల్లోనూ టీడీపీ కార్య కర్త పేర్లను అప్పట్లో పోలీసులు చేర్చేశారు. వీరందరి విషయం లోనూ తెలుగుదేశం జాగ్రత్తలు తీసుకోవాలని భావించినా, ఉన్న కొద్దిపాటి నామినేటెడ్‌ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో ఇంతమందిని చొప్పించడం సాధ్యమా? కాదా? అనేదే ప్రస్తుతం అందర్ని వేధిస్తున్న ప్రశ్న. జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు రెండు డజన్ల మందికి పైగా ముఖ్యనేతలు ఆర్థికభారంతో పాటు మిగతా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఒకవేళ 100 మంది పేర్లు సేకరించి కేవలం కొద్దిమందికి మాత్రమే పదవులు ఇస్తే మిగతా వారిలో అసంతృప్తి పెచ్చరిల్లిపోదా... అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకోసారి ఆచితూచి వ్యవహరించాలన్నదే అందరి అభిలాషగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధిక కేసులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఉండగా, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులపై డజనుకు పైగానే కేసులు ఉన్నాయి. తెలుగుదేశం అధిష్ఠానం నామినేటెడ్‌ పదవుల పంపకంలో ఎవరెవరికి అవకాశం ఇస్తుందో, ఇవ్వబోతుందో, మరో వారం, పది రోజుల్లో ఓ స్పష్టత రాబోతుంది.

Updated Date - Jul 09 , 2024 | 12:08 AM